గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, మార్చి 2012, శుక్రవారం

వసు స్వారోచిషోపాఖ్యానము (ద్వ్యర్థి కావ్యము) కీ.శే. క్రొత్తపల్లి సుందర రామయ్య.

ఆర్యులారా! 1875- 1949 మధ్య కాలమున జీవించి యున్న కీ.శే.క్రొత్తపల్లి సుందర రామయ్య గారు ఒక గొప్ప కవి. వారు రచించిన వసు స్వారోచిషోపాఖ్యానము అను ద్వ్యర్థి కావ్యమును మీ ముందుంచుతున్నాను. ఇందు మను చరిత్ర మరియు వసు చరియ్ర వ్రాయఁబడినది. విడి విడి గా ఏ కావ్యానికాకావ్య కథా గమనాన్నిమీరు పడికట్ట కలరని ఆశిస్తున్నాను.
వసు స్వారోచిషోపాఖ్యానము
ద్వ్యర్థి కావ్యము
ఆః-
ఆట పట్టు సిరికి న్యాయంబునకు, నధి - ష్ఠాన మనఁగ దనరి సౌధ వినిహి
తాబ్జ రాగ కాంతి నరుణాస్పదంబనఁ - బురము దనరు లోక భూషణంబు. ౧.
చః-
పురి ద్విజ కోటి ధాత, నృప పుంగవు లర్జును, వైశ్య పాళి కి
న్నరవరు, నంఘ్రిజుల్ హలిని, నట్టువకత్తెలు రంభ, నాగముల్
తురగములున్, మహీరుహతతుల్ సుర సింధుర సైంధవాద్రులన్
నిరతముఁ గ్రిందు సేయఁ దగు నేర్పున రంజిలు మంజు వైఖరిన్. ౨.
గీః-
పచ్చడాల్ పూని సకలార్థ భవ్య సాధ - నాత్మ పౌరుష వాగ్జాల మతిశయింప,
నతి ముదంబున వీర పండితు లనంగ - వెలయు చుందురు వీఁటఁ బ్రవీణులెపుడు. ౩.
ఆః-
భూమి దేవుఁడందుఁ బొల్చును ప్రవరాఖ్య - నుపరిచరుడనంగ నొప్పి వసువు
న్యాయ రీతి మిగుల నార్జించిన ఘనుండు - తేజ మొప్పఁగ ద్విజ రాజ కులము. ౪.
కః-
ఆర్యావర్తన రహితుఁ, డ - శీర్యత్సుగుణ ప్రవృత్తి, చేది వినుతుఁడై
ధైర్య గుణ మొప్ప నాతని - చర్యన్ వినుతింప వశమె! శత ధృతికైనన్. ౫.
గీః-
అనఘ వర్తనఁ బరమ వంశావతంస - మగుచు నిచ్చలుఁ దగు ప్రవరాఖ్యుఁడైన
వసు విభుం డార్య నుత శతాధ్వర గృహీత - భవ్య లక్షణుఁడగుచు శోభను వహించు. ౬.
గీః-
అందమల పద్మ సంతతి నలవరించి - దివ్య గుణమణులందు శుక్తిమతి నాఁగఁ!
గర్మ పావన మూర్తియై ఘనత నొప్పు - నది విబుధ హర్షమై మహోన్నతిని గాంచు. ౭.
గీః-
ఆత్మ భార్యానురాగుఁడై యవ్వ, సుప్ర - భుండు నాయన మిత మతిఁ బొరసి యుండ,
ఘన సమితిఁ బొంగు గాంచుచు ఘనత నెసఁగఁ - బారువాఁడెంత వాఁడైన వరలఁ గలఁడు? ౮.
వః-
ఆ ప్రవరాఖ్యుండగు వసురాజు. ౯.
గీః-
పాడి పంటలఁ దనరు జీవనము గల్గి - యింబడర, ఘన కోలాహలంబు పెఱిగి,
పైనఁ బడి శుక్తిమతి నాగ, దాని పని మ - దిని దలఁచి సచ్చరణ భవ ఘనత నెట్టె. ౧౦.
వః-
ఆ ద్విజ రాజ వంశజుఁడు దిగంతములఁ గను కీర్తిఁ గల్గి యుండునంత. ౧౧.
గీః-
అమర నాథానుమతి స్వస్థలమున కొకట -వచ్చి యుండినఁ బల్వురు పాక శాస
నత్వమునఁ బవిత్రప సదనమునఁ బొగడ - నాతి మోదానఁ బతి వసు నేతఁ గనును. ౧౨.
