గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, సెప్టెంబర్ 2011, శుక్రవారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(సమస్యాపూరణ14)

కవి మిత్రులారా!
అవధాని గారికి సమస్యా పూరణ కొఱకిచ్చిన మరొక సమస్యను చూద్దాము.
"కరులు హిమాచల హరులను కారించె భళా!"
(కారించె = బాధ పెట్టెను) 
ఈ సమస్యకు నా పూరణమును, అవధానిగారి పూరణమును  వ్యాఖ్యలో ఉంచగలను.
మీరు మీ అమోఘమైన పూరణల ద్వారా పాఠకుల నలరింప జేయ గలనని ఆశిస్తున్నాను.
శుభమసు.
జై శ్రీరాం.
జైహింద్.
Print this post

14 comments:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఈ సమస్యకు నా పూరణము.

హరియించెడి వన మృగముల
హరియింతురు ప్రభువులట విహారములన్.రా
డ్వరులు తమప్రజల కభయం
"కరులు. హిమాచల హరులను కారించె భళా!"

ఈ సమస్యకు అవధాని చంద్ర శేఖరం గారి పూరణము.

హరులయి మానసమునలా
హిరులయి, రసిక వరు దోచు హిమ పూరములయి.
సరవిని పెద్దన కవి వా
"క్కరులు హిమాచల హరులను కారించె భళా!"

కంది శంకరయ్య చెప్పారు...

హరుఁడు నిటలనయనుఁడు శం
కరుఁ డిదె యేతెంచు ననుచుఁ గడుకొని బారా
బరి సేయు ప్రమథగణ కిం
కరులు హిమాచల హరులను కారించె భళా!

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

అరె ! కాశ్మీరును పాక్ ము
ష్కరులే దాటంగ నెంచ గాంచి తరిమె, స
త్వరమున; భారత రక్షా
కరులు. హిమాచల హరులను కారించె భళా!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శంకరార్యా! కరులను కింకరులుగా చేసిన మీ సామర్ధ్యము అభినందనీయము.

మందాకిని గారూ! గుహ్వర కరులను ప్రత్యక్షం చేసి సమస్యను విడదీసారు. బాగుంది. మీకు నా అభినందనలు.

హనుమచ్ఛాస్త్రి గారూ! భారత రక్షాకరులు మీ పద్యం వింటే ద్విగుణీకృత ఉత్సాహంతో భారతాంబకు తమ సేవలను అందించక మానరు. మీకు నా అభినందనలు.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

ఆర్యా ! ధన్యవాదములు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

కురిపించగ శశి కౌముది
మురిపించుచు నవని జనుల ముదముగ నెపుడున్ !
దరి జేరి నసుర భయం
కరులు హిమాచల హరులను కారించె భళా !

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అక్కయ్యా! బాగా చేయ గలిగారు పూరణ.
మూడవ పాదంలో దరి చేరి అని కాకుండా దరి చేరుచు అని ఉండి ఉంటుంది. టైపింగ్ లో జరిగిన పొరపాటై ఉంటుంది. సరి చేయగలరు. మీకు నా భినందనలు.

మిస్సన్న చెప్పారు...

సరి యాసేతు హిమాలయ
గిరి పర్యంతమును తిరిగి కృతక మతమ్మున్
తరిమిరి యావల కా శం-
కరులు. హిమాచల హరులను కారించె భళా!

కంది శంకరయ్య చెప్పారు...

శంకరాచార్యుల ప్రస్తావనతో మిస్సన్న గారి పూరణ ప్రశంసనీయంగా ఉంది.

మిస్సన్న చెప్పారు...

శంకరాభరణం శంకరయ్య గారికి ధన్యవాదాలు .
వారి బ్లాగు ద్వారా మా కలాలకు పెట్టబడిన పదును
ఇలా సద్వినియోగ మౌతోంది.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

క్షమించాలి తమ్ముడూ ! నేను ఉళ్ళో లేను

కురిపించగ శశి కౌముది
మురిపించుచు నవని జనుల ముదముగ నెపుడున్ !
దరి చేరుచు నసుర భయం
కరులు హిమాచల హరులను కారించే భళా !

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అబ్బా! చాలా చక్కగా వ్రాసావక్కా పద్యాన్ని. ధన్యవాదాలు.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

కరుణను వేడిమి నిచ్చుచు,
నరులనుఁ బోషణముఁ జేయు నాదినకరునిన్
గరిమను గెలిచెను గహ్వర
కరులు; హిమాచల హరులను కారించె భళా!

కరి = చీకటి, హరి = కిరణము ; సూర్యుని కిరణాలను రానివ్వని గహన గుహల వర్ణన.

గహ్వరము అనే పదాన్ని పొరబాటుగా గుహ్వరం అని వ్రాయడం ఇప్పుడే గమనించాను. అందుకని సవరించిన పద్యాన్ని ప్రచురించి పాత పద్యాన్ని తొలగించాను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.