గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, సెప్టెంబర్ 2011, గురువారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(దత్త పది4)

ఆర్యులారా!
కట్టమూరి వారు పూరించిన దత్త పది మీ ముందుంచుతున్నాను.
"బాబూమోహన్ - బ్రహ్మానందం - కోట - ఆలీ"
విషయము:- పచ్చదనము పరిశుభ్రత.
కవిగారి పూరణము, నా పూరణము వ్యాఖ్యలలో చూడనగును.
మీ పూరణములతో పాఠకులకానందప్రదులగుదురని ఆశిస్తున్నాను.
శుభమస్తు.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

12 comments:

Pandita Nemani చెప్పారు...

అయ్యా! శ్రీ రామకృష్ణ గారిని(ఊక దంపుడు) ప్రశంసించుచున్నాను. నా పద్యములో తప్పు దొర్లినది. తొందరపడి ఏ పనియు చేయరాదని సామెత ఉన్నది కదా. నేను సరిగా చూడకుండనే పద్యమును గబ గబా టైపు చేసాను. ఆ పద్యమును మార్చి ఈ పద్యమును వ్రాస్తున్నాను:
బృందారక వినుతు సదా
నంద నిధానుని త్రినేత్రు నగజాపతి న
ర్ధేందు ధరుని శివుని సుజన
బృందావన తత్పరున్ మహేశున్ గొలుతున్
శ్రీ రామక్రిష్ణ గారికి శుభాశీస్సులు.
పండిత నేమాని

కంది శంకరయ్య చెప్పారు...

సేబాసు!చెట్లు పెంచిన
బాబూ! మోహనము మదికి బ్రహ్మానందం
బై బహుహితములఁ గూర్చును;
కాబోలును సౌరుకోట, కాదాలి కదా!
(ఆలి = హీనము, పరిహాసము)

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

తులసి కోట నింట తెలిసి పెంచగ వలె
బాబు! మోహనమ్ము పచ్చ చెట్లు
చుట్టు పట్ల పెంచ శోభనా లిక చూడ
బ్రహ్మ నందు నుతుని భార్య నిలచు.

కంది శంకరయ్య చెప్పారు...

నమ్ము మిదియె బాబూ! మోహనమ్ము గాదె
పచ్చదనము;బ్రహ్మానంద మచ్చముగను
గలుఁగు; పరిశుభ్రతయె కోటగా ప్రకృతియె
మేలు నారోగ్య మిడెడి యా లీలఁ గనుము.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఈ దత్త పదికి అవధాని గారి పూరణము.

బాబూ!మోహన మైన పచ్చదనమే వ్యాపించె నేడెల్లెడన్.
మాబాగంచును పల్లెవాసులును బ్రహ్మానంద సందోహమై
సేబాసంచును నెల్లవారలును తా చేయెత్తి జై కొట్టగా
ఏబోంటెట్లలిగే విధాన ననినన్ నీకోటమెట్లయ్యెడిన్.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఈ దత్తపదికి నా పూరణము.

వినుమా బాబూ మోహన!
వనములు మన ప్రాణ శక్తి బ్రహ్మానందం
బు నరయ పచ్చని కోటలు.
హననము తగదయ్య మాట లాలింపుమయా!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శంకరయ్య గారూ! మీ రెండు పూరణలూ అద్భుతంగా ఉన్నాయి. ధన్యవాదములు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ!
బ్రహ్మను అందుకొనేలా చెసి బ్రహ్మానందం అనిపించారు. ధన్యవాదములు.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

ఆర్యా! ధన్యవాదములు.
బ్రహ్మ నందన (నారద ) నుతుని(నారాయణుని ) భార్య (లక్ష్మి) తాండవిస్తుందని నా భావం.
కానీ సరిగా కుదరలేదు. వీలయితే ఆ అర్థంలో సరిపడు పాదాన్ని సూచించ గలరు.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

చిన్న సవరణ తో...

తులసి కోట నింట తెలిసి పెంచగ వలె
బాబు! మోహనమ్ము పచ్చ చెట్లు
చుట్టు పట్ల పెంచ శోభనమా లీల
బ్రహ్మ నందన నుతు భార్య నిలచు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

కోట జూడ నెంచి గోలు కొండకు బోవ
బాబు మొహనమ్ము బాగు బాగు
పాందు లంత కలసి బ్రహ్మానంద మునుబొంది
గోలు కొండ కనిరి యాలి తోడ

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అక్కా పద్య భావం బాగుంది ఐతే మూడవ పాదమే కొంచెం సరి చేయవలి ఉంది.

పాందులంతనచట పరమ బ్రహ్మానంద
మొందె నాలి తోడ నొనరె సుఖము.

అని మార్చితే బాగుంటుందని నా సూచన. ధన్యవాదములు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ధన్య వాదములు తమ్ముడూ !

కోట జూడ నెంచి గోలు కొండకు బోవ
బాబు మొహనమ్ము బాగు బాగు
పాందు లంత నచట పరమబ్రమ్మా నంద
మొందె నాలి తోడ నొనరె సుఖము

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.