గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, మార్చి 2012, మంగళవారం

ప్రజాపత్రిక వీక్లీ 85 వ వార్షికోత్సవంలో నన్ను సత్కరించిన సందర్భంగా నా కృతజ్ఞతలు.

జై శ్రీరామ్.
నమస్తే.
తే.04 - 03 - 2012 న రాజ మహేంద్ర వరమున దర్మంచర కమ్యూనిటీ హాలు నందు సాయంత్రం 4 గంటలకు
ప్రజా పత్రిక వీక్లీ 85 వ వార్షికోత్సవంలో అవ్యాజానురాగంతో నన్ను సత్కరించిన గౌరవ పార్లమెంట్ సభ్యులు ఉండవిల్లి అరుణ కుమార్ గారు, నెల్లూరుకు చెందిన జమీన్ రైతు పత్రికా సంపాదకులు గౌరవనీయులు శ్రీ యన్. డోలేంద్ర ప్రసాద్ గారు, మహామహోపాధ్యాయ శ్రీ విశ్వనాధ గోపాల కృష్ణగారు, జాతీయ బహుమతి గ్రహీత శ్రీ దివాన్ చెరువు శర్మగారు, డా. జాంపండు మాష్టారు, ప్రజా పత్రిక నిర్వాహకులు శ్రీమతి రమాదేవి గారు, గౌరవ నిర్వాహకులు యస్.సుదర్శన్ గారు, ప్రజాపత్రిక కుటుంబ సభ్యులు, మున్నగు  యావన్మందికీ నా హృదయ పూర్వక ధన్యవాదములు తెలియ జేసుకొంటున్నాను.
నేను నిర్వహించుచున్న " ఆంధ్రామృతం "  అంతర్జాల పత్రికలో గల నా రచనలను చూచి, " శ్రీ వేణుగోప కంద గీత గర్భ చంపకోత్పల శతకము మున్నగు వానిని పఠించి, నా పై అవ్యాజానురాగబద్ధులై ఆ సభలో నన్ను ఘనంగా సత్కరించిన మీ అభిమానానికి నా కైమోడ్పులు.
౧) ఉ:- శ్రీద వచోవిలాస శుభ చిన్మయ మూర్తులు, జ్ఞాన దీప్తులౌ
సోదర సోదరీమణుల శోభిలఁ జేయగ వేడుకొందు. నా
వాదమునందు దోషములు వచ్చిన మీరవి ఒప్పులట్లుగా
మోదము తోడ గాంచుడని మున్మును భక్తిగ మీకు మ్రొక్కెదన్.
౨) ఉ:- శ్రీ సుఖదాయియై, సుకవిశేఖర పాళికి జన్మనిచ్చి, స
ద్భాషగ తెల్గు వెల్గ, కవితా రస సృష్టికి హేతువైన, సం
తోష శుభాస్పదంబగు వధూటికి, రాజమహేంద్రి వీటికిన్
శ్వాసగ నిల్చు సజ్జనుల సన్నుతి చేసి, నమస్కరించెదన్.
౩) ఉ:- స్తుతమతులైన సత్కవుల, శోభిత సద్గుణగణ్య వర్యులన్,
స్థితమగు ప్రజ్ఞ నొప్పు శుభ చిత్తుల, దివ్య ప్రసన్నమూర్తులన్,
సతత లసత్ సువాగ్వరుల, శారదమాతకు ముద్దుబిడ్డలౌ
యతుల మనోజ్ఞ భావకుల నాత్మను నిల్పి, నమస్కరించెదన్.
౪) ఉ:- రాజ మహేంద్రి దివ్య కవి రాజులఁ గన్న పురంధ్రి. సద్గుణ
భ్రాజిత! మాననీయ గుణ భాసిత, సంతత సత్సమేత. యు
త్తేజముఁ గొల్పు దేవత, సుధీవరపాళిని గన్నమాత. సం
పూజిత దివ్య ధాత్రి. శుభముల్ కలిగించెడి భాగ్య జాతయే.
౫) కంద - గీత - గర్భ చంపక మాల:-
అ) చ:- నుత జన పాళితో, ధర ననూన నయాన్విత తత్వ బోధనా
కృతుల సనాథయౌ, పరులకెన్నగరాని ప్రభావిశాల యీ
క్షితి. తన సంస్కృతీ హృదుల చేతన, రాజమహేంద్రిమాత దై
వత మణియే భువిన్! శిరము వంచి నమస్కృతి చేతు భక్తితోన్.
ఆ) క:- జన పాళితో, ధర ననూ
న నయాన్విత తత్వ బోధనాకృతుల, సనా
తన సంస్కృతీ హృదులఁ జే
తన రాజమహేంద్రి మాత! దైవత మణియే!