కః-
అతఁడీ విధమున నభ్యా - గత సేవాభిరతిఁ గొంత కాలము భాగ్యో
న్నతి నుండు నంత నభ్యా- గత వేళం గౌతుకంబు గడలు కొనంగన్. ౧౩.
సీ:-
ఎఱ్ఱని జటలతో నెసఁగు జొంపము గల - వి లసితమగు క మండలువు తోడ,
భస్మ గర్భామోద బంధుర రుద్రాక్ష - మాలికా సత్ కదంబముల తోడఁ
దళతళ ద్యుతులతో దళమెత్తు పోల్కి నెం - తయు వన్నె గల మృదు త్వక్కు తోడ,
నందమై కొనసాగు యర్జునంబున నొప్పు - కమనీయ మౌ తిలకంబు తోడ,
గీః-
ఎంతయును జెన్ను మీఱి వసంతుఁడనఁగఁ - బరగు నౌషధ సిద్ధుండు ప్రజల కెల్ల
నయన పర్వంబుగా మహోన్నతిని గాంచి - మించి యతని కొలమున కేతెంచె నొకట. ౧౪.
వః-
ఇట్లుండునంత నతి బలాధికుండు. ౧౫.
ఆః-
అతని రాకఁ జూచి, హర్షంబుతో నెదు - రేగి, గౌరవింప నెంచి తోడి
తెచ్చి యిష్ట వస్తు దృప్తిని దేలించి - మెలఁగు నా సమీర మెలసి యంత.౧౬
గీః-
చెలఁగ నీ రెందుఁ బోవుచు క్షితిని నిందు - రాక యయ్యెను సిద్ధ మహా కుతుకము,
తీర్థములఁ జూచు వేడుక దీర్ఘమయ్యె. - ననఁ బసరు పూసెనంతట ఘనము గాఁగ . ౧౭.
గీః-
వేఁడి వేలుపు మహిమంబు విపులమైన - హిమ నగము పాద లేపనముమిషగాఁగఁ
జేరె సంతోషమున మంచు, చేతఁ బాసి - యొండు చోటికిఁ బోలేక యుండు నచట. ౧౮.
మః-
పువులం బండ్లను, బల్లవంబులను నొప్పుల్ గుల్కి రంజిల్లఁగాఁ
దవు తీవల్ పొదలున్ దరుల్ బహుళమై దౌదౌల నేత్రోత్సవం
బవుచున్, దేటులుఁ జిల్కులున్ బికము లాహ్లాదంబుగా నంతటన్
రవళిన్ బల్కులఁ గూతలం జెవులకున్ రమ్యంబు గావింపఁగన్.౧౯.
గీః-
అటవి రక్షక చిత్తుఁడై యతఁడు తేరు - కొని కడుం ద్రిమ్మరుచుఁ జెంత గొనబు మీఱు
పాట నొప్పెడు కోనను బాఱఁ జూచి - తన ప్రధాన వర హృదయ మనుగమింప.౨౦.
వః-
అంతఁ జని దానిం గనుంగొనుమన మున. ౨౧.
చః-
కనె నవరత్న భాసితముఁ, గాంచన శోభిత, మార ఘట్ల మం
డన కదళీ వనాంతము, ఘన స్వన బంభరవా సిత ప్రఫు
ల్ల నవ సుమాతిగంధి మృదులచ్ఛదరాజి లతా ప్రతాన నీ
కనదురు కాయమాన పరి కల్పిత శీత మనోజ్ఞ హర్మ్యముల్. ౨౨.
కః-
కనుఁగొని హర్మ్యోపాంతం - బునకుం జని లోనికేఁగఁ బొలఁతి యొకతె వీ
ణను బూని కంఠ నాదం - బును మేళము సేసి గానము సలుపఁ జూచెన్. ౨౩.
ఆః-
అంత నాకె యంద మారసి వేవేగ - వచ్చి విభుని చాయ భావమంచు,
మెచ్చి మనుజ వర్య! మీర లేలిన నన్ను - మిన్న యంచు జనము నెన్నకుంద్రె? ౨౪.
కః-
అనిన నేకతంబుగను వనంబున నీవు - వచ్చి యుంటివ! బల!! యిచ్చటికిని
దారిఁదప్పిపోక నేరక యుంటి, మా - ర్గమ్ముఁ జూపుమన్న నెమ్మి ద్విజుఁడు. ౨౫.
కః-
మును వచ్చిన దారిని - నే - వినుత చరిత! చనఁగ వచ్చు, వేఱె యొరులు దా
రిని చూప వలెనె? పోవం - గను జూపెద, నంటి వచ్చి కనుఁగొనెదు గదా! ౨౬.
