గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, సెప్టెంబర్ 2011, గురువారం

శరన్నవరాత్రులు సందర్భంగా శుభాకాంక్షలు.

 ఆది శక్తి స్వరూపిణి దుర్గమ్మ
సహృదయ పాఠకులారా!
శరన్నవరాత్రులు సందర్భంగా ఆదివ్య శక్తి స్వరూపిణి యైన దుర్గమ్మ కరుణా కటాక్షములు సహృదయ పాఠకులైన, భక్తులైన మీకు లభించు గాక.
సీll శైలపుత్రీ!మమ్ము చేకొని రక్షించు. 
బ్రహ్మచారిణి!దివ్య భావమిమ్ము.
చంద్రఘంటా! మాకు సద్భావనములిమ్ము.
కూష్మాండమాతా!సుగుణములిమ్ము.
స్కందమాతా!మాకు కామితార్థములిమ్ము. 
కాత్యాయనీ! శ్రీవికాసమిమ్మి.
కాళరాత్రీ! మాకు కవన పాటవమిమ్మి.
శ్రీమహాగౌరీ!వసించుమ మది.
గీll మమ్ము శ్రీసిద్ధిధాత్రీ! ప్రమాదములకు
దూరముగ నుంచి కావుమా! దుర్గమాంబ!
శక్తిఁ గొల్పుమ! దుష్ట దుశ్శక్తి బాపి,
కాచి రక్షించుమమ్మరో! కమల వదన!
జైశ్రీరాం.
జైహింద్.


Print this post

5 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు.
కన్నుల విందు చేస్తున్న అమ్మ దివ్య మంగళ రూపం , ఆ దేవి కటాక్ష వీక్షణములు అందరి పైన ప్రసరించాలని . చక్కని చిత్రాన్ని ఉంచిన శ్రీ చింతా రామ కృష్ణా రావుగారికి అభినందనలు.

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

తెల్లని తామర పూవులు
మల్లెల మాలికలు నెఱ్ఱమందారములున్
చల్లని తల్లికి నింద్రుని
విల్లే హారముల వోలె వెలుగుచు నమరెన్

ఇంద్రుని విల్లు = ఏడు రంగులుగల ఇంద్రచాపము

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:

గురువర్యులు శ్రీ కంది శంకరయ్యగారికి, శ్రీ చింతా రామకృష్ణరావుగారికి,శ్రీ పండిత నేమాని వారికి, కవింతులంద్రి కవి మిత్రులందరికి నవరాత్రి శుభాకాంక్షలు

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:

బ్రహ్మ విష్ణు మహేశ్వర ప్రాభవమ్ము
శారదా లక్ష్మి పార్వతి శక్తులనగ
ముగ్గురమ్మల రూపమై మోక్షమొసగు
వేద గాయత్రిమాతయే విశ్వహితము

Pandita Nemani చెప్పారు...

శ్రీమాత్రేనమః

ఓమ్మను పుండరీకమున నొప్పెడు పద్మభవాండ పాలినీ!
ఐమ్మను జ్ఞానమందిరమునందు జెలంగెడు వేద సంస్తుతా
హ్రీమ్మను క్షేత్రరాజమున హృద్యముగా విహరించు నీశ్వరీ!
శ్రీమ్మను నీ పదాంబురుహసీమను మ్రొక్కెద సర్వమంగళా!
పండిత నేమాని

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.