గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2011, మంగళవారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(దత్త పది1)

ఆర్యులారా!
అవధానిగారు చేసిన అవధానములలో నేటి నుండీ దత్తపది - పూరణలను పరికించి  పూరించడానికి  మనమూ ప్రయత్నం చేద్దామా?
సరే ఈ రోజు దత్త పది.
క్రాంతి - శ్రాంతి - భ్రాంతి - శాంతి.
విషయం:- గాంధీ తాతను గూర్చి వర్ణనము.
మీరు మీ పూరణలతో పాఠకులనలరించగలరు.
నాయొక్క, అవధానిగారి యొక్క పూరణణలు వ్యాఖ్యలలో చూడనగును.  
జైశ్రీరాం.
జైహింద్.


Print this post

13 comments:

కంది శంకరయ్య చెప్పారు...

క్రాంతిపథగామియై వి
శ్రాంతి నెఱుంగక స్వజనుల సంకెలలను వి
భ్రాంతిగఁ ద్రెంచెను గాంధీ
శాంతి నహింసలను దెలిపి సంస్తులు లందెన్.

Pandita Nemani చెప్పారు...

అయ్యా! నమస్కారములు.
సుందరకాండను ఒక్క పద్యములో చెప్పాలని పూర్వము ఒక చంపకమాలలో చెప్పేను. ఇప్పుడొక సీసములో కొంచెము విపులముగా చెప్పుచున్నాను.
శ్రీరామచంద్రు నాశీర్వాదమున్ బొంది
ఘన వారిరాశి లంఘనమొనర్చి
చేరి లంకాపురి సీతకు ప్రణుతించి
శ్రీరఘూద్వహుని ముద్రికనొసంగి
క్షేమవార్తను జెప్పి క్షితిజ శోకము బాపి
వనమెల్ల డుల్చి యక్షుని వధించి
దశకంధరునికి హితమ్మును బోధించి
తదుపరి లంకనంతయును గాల్చి
అరిగి రాముని చెంతకు నరసినాడ
సీతనని జెప్పి స్వామికి చింత దీర్చి
హర్షమున మెప్పులొందిన ఆంజనేయ!
ప్రణతులను గూర్తు నీకు నో పవనతనయ!

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

శాంతియహింసల గొని వి
భ్రాంతిగ గొనితెచ్చె,నాడు భారత ప్రజకున్
క్రాంతిని, దాస్యపు నిశి లో
కాంతిని,స్వాతంత్ర్య గతిని గాంధి విధాతై!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఈ దత్త పదికి నా పూరణము.

క్రాంతి మార్గ సుదర్శిగా గాంధి తాత!
శ్రాంతి శూన్యుఁడు. చూడ రారాజితండు.
భ్రాంతిదూరుడితండు.భవ్యాత్ముఁడితఁడు.
శాంతి మార్గ విరాజ చాచాహితుండు.

ఇందెన్ని ఛందస్సులున్నాయో గుర్తించారా?
గుర్తిస్తే మాకూ తెలీయ జెప్పుతారా?

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఈ దత్త పదికి అవధాని గారి పూరణము.

క్రాంతి తొలంగగానటుల ఖద్దరు బట్టను కట్టినాడు. వి
శ్రాంతియె లేక వాడలను సంచలనమ్మును రేపినాడు. వి
భ్రాంతత వీడిపోవగను భారత జాతికి జీవగఱ్ఱయై
శాంతి నిదానమై వెలసె శాశ్వత కీర్తికి గాంధి తాతయై.

కంది శంకరయ్య చెప్పారు...

నాకైతే తేటగీతి, ద్విపద కనిపిస్తున్నాయి.

Pandita Nemani చెప్పారు...

క్రాంతిన్ ధర్మపథానుగామి భరతక్ష్మా దాస్య మోక్షంబుకై
శాంతిశ్రీ కలితాంతరంగుడు ధృతిన్ సత్యాగ్రహంబూనుచున్
భ్రాంతిన్ జీల్చి బ్రిటిష్షు పాలకులకున్ భాసిల్లి సన్నేతయై
శ్రాంతిన్ గోరక పొందె సత్ఫలితమున్ స్వాతంత్ర్యమున్ గాంధిజీ

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

క్రాంతిపథమ్ము సర్వజన కామితమై చెలగన్ సుహాసినీ
శాంతి కపోతమై వెలిగె, సాయుధమూర్తుల ముంగిటన్ భళీ,
భ్రాంతి తొలంగె తెల్లదొర పాలకరాక్షస జాతికిన్, సవి
శ్రాంతిని నిల్పగా భరత జాతికి స్వేచ్చను తెచ్చె గాంధియే.

కంది శంకరయ్య చెప్పారు...

నా పూరణలో పద్యాంతంలో ‘సంస్తుతు లందెన్’ అని చదువుకొనవలసిందిగా మనవి.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శంకరయ్య గారూ!
మీ దత్తపది పూరణ బాగుంది. ధన్యవాదాలు.

ఆర్యా!హనుమచ్ఛాస్త్రి గారూ! క్రాంతిని విభ్రాంతిగ కొనితెచ్చె. వాహ్! అద్భుతంగా చెప్పారండి. ధన్యవాదాలు.

ఆర్యా! ఆంధ్ర అధ్యాత్మరామాయణ కృతికర్తా! మీరు చేసే దత్త పది పూరణ కూడా కావ్యత్వాన్ని పుణికి పుచ్చుకుంటోందండి.
ధన్యవాదములు.

సంపత్కుమర్ శాస్త్రి గారూ! మంచి పట్టుగా సాగింది మీ రచన. ధన్యవాదాలు.

ఆర్యా!నేమాని సుకవి పుంగవా!
సుందర కాండ ఒక సీస పరిమితం చేసి బహుళ ప్రయోజనం చేకూర్చిన మీకు నా హృదయ పూర్వక కైమోడ్పులు.

మిస్సన్న చెప్పారు...

భ్రాంతిని వీడి యా దొరలు భారత ధాత్రిని వీడి పోవగా
క్రాంతి పథమ్మునన్ నడపె గౌరవ మొప్పగ భారతీయులన్
శాంతి, యహింస, సత్యమను సాత్త్విక శస్త్రములన్ ధరించి వి-
శ్రాంతిని కోరకెన్నడును జాతికి తండ్రి మహాత్ము డెన్నగన్ .

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

క్రాంతి బాటను చూపిన గాంధి తాత
శాంతి బావుట నెగరేసి భ్రాంతి బాపి
దేశ మంతట నహింస లేశ మైన
విశ్ర మింపక చేపట్టి విశ్రమించె !

తమ్ముడూ ! తప్పులు లేకుండా ఉంటేనే ప్రచురించు .

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

ఆర్యా ! ధన్య వాదములు.
నా పూరణలో పొరపాటున దత్త పది లోని "శ్రాంతి" బదులు 'కాంతి' ని వాడను. చిన్న సవరణతో ....

శాంతియహింసల గొని వి
భ్రాంతిగ గొనితెచ్చె,నాడు భారత ప్రజకున్
క్రాంతిని, దాస్యపు నిశి లో
కాంతిని,విశ్రాంతి లేక గాంధి విధాతై!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.