ఇ) గీ:- ధర ననూన నయాన్విత తత్వ బోధ!
పరులకెన్నగరాని ప్రభావిశాల !
హృదుల చేతన రాజమహేంద్రి మాత !
శిరము వంచి నమస్కృతి చేతు భక్తి!
౬) ఉ:- బంధ కవిత్వ మెన్నుదురు  పండిత వర్యులు కొందరిందు. స
త్సుందర భావనా గరిమతోఁ గలవానిని కొందరెంతు రిం
కొందరు గీత, సీసములు కోరు. మదిం గని వ్రాతునయ్య నే
నందరు మెచ్చ బంధముల నద్భుత సుందర గీత, సీసముల్.
౭) ఉ:- ఈశు ననుజ్ఞ చేసి షిరిడీశ్వర సత్ శతకంబు వ్రాసి, సం
కాశపు వేణు గోప శతకంబును బంధమునందు వ్రాసితిన్.
శ్రీ శివ పంచచామరలు శీఘ్రమె వ్రాసితి నొక్కనాడె. యా
వేశముతోడ వ్రాసితిని వేగమె సత్శతకద్వయంబిలన్.
౮) ఉ:- ఆత్రము తోడ నన్ బిలిచి, యందరిలోనట సత్కరించి, నా
పాత్రను గుర్తు చేసి, నను పన్నుగ వ్రాయగ గోరి రీ ప్రజా
పత్రిక బంధు కోటి. ఘన పండిత పామర కోటి మెచ్చగా
ధాత్రిని సుస్థిరంబవగ తప్పక సత్ శతకంబు నెమ్మితోన్.
౯) క:- వ్రాసితి నొక దినముననే
శాసనమన రామ కృష్ణ శతకంబును. యా
ద్యాసను మరునాడే నే
జేసితినయ!  వృద్ధ బాల శిక్ష రచనయున్.
౧౦) శా:- అవ్యాజంబగు ప్రేమ జూపి, సభలో నత్యంత సద్భావనా
దివ్య స్వాంతము తోడ నిల్పి నను సందీపింప జేయం గృపన్
భవ్యుల్ మీరలు  సత్కృతుల్ సలిపిరే! ప్రఖ్యాతులౌ మీకు నే
భావ్యంబెంచి కృతజ్ఞతల్ తెలిపెదన్, భక్తిన్ మదిన్ నిల్పెదన్.
మరొక్క మారు పేరుపేరునా మీ అందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదములు ఆంధ్రామృతం ద్వారా తెలియ జేసుకొంటున్నాను.
నన్ను సత్కరించుచున్న వార్తకు స్పందించి అభిమానంతో సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన డా.పసుపులేటి రామచంద్రరావు గారికి, విశ్రాంత తెలుగు ప్రథమోపాధ్యాయులైన శ్రీ గోదావరి శ్రీరామకృష్ణ గారు మున్నగువారికందరికీ నా ధన్యవాదములు.  
నమస్తే.
ఇట్లు
సజ్జన విధేయుఁడు,
చింతా రామ కృష్ణా రావు.
Print this post

4 comments:

Pandita Nemani చెప్పారు...

అభినందనలో సద్గుణ
విభవానందా! మనమ్ము వెలుగొందె బళా!
శుభమస్తు రామకృష్ణా!
అభినవ కవితాభిరామ! యని దీవింతున్

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ధన్యోస్మి పండితోత్తమ!
గణ్యుండుగ చేసె మీదు ఘన దీవెనలే.
పుణ్యాత్మునైతి మిము గని.
సన్యాసి వర ప్రభావ సన్నుతులివి యౌన్.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

చాలా సంతోషం తమ్ముడూ ! అభినందన మందారాలు

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

చింతా వారికి అభినందన మందార మాల.

ఎంతో నా మది పొంగెను
సంతోషమ్మది జరిగిన సత్కారమ్ముల్
చింతా వారికి పద్యం
గంతులు వేయించు వారి కల్పన మతికిన్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.