గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, సెప్టెంబర్ 2011, మంగళవారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(సమస్యాపూరణ15)

తేజో మూర్తులారా!
శ్రీమాన్ కట్టమూరి చంద్రశేఖరావధాని గార్కి ఒక అవధానంలో ఇచ్చిన సమస్యను మీ ముందుంచుతున్నాను.
"మానిని మానముం జెరచి మాన్యతఁ బొందె మహాత్ముడై, భళా!"
ఈ సమస్యకు నా పూరణను,
అవధానిగారి పూరణను వ్యాఖ్యలలో చూడ గలరు.
మీరు మీ అసాధారణ ప్రతిభా పాండిత్యాలు లోక విదితమయే లాగున ఈ సమస్యకు పూరణము చేసి వ్యాఖ్య ద్వారా పాఠకులకానందావహులగుదురని ఆశిస్తున్నాను.
శుభమస్తు.
జై శ్రీరాం.
జైహింద్. 
Print this post

15 comments:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఈ సమస్యకు నా పూరణము.

జ్ఞాన వివర్ధతం బరగ గౌరవ మబ్బును. చూడుఁడయ్య! స
మ్మాన గుణుండు దుష్టుఁడయి మాన్యత దూరుఁడయెం బ్రపూజ్యయౌ
"మానిని మానముం జెరచి. మాన్యతఁ బొందె మహాత్ముడై, భళా!"
మానిని నుద్ ధరించ నొక మర్త్యుఁడు తాళిని కట్టి యామెకున్.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఈ సమస్యకు అవధాని గారి పూరణము.

మానిని కుంతి కోరికను మాన్యుఁడు సూర్యుఁడు తీర్పనెంచగా
కానక పల్కితిన్నిటుల. కన్యను నేనని పల్కెనామె. న
య్యో నను పిల్చితంచు సమయోచిత రీతిని పల్కి యయ్యెడన్
"మానిని మానముం జెరచి. మాన్యతఁ బొందె మహాత్ముడై, భళా!"

సమయోచిత రీతిని పూరించిన అవధాని గారికి అభివాదములు తెలియఁ జేస్తున్నాను.

కంది శంకరయ్య చెప్పారు...

శ్రీనవలాధవుండు భువి క్షేమముఁ గూర్చెడివాఁడు రాముఁడై
మౌనివరుండు గాధిజుని మాటపయిన్ బరిమార్చె తాటకన్
పూనికఁ గృష్ణరూపమున పూతన ప్రాణముఁ దీసె నివ్విధిన్
మానిని మానముం జెరచి మాన్యతఁ బొందె మహాత్ముఁడై, భళా!
(మానము = గౌరవం, పౌరుషం)

Pandita Nemani చెప్పారు...

అమ్మా! సోదరీమణీ! రాజేశ్వరీ!
ఎప్పటికప్పుడు మీరు చేసే స్పందనలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటున్నాయి.
సాహితీ రంగమున సదాసక్తి గలిగి
యొప్పుగా స్పందనము జేయుచుండునట్టి
నేదునూరి రాజేశ్వరిని మనసార
బొగడి యాశీస్సులిడుదు సుబోధకముగ

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

వేనకు వేలు వర్షములు పెద్ద పతివ్రత యంచు మెచ్చు స
మ్మానిత గాథ మార్చ, నది మానుము తప్పని చెప్ప విజ్ఞులే!
మానక, నొక్క కావ్యమున మంచిని చెడ్డగ జూపి యందు నా
మానిని మానముం జెరచి,మాన్యతఁ బొందె మహాత్ముడై, భళా!

Pandita Nemani చెప్పారు...

ధ్యానములోన నున్న సతి యంజన గర్భములోన జేర్చె నీ
శానుని వీర్యమున్ సుకృతి శంకరు నానతి వాయుదేవుడ
మ్మానిని పొందె సూను హనుమానుని మారుత మవ్విధమ్ముగా
మానిని మానమున్ జెరచి మాన్యత నొందె మహాత్ముడై బళా

అజ్ఞాత చెప్పారు...