గీః-
అనుచుఁ దా వరూధిని నిల్వ నతని "ననఘ! - కొంత తడవోపి యుండినఁ గుతుక మొప్ప
నశ్రమంబున నేఁగంగ నగును గాదె?" - యంచుఁ గోరఁగ బోవఁగా నెంచి యతఁడు. ౨౭.
గీః-
పోవలయు వేగ, నా యింటి పువ్వుబోడిఁ - జూడవలె, నిత్య కృత్యముల్ చొప్పు దప్పి,
యుండె, నా మది దానిపై నొనర - నెపుడు  -  గాంతునని హిత! కార్య సంహటన కొఱకు. ౨౮.
కః-
అన, నను గూడఁగ నీకున్ - గననగు సౌఖ్యంబటంచుఁ గైకొని యాలిం
గన మును జేయఁదగ, దనియుఁ - జను పొమ్మని గెంటని హిత సంభ్రమ మొలయన్. ౨౯.
గీః-
పిలిచికొని పోయి చూపినఁ బ్రేమ మీఱ - నంగనను పెద్ద సేయఁగ నాత్మ - మాటు
సేసి కనుఁ బురుషవరుండు చిత్తమలరఁ - గా మముల నువిదల మించు కామ మున్నె! ౩౦.
వః-
అటులననివారిత మోహావేశముఁజూపి, తాను ౩౧.
కః-
ఎంత తపోధనులగుచున్ - సంతతముఁ జరించినను యశం బలవడునే
కాంత ననురూప లసితం - గాంతగఁ గైకొనక దూరఁగా నెవ్వరికిన్. ౩౨.
వః-
అనిన విని, ౩౩.
గీః-
నేన యతి మార్గమును బూని నియత వృత్తి - నాకె యుండిన గృహమున కేకతంబు
గాఁగఁ జనియెద సంతోష గరిమ మెఱయ - ననుచు శుచి వేడి చనిన నయ్యతివ యంత. ౩౪.
గీః-
ప్రియ సఖులతోడ మిక్కిలి ప్రేమ మీఱ - నతనిఁ గనుఁగొనఁ జని కనకాసన మర
గతిని గొనివెట్ట, వసియింపఁ గని ప్రియాళి - తోడ సేవింపఁ, గొనినట్టు గూడఁ జేసి. ౩౫.
గీః-
నీకు వసు విభుండొక్కఁడుచేకురెడి న - టంచు నన, వారు హర్షంబు నందు మునుఁగ
గొంత తడవుండి యందొక్క యింతి మంజు - వాణి యిట్లని పల్కె సర్వంబుఁ దెలియ. ౩౬.
గీః-
విమల మతి! యెందుఁ బోయెడు వేడ్క నిందు - వచ్చి రతుల మతిని ప్రేమ వరలఁ జేయఁ
దగును, గాన మురువు మీఱఁ దలిరుఁ బోడి - వెదక వచ్చినఁ గనఁ దగు విధి కొమరుల!?౩౭.
కః-
అన నను గౌతమ విఖ్యా - తిన బిలిచెద రేను గోపతిని గూర్చి తపిం
చిన దాననే యశము గల - ఘన పదముం బొందితి నని కడు ప్రేమమునన్. ౩౮.
గీః-
సు ఖగతిని నాయనను గాంచ సుదతి కేళి - వనమునకుఁ బద్మినీ జాతి వరలఁ దేఁగ
వచ్చి, ఛద్మ ప్రవరాగవార్థిఁ గాంచి - చెంతకుం జేరి, తనియని చెలువు మీఱ. ౩౯.
గీః-
అతివ పావనమౌ జన్మ మరయ, నాకు - నేడు సంతోషమయ్యెడు జాడఁ దెలియఁ
జెప్పి యొప్పింప వలె నని, చెలి మనమునఁ - దలఁచి యడిగినఁ బలికె నంతట నెలంత. ౪౦.
గీః-
నిత్య పూజా రతిని - తగు నెలవుఁ బాసి - విధి సమీపించి, యంతట వెడలి శుక్తి
మతి తిరుగరాఁ బథంబున మరలు కొనఁగ - నగవర ప్రాప్తి సంగతి మగువ కలిగె. ౪౧.
కః-
గిరికాంచితమగు ఖ్యాతిం - జరియించెడు నన్న, సంతసంబునఁ "దరుణీ!
కరమును మది నెంచితి - వసు - వరు నొక్కని గూడ నగును వనిత" యఁటన్నన్. ౪౨.
వః-
ఆ లతా తన్వి యిట్లనియె. ౪౩.
