గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, మార్చి 2012, ఆదివారం

మాయింటికి వచ్చిన భైరవ భట్ల బ్రదర్స్.కి, సనత్ కి ధన్యవాదములు.

శ్రీపతి సనత్, నేను, భైరవిభట్ల కామేశ్వర రావు,  వారి సోదరుఁడు విజయాదిత్య.
ప్రియ సాహితీ మిత్రులారా! ఈ రోజు శ్రీ భైరవ భట్ల కామేశ్వర రావు, వారి సోదరులు విజయాదిత్య,  శ్రీపతి సనత్ అభిమానంతో మాయింటికి వచ్చి మాకు ఆనందం కలిగించారు. వారితో కలిసి వివిధ సాహిత్యాంశాలతో ఇష్టాగోష్టి జరిపాము.
తదనంతరం శ్రీపతి సనత్ వారి ఎపార్ట్మెంట్కు తీసుకొని వెళ్ళి అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసి శ్రీ భైరవభట్ల కామేశ్వరరావుగారిచేత " తెలుగు కవుల వాగ్విలాసము " అనే అంశం పైనా,  నాచేత " చిత్ర కవిత్వము" అనే అంశం  పైనా ప్రసంగాలు ఏర్పాటు చేసారు. ఆసభకు అక్కడ ఆ " దివ్య కళాంజలి " అపార్ట్మెంటులో ఉన్న ఇరవై కుటుంబాలవారు అత్యంత శ్రద్ధాసక్తులతో వచ్చి, మా ఉపన్యాసములను విని, మమ్ములనెంతో గౌరవించారు.
ఈ సందర్భంగా అక్కడ నేను ఆసువుగా చెప్పిన పద్యాలు.
భైరవభట్ల వంశులును, భవ్య కవిత్వ విశిష్ట తత్వమున్
పారము జూచినట్టి ప్రతిభాయుత సత్కవి చక్రవర్తులున్,
చేరిరి నేడు మాదరికి, చెప్పగ నెంతటి భాగ్యమిద్ది? మం
దారవనంబయెన్  నగ ధన్యము దివ్యకళాంజలిద్ధరన్. 
కంద - గీత - గర్భ - ఉత్పల మాల. 
స్థిత సకలార్థమై, ప్రవర దివ్య కళాంజలి స్వర్గ మెన్న, హా
రతులు గొనుంగదా! సుజన ప్రాగ్వర భావ సుశోభితమ్ముగా!
నుత సుకవీశులన్, పరులు నొవ్వక పల్కెడి వాఙ్నిధాన భా
రతియిదియే యనన్ వినుత ప్రాంగణ మిద్ది భువిన్ గనంగనౌన్.
సకలార్థమై, ప్రవర ది
వ్య కళాంజలి స్వర్గ మెన్న, హారతులు గొనుం !
సుకవీశులన్, పరులు నొ
వ్వక పల్కెడి వాఙ్నిధాన భారతియిదియే !
ప్రవర దివ్య కళాంజలి స్వర్గ మెన్న,
సుజన ప్రాగ్వర భావ సుశోభితమ్ము!
పరులు నొవ్వక పల్కెడి వాఙ్నిధాన !
వినుత ప్రాంగణ మిద్ది భువిన్ గనంగ!
శ్రీపతి సనత్ ప్రభావిత
మీ పుణ్యభవంతి కన. సమీప్సితములు తా
నేపగిదినైనఁ గూర్చును.
దీపించును బాలునివలె దివ్యుండయ్యున్. 
దివ్యకళాంజలి వాస్తవ్యులు మాయెడ చూపిన ఆదరాభిమనాలకి వారికీ, మిత్రులు శ్రీపతి సనత్ గారికీ ధన్యవాదములు తెలియజేసుకొంటున్నాను.
జైశ్రీరామ్.
జైహింద్.
Print this post

4 comments:

Pandita Nemani చెప్పారు...

శ్రీ రామకృష్ణ కవికుల
వారాంనిధి చంద్ర సుగుణ భాసుర శ్రీలొ
ప్పారగ గర్భకవిత్వము
కూరిచి యలరించితీవు కోమల హృదయా!

ఆంధ్రామృతము బ్లాగు ద్వారా శ్రీ సనత్ మరియు శ్రీ భైరవభట్ల సోదరుల ఫోటోలను చూపి మాకు ఆనందము కూర్చిన మీకు మరియు ఆ మిత్రులకు మా హృదయపూర్వక శుభాభినందనలు. స్వస్తి.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! సన్యాసి రావుగారూ! మీ ఆశీః పరంపరా ప్రభావం మమ్ములను వర్ధిల్ల చేస్తోంది. మీ అవ్యాజానురాగానికి ధన్యవాదములు. నమస్తే.

కామేశ్వరరావు చెప్పారు...

రామకృష్ణారావుగారు,

మిమ్మల్ని, సనత్‌గారిని కలుసుకోవడం నాకూ చాలా సంతోషం కలిగించింది. మీరు గర్భ కవిత్వం అలవోకగా అల్లగలరని తెలుసుకాని, అలా ఆశువుగా అల్లగలరని యిప్పుడు ప్రత్యక్షంగా చూసినప్పుడే తెలిసింది, అబ్బురపరిచింది! అంతర్జాలంలో ఒక అవధానాన్ని మీరు తప్పకుండా నిర్వహించాలి.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

కామేశ్వర రావుగారూ!
మీరు అభిమానంతో మా గృహానికి వచ్చినందుకు నాకెంతో ఆనందం కలిగింది. మీ సహృదయతకు నా సంతోషం వ్యక్తం చేస్తున్నాను.
ఇక కవిత్వం విషయంలో మిమ్మల్ని చూడగానే మిమ్ములనుద్దేశించిన పద్యమూ, ఆ శ్రీపతి సనత్ గారి అపార్ట్మెంట్ చూడగానే ఆ గర్భ కవిత ఆవిష్కృతమయ్యాయి. అంతా ఆ శారదాంబ కటాక్షం. ఇక్కడ నేను నిమిత్త మాత్రుడనే. మీ అభిమానానికి ధన్యవాదములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.