గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, సెప్టెంబర్ 2011, శనివారం

గురు దేవో భవ అని పూజింపబడటానికి గురువు ఎలాగుండాలంటారు?(నవ భారత నిర్మాణంలో గురువు పాత్ర.)

ఆర్యులారా! సెప్టెంబరు ఐదవ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం.
ఆచార్య దేవో భవ! అని అందరిచే ఆచార్యుఁడు గౌరవింప బడుతున్నాడు.
మన సమాజం ఎనలేని గౌరవాన్ని ప్రప్రథమంగా తల్లికి, పిదప తండ్రికి, ఆతరువాత గురువుకి ఇస్తోంది. ఇది చాలా సముచితం. ఎందు చేతనంటే విద్యార్థులకు జ్ఞాన జ్యోతులను తన మాటద్వారా, తమ అకళంక సత్ప్రవర్తన ద్వార్వా విద్యార్థులను తీర్చి దిద్దేదీ, జీవన మార్గాన్ని నిర్దేశించేదీ గురువే. అట్టి గురువు తల్లిదండ్రులతో పాటు గౌరవింపబడ వలసిందే.
ఈ సందర్భంగామీ అభిప్రాయాలను కూడా సమాజానికి పంచాలని అభిప్రాయపడుతున్నాను.
అట్టి అసాధారణ గౌరవం పొందడానికి ఆచార్యులు కలిగి ఉండ వలసిన అర్హతలను, అచార్యుని బాధ్యతలను వివరిస్తూ మీ అభిప్రాయాలను స్వేచ్ఛగా పద్యాల రూపంలో గాని, వచన రూపంలో గాని వివరించండి. ఆచార్యులు అకళంక మూర్తులుగా వెలుగొందే మార్గం సూచించండి. 
ఇందు నిమిత్తము నేను మీకు ముందుగానే కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నాను.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

17 comments:

Pandita Nemani చెప్పారు...

గురు ప్రశస్తి

గురు శబ్దంబునకే యుదాహరణమై కూర్మిన్ ప్రకాశించుచున్
సరసోత్సేకమయాంతరంగుడగుచున్ ఛత్రాళికిన్ దైవమై
కర మొప్పారుచు సాధు బోధనములన్ గావించుచున్ జ్ఞాన భా
స్కర బృందంబులగా నొనర్చు గురు సంస్కారంబు నెన్నన్ దగున్

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

పండిత నేమాని వదాన్యా! నమస్తే.

గురువులకున్న బాధ్యతలు గుర్తుకు తెచ్చిరి పండితోత్తమా!
గురువులు దేవతా సములు. కూర్మిని చేరెడి శిష్య కోటికిన్
పరమ పవిత్ర భావములు పంచి మహాద్భుత శక్తిఁ గొల్పుచున్
కరుణను జూడగా వలయు. గౌరవమద్ది. గురుత్వమద్దియే.

మీ స్పందనకు ధన్యవాదములు.

Pandita Nemani చెప్పారు...

గురు ప్రశస్తి (చిన్న సవరణతో)

గురు శబ్దంబునకే యుదాహరణమై కూర్మిన్ ప్రకాశించుచున్
సరసోత్సేక మయాంతరంగుడగుచున్ ఛాత్రాళికిన్ దైవమై
కర మొప్పారుచు సాధు బోధనములన్ గావించుచున్ జ్ఞాన భా
స్కర బృందంబులగా నొనర్చు గురు సంస్కారంబు నెన్నందగున్

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

గురువుల నుపదేశింపగ
గురువుల కేఁదగును.వారిఁ గొలువగఁ, దనపై
కరుణాదృక్కులఁ గొనుమని
దరిజేర వలయును. శిష్య ధర్మంబిదియే.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మందాకిని గారూ!
శిష్య ధర్మాన్ని చక్కగా సెలవిచ్చారు.
గురువులు ఎలాగుండాలని మీరు భావిస్తే అలాగ గురువులను వారి ధర్మాన్ని నిర్వచించి, సద్గురువులను ప్రోత్సహించి, అజ్ఞానాంధులుంటే వారి కళ్ళు తెరిపించండి.ధన్యవాదములు.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

గురువర్యా,
గురువుల లక్షణాలు నిర్దేశించే దుస్సాహసం చేయలేని శిష్యపరమాణువును. మన్నించండి. గురుస్తుతి మాత్రం చేయగలిగాను.


చదువులు నేర్పుచు,శిష్యులు
ముదముగ నున్నత గతులును,మోక్షపు దారుల్
వెదకెడి పరిణతి నిత్తురు.
సదయులు గురువుల నుతింప శక్యమె మనకున్?

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మందాకిని గారూ!
మీ గురు భక్తిని అభినందిస్తున్నాను.
మీరే గురువైతే ఎలాగుండాలని, మిమ్మల్ని మీరు ఎలా తీర్చి దిద్దుకోవాలనుకుంటారో వివరించగలరా?

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

ఆర్తిగ నేను నేర్పెదను, హాయిగ భీతులనెల్లవీడుచున్
నేర్తురు, పిల్లలందరిట నిత్యము నిష్ఠగ మక్కువెక్కువై
కీర్తులు కోరనెప్పుడును కీరపుఁ బల్కుల చిన్నవాండ్రకున్
పూర్తిగ, నాశతీరగనుఁ, బొందుదు నేనిక నాత్మతృప్తినే.

Pandita Nemani చెప్పారు...