దుష్యంతునకు అన్వయిస్తున్నానండీ, ఉచితమనే అనుకుంటున్నాను. గురువులు చెప్పాలి.

కానలకేగివేటకని, కణ్వమునీశునివాటిడగ్గరై
కానగజొచ్చి నాతనిని కానక; కూతును కాంచిచంద్రబిం
బానను, ప్రేమదోపెనని పల్కిప్రియంబులఁ, పెళ్ళిపేరునన్-
మానిని మానముం జెరచి. మాన్యతఁ బొందె మహాత్ముడై, భళా!

మిస్సన్న చెప్పారు...

ధేనువు లెడ్లునుం గిరులె దేవత లెన్నగ గోపకాళికిన్
మానెద మింద్ర పూజలన మాధవు, డా సురరాజు కిన్కతో
పూనిక రాళ్ళ వాన జడి పోయగ గోగిరి, నెత్తి వానికిన్
మానిని! మానముం జెరచి మాన్యతఁ బొందె మహాత్ముడై, భళా!

గోగిరి=గోవర్ధనగిరి.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

పండితోత్తములకు కృతజ్ఞతలు , + ధన్య వాదములు. ఇది నా భాగ్యము.

Pandita Nemani చెప్పారు...

రానున్న దసరా పండుగకై అమ్మ చేతిపై ఒక పద్యము:
ఏ చేతి స్పర్శతో నెల్ల తాపములుడ్గు
నా చల్లనగు చేయి అమ్మ చేయి
ఏ చేయి తాకుచో ఎద చాల నుప్పొంగు
నా వెచ్చనగు చేయి అమ్మ చేయి
ఏ చేయి రక్షయై యెల్ల యెడల బ్రోచు
నా యూతమగు చేయి అమ్మ చేయి
ఏ చేయి యొజ్జయై యెల్ల చిద్యల నేర్పు
నా దివ్యమగు చేయి అమ్మ చేయి
అమృత ధారలు కురిపించు నమ్మ చేయి
అమిత సౌఖ్యంబుల నొసంగు నమ్మ చేయి
అఖిల బంధమ్ములను బాపి అమ్మ చేయి
అంత్యమున మోక్షమునొసంగు నమ్మ చేయి

మిస్సన్న చెప్పారు...

ఆర్యా ధన్యవాదములు.
పండిత నేమాని వారి అమ్మ కర ప్రశంస అనుపమానం.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

ఆర్యా ! ధన్యవాదములు.
మీ విశ్లేషణ లో శంకరయ్య గారి పేరు పొరపాటున శంకరమ్మ గా పడినది . సరిజేయ గలరు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శంకరయ్య గారూ! పదానికుండే అర్థ బాహుళ్యాన్ని చక్కగా ఉపయోగించుకొని చేసిన మీ పూరణము ప్రశంసనీయముగ నున్నది. అభినందనలు.

హనుమచ్ఛాస్త్రి గారూ! చాలా చక్కగా ఊహించి పద్య రచన చేసి భావంతో ప్రాణం పోసారండి. బాగుంది మీ ప్రయోగ వైవిధ్యం. అభినందనలు.

పండిత నేమాని గురు వరుల పూరణ ఎలాగుందో వేరే చెప్పే పనేముంటుంది. అద్భుతం. వారికి నా ధన్యవాదములు.

అజ్ఞాత గారు దుష్యంతుని వృత్తాంతంతో సమస్యను నివారించారు. చాలా బాగుంది. వారి పేరుకూడా మనకు తెలిసేలా చేస్తే మరీ బాగా ఉండేది. వారికి నా అభినందనలు.

మిస్సన్నగారి కవిత పాకాన పడుతోంది. చాలా ఆనందం కలిచిస్తోంది. వారికి అభినందనలు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

హనుమచ్ఛాస్త్రి గారూ!మాపార్టుమెంటులో వినాయకులు పూజ చేయించే హడావిడిలో గమనించే అవకాశం లేకపోయింది. అక్షర దోషాన్ని సరి చేయించినందుకు ధన్యవాదాలు.

కంది శంకరయ్య చెప్పారు...

చింతా వారూ,
ధన్యవాదాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.