కః-
ఎన్నండిట కేతెంచెడి - నెన్నండిట మమ్ముఁ జూచు నెన్నఁడు మాతోఁ
గ్రన్నన మాఱాడెడినో - యన్నరవరుఁడనుచుఁ దలఁతు మయ్య మహాత్మా! ౪౪.
గీః-
అనినఁ గోరెదు గావున ననవరతము - పరుల కుపకృతిఁ గావించు పట్ల నెట్టి
కార్యములనైనఁ గావింపఁగా వలెఁ గద! - సమయమున మానినీ! తోడ సరఁగ నిపుడు. ౪౫.
గీః-
క్షితి విభునిఁ గను కోర్కెను జెలియ! తీర్తుఁ - గన్నుఁ గవ మూయనగునంతఁ గలియ వచ్చు.
ననిన నయ్యెడ నతని వచనము వినుచుఁ - గువరుఁడంతట రాఁ దన భవనమునకు. ౪౬.
గీః-
అతని రాకకు మెచ్చి మహా ముదంబు - గదుర రతి నుండఁగా స్వల్ప కాలముననె
యతఁడు చెలి జతనంబున హర్షమంది - చనఁగ - సఖి గాంచె సు కుమారు సార్వభౌము. ౪౭.
వ-
అతఁడు స్వరోచియై వెలయుచుండ, ౪౮.
కః-
కని ముదమందఁగఁ బెంచిన -  ఘన మతి సర్వంబెఱింగి, కడు పెంపడరం
గను, నవలఱేని తోడం - గని యెఱుక పడంగఁ గాంక్ష గారమున ననెన్. ౪౯.
సీః-
క్ష్మాతలాధిప! నేఁడుగా మామనోభీష్ట - ములు దీరఁ గల్గె నోములు ఫలించె.
గహ్వరీపతి! నేఁడుగా మా నయన పంక్తి - నిర్మలమయ్యెఁ బున్నెంబు సేసె.
భూమి పాలక ! నేఁడుగా మా తమః పట - లంబు విరిసెను చిత్తంబు మెఱసెఁ
గాశ్యపీ వర! నేఁడుగా మా వనస్థలుల్ - ధన్యంబులయ్యె శస్తతఁ జెలంగె.
గీః-
నీ హిత క్రియ నిల నేఁడ నెగడఁ గల్గెఁ - గాన నేమని చెప్పుదు మానవేంద్ర!
జంతుజాలంబులెల్ల నీ శరణమంది - యుండెఁ గాకున్నఁ జీవించి యుండఁగలవె? ౫౦.
గీః-
అనిన మోదంబు తోడ హితార్హ కార్య  - మునను జనియుండనొక్కెడ, ముదిత! యడరు
చాయఁదగ వినుచును, జేరి సకియ వార్తఁ - గనఁగ వచ్చితి ననిన నక్కాంత యంత. ౫౧.
కః-
అయ్య మనోరమ సఖి నే - నయ్యుపవని స్వైరవృత్తినమర, సఖులతో
నొయ్యన సుమాపదేశము - చయ్యనఁగాఁ జని ముదంబు సంధిల్లంగన్. ౫౨.
గీః-
చిన్నతనముననుండుటఁ జేసి, చేరి - యుండఁ బొడమెడుమతి నా మహోత్తమ "సుమ
నో విశేషత నంతటను ముని రాగ - దత్త శా ప క్రియను వచ్చితిత్తఱి" నని. ౫౩
వః- 
మఱియు ౫౪.
గీః-
అందు - చే, నను నీ యన నిం దగఁ గొనఁ - గర్చురాకార! సంబాధ్య కలనవేగఁ
బుచ్చ వచ్చితి. రా! జన్య యిచ్చ దీర్పు - మనుచు శాస్త్ర హృదయ మీయ ననఘబుద్ధి. ౫౫.
గీః-
అంత సమ్ముఖ మతిఁ గౌతుకాభిలాష - నట్టు చెంతకుఁ జని రస ముట్టి పడఁగ
మొనయ నాతఁడు ఖ చరుఁడైనను హితుండు - హయము నెక్కించి చనిన నయ్యబల వెనుక. ౫౬.
కః-
ఆ పెను వగతో నుద్యా - నోప శమముఁ బొంద డిగ్గ నొప్పున నంతన్
భూపుఁ గనను, పరిచర, మతి - యేపునఁ జనుదెంచి వృత్తమెఱిఁగింప వెసన్. ౫౭.