అయ్యా!
గురులన్ మించిన విద్వదుత్తముడవై కొండంత లక్ష్యంబుతో
పరితోషంబున శిష్యకోటిని కళాపారీణులన్ జేసి భా
సుర యోగంబుల నొంది ఛాత్రులలరన్ శుద్ధాంతరంగమ్ములో
పరితృప్తింగని యొప్పు నీ సుగుణ శోభాదీప్తి వర్ధిల్లుతన్

రాఘవ చెప్పారు...

సిద్ధం సత్సంప్రదాయే స్థిరధియమనఘం శ్రోత్రియం బ్రహ్మనిష్ఠం
సత్త్వస్థం సత్యవాచం సమయనియతయా సాధువృత్త్యా సమేతమ్,
దమ్భాసూయాదిముఖ్యం జితవిషయగణం దీర్ఘబన్ధుం దయాళుం
స్ఖాలిత్యే శాసితారం స్వపరహితపరం దేశికం భూష్ణురీప్సేత్.
-- శ్రీశ్రీశ్రీ వేదాంతదేశికాచార్యులవారు

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

కారుణమూర్తియై జనుల గౌరవభావనకాలవాలమై
ధీరగుణంబులన్ సరళ దృష్టినిఁ గల్గి సదానుకూలుఁడై
మారని శ్రద్ధతో గురువు మానక బోధలఁ పాఠనమ్ములన్
చేరిన శిష్యులందుఁదగు శీలగుణమ్ములఁ బెంచగాదగున్.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

గురువు బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుని కన్న
మించి నట్టి వాడు; మంచి నెపుడు
నేర్పి యాచరించి నిష్ఠతో లోకాన
నిలువ వలయు, వెలుగు నీయ వలయు.

మిస్సన్న చెప్పారు...

విద్యార్థులను స్వంత బిడ్డలుగా నెంచి
..................బంగరు భవితకు బాట పఱచు
మాతృ భాషను నేర్వ మమతను రగిలించి
...................అన్యభాషాసక్తి నాదరించు
నీతిని, సఛ్ఛీల నిరతిని బోధించి
..................యుత్తమ పౌరులౌ యునికి తెలుపు
ఋజు మార్గ వర్తియై రేబవల్, బోధించు
..................మార్గాన చనియెడు మనికి గలుగు
అన్య ప్రవృత్తుల ననుసరింపక తన
..................వృత్తికి బద్ధుడై వెలయు చుండు

విద్య పరమార్థమును దెల్పి విశదముగను
భావి భారత పౌరుల పాలి దైవ
సదృశుడై యొప్పు గురువెగా సద్గురువగు
కాని నాడా గురువు కొఱగాని యొజ్జ.

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:

మహానుభావులు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి సుమాంజలుల నర్పిస్తూ,ఆ మహనీయుని జయంతి సందర్భముగా నేటి ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులందరకు శుభాకంక్షలు తెలియజేస్తున్నాను.

గురువై దేశపు పరువై
గురుతర బాధ్యతలనెపుడు గుర్తించుచు తాన్
పరవశమున పాఠములను
మురిపింపగజెప్పునట్టి మూర్తికి జేజే

బడినే గుడిగా దలచుచు
బడి పిల్లలె బిడ్డలనుచు వాత్సల్యముతో
బుడతల నడతలు మార్చగ
నడుగిడు యొజ్జలకు భక్తి నంజలులిడుదున్

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

సవరణ
3 వ పాదంలో
"బుడతల నడతలు దిద్దగ" {మార్చగ బదులు దిద్దగ అని సవరిచాను}

గన్నవరపు నరసింహమూర్తి చెప్పారు...

గురువుల యెడ భక్తి భావము మాకుంటుంది అని చెబితే మా ఊరిలో గురువులు ( టీచర్లు ) చాలా ఆశ్చర్యపోతారు.ఇక్కడ అంతా ఉద్యోగ ధర్మము,వ్యాపారమే గాని విశేష భావాలకు తావు లేదు. చక్కని గురువులు నాకు లభించారు. నేను అదృష్టవంతుడినే !

స్థిరమగు జ్ఞానసంపదలు శిష్యుల కిత్తురు పూని శ్రద్ధతో
గురుతర బాధ్యతల్ గొనుచు కోమలహృద్యులు దివ్యసద్గురుల్
వరమది సద్గురుల్ గలుగ వారిని గొల్చెడి శిష్యపాళియున్
పరమ పవిత్ర బంధ మిది ప్రాకట మయ్యెగ పూజ్యభూమిలో !

మిస్సన్న చెప్పారు...

ఆర్యా! మీ సూచన నాకు శిరోధార్యము.

విద్యార్థులను స్వంత బిడ్డలుగా నెంచి
..................బంగరు భవితకు బాట వేయు.
మాతృ భాషను నేర్వ మమతను రగిలించి
...................అన్యభాషాసక్తి నాదరించు.
నీతిని, సఛ్ఛీల నిరతిని బోధించి
..................యుత్తమ పౌరులౌ యునికి తెలుపు.
ఋజు మార్గ వర్తియై రేబవల్, బోధించు
..................మార్గాన చనియెడు మనికిఁ గలుగు.
అన్య ప్రవృత్తుల ననుసరింపక తన
..................వృత్తికి బద్ధుడై వెలయు చుండు.

విద్య పరమార్థమును దెల్పి విశదముగను
భావి భారత పౌరుల పాలి దైవ
సదృశుడై యొప్పు గురువెగా సద్గురువగు?
కాని నాడా గురువు కొఱగాని బరువు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.