కః-
కొనిపోయి భవనమునకుం - దన యంగనఁ బెండ్లి సేయఁ దత్పర మతియై
చని మంజువాణి తోడనె - వినయంబున భూమి భృత్సవిధ దేశమునన్. ౫౮.
గీః-
నిలిచి వృత్తాంతమంతయుఁ దెలుప సుదతి! - కన్య కల నిచ్చమైఁ దోఁపగా ముదానఁ
బొంగి తనియని ప్రేమఁ దానుం గరంబు - నొసఁగఁ గొని సుఖమునఁ బోవనున్న నచట. ౫౯.
గీః-
చెంతవారాశయముఁ గాంచఁ జేరి యలస - గమన వచియించు పలుకుల గారవమున
విని విడువ లేని కూర్ముఁ దా వెలఁదుల నొగిఁ - గూడి యుంగరమును బూని కుతుకమునను. ౬౦.
వః-
ఇట్లుండునంత, ౬౧.
గీః-
ఒక్క తఱిఁ జారు లోచన యొప్పు మీఱ - రా నగుడు, సముచిత వాక్య రత్నములను
గారవించియు గురు మోహ కారణమున - మెలఁగ తెఱగంటి దొర కొమరుల నొగిఁ గని. ౬౨.
గీః- 
వారిఁ దగురీరిఁ జూడంగ వసుమతీత - లంబునుం గూర్చి వచ్చి, వనంబుఁ జొచ్చి,
యతఁడు గిరి భర్త నొప్పింప నాత్మఁ దలచి - యుండఁగాఁ జారు లోచన మెండుగఁ గని. ౬౩.
గీః-
తలచి "నా వసువును గొనఁ దగునయ" యని - "నాదు చిత్తముఁ దీర్చుట న్యాయ" మనుచు
వేడ్క హృదయస్థ భావము వెల్లడింప - నల్లు హాళినిఁ గోర్కెఁ దా నంటి యుండ. ౬౪.
గీః-
ముదిత - వన లక్ష్మి యై యుండ సదమల మతి - నాథుఁడయ్యింతి సంగతి నయమునఁ గని
కాంచ స్వారోచిషు నతఁడు కమ్ర భక్తిఁ - గొల్వ ముదమంది వసు భర్త కోర్కెఁ దీర్చి. ౬౫.
కః-
"రెండవ మనువనగా భూ - మండలి రక్షింప వలయు మనుజుల కోర్కెల్
పండగఁ జేయుచు నిరతం - బుండు" మనుచుఁ జనియె, శుభము లొదవె, ప్రజకిఁకన్. ౬౬
ఉః-
పాయమునందు మిత్తి, చలపాది గొనంబున సత్తి, తొచ్చెమౌ
రో యెలనాగ బత్తి, చెడు త్రోవను జేరిన బుత్తి, లేక - దీ
ర్ఘాయురనంత ధీ ప్రియ హితాఖిల మార్గగ భుక్తులేర్పడన్
బాయని కౌతుకంబును శుభంబును గల్గుత మెల్ల వేళలన్. ౬౭.
కః-
కుజన త్రి జగద్విలయా! - సుజన మనో నిలయ! తాప శోషణ మలయా!
వృజిన విపిన దహనా! వి - శ్వ జనీన ప్రకట కార్య వహన! సుసహనా!. ౬౮.
చిత్ర పద వృత్తముః-
భక్త జనావన దక్షా! - ప్రాక్తన శాసన పక్షా! - యుక్త విచారణ దీక్షా! - సక్త మహేశ్వర రక్షా! ౬౯.
గీః- 
కావ్యమొనరించి, భరత వాక్యమ్ము నొడివి, - తొలి పలుకులైన వ్రాయక కలిసె హరిని.
భారమెవ్వరొ గైకోక పోరటంచు, - ప్రథిత సంస్కారి, సుందర రామ సూరి.
కీ.శే. క్రొత్తపల్లి సుందర రామయ్య విరచిత వసు స్వారోచిషోపాఖ్యానము అను ద్వ్యర్థి కావ్యముసంపూర్ణము.
స్వస్తి.
జైశ్రీరామ్.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మంచి హృదయా నంద కరమైన కావ్యాన్ని అందించి నందులకు ధన్య వాదములు. ఇవి ఎన్ని సార్లు చదివినా చదవాలనే ఉంటుంది. ఇంకా ఏమైనా " పారిజాతాప హరణం , విజయ విలాసం , ఆముక్త మాల్యద , వంటి " ప్రముఖుల కలం నుంచి జాలు వారిన కావ్యాలను అందించ గలరు. ఇలా ఎందరినో పరిచయం చేయ గల మీ సహృదయతకు జోహార్లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.