గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, సెప్టెంబర్ 2011, సోమవారం

అలనాడు ఆకాశవాణిలో పూరణార్ధం ఇచ్చిన సమస్య.

ఆర్యులారా! ఈ క్రింది సమస్యను ఒకసారి ఆకాశవాణి విశాఖపట్టణం వారు పూరణార్థం 1965 లో ఇచ్చారండి. అప్పుడు నేను 9వ తరగతి చదువుతున్నాను.అప్పుడు నేను పూరించి పంపిన పూరణే మొట్టమొదట చదివారు. ఆ నాడు ఆ ఆకాశవాణిలో వచ్చిన నా పూరణ విన్న నాకు పద్య రచనా సక్తి  పెరిగిందండి. మా గురువు గారి హృదయంలో ఆవేళ్టి నుండే నాకు సుస్థిరమైన స్థానం ఏర్పడిందండి. అది నా జీవన గమనాన్నే మార్చేసిందండి.
ఆ సమస్యను  మీ ముందుంచుతున్నాను.
"కొడుకునకున్ కూతునిచ్చె కోమలి ముదిమిన్."
నాపూరణను వ్యాఖ్యలో చూడనగును.
మీపూరణలతో పాఠకులకానందప్రదులగుదురని ఆశిస్తున్నాను.
శుభమస్తు.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

11 comments:

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

విడిగా సంబంధమ్ముల
పడిపడి నే చూడలేను 'భయ్యా' యనుచున్
ముడి పెట్టగ చినతమ్ముని
కొడుకునకున్ కూతునిచ్చె కోమలి ముదిమిన్.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

ఆర్యా ! నమస్కారములు.
ఆంధ్రామృతం బ్లాగు ద్వారా మాబోటి ఔత్సాహికులను ఉత్సాహ పరుస్తూ, తెలియని విషయాలను కూలంకషంగా వివరిస్తూ మాచే పద్యములు వ్రాయించుచున్నమీకు ధన్యవాదములు.
ఈ బ్లాగునందు నేను చేసిన పూరణలను నా "సమస్యల తో రణం" బ్లాగునందు ఉంచుటకు గాను మీ అనుమతిని కోరుచున్నాను.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

"బుడిబుడి నడకల చెల్లిది"
కొడుకునకున్ కూతునిచ్చెకోమలి, ముదిమిన్
కడు సంతసమున నిరువురి
నడుమన వియ్యము నెలకొన నౌనని తలచెన్.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

హనుమచ్ఛాస్త్రి గారూ! చక్కని పూరన చేసారు. ధన్యవాదాలు.
మీ బ్లాగు ఏమిటో కూడా నాకెప్పుడూ చెప్పనే లేదు మీరు. నేను చూడ కూడదా యేమి.
ఆంధ్రామృతంలో మీరు చేసిన పూరణలు మీ బ్లాగులో ఉంచుకోడానికి అనుమతి అడిగారు. ఎంత మాట..... తప్పక వేసుకోండి. ఐతే ఆ వివరం నా కూ తెలియ జేస్తే నేనూ చూచి ఆనందిస్తానని మాత్రం మరువకండి.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మందాకిని గారూ! చక్కని భావంతో పూరణ చేసారు. ధన్యవాదాలు.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

ఆర్యా ! నాబ్లాగు "సమస్యల 'తో' రణం ('పూ'రణం)" ను
మీరు జులై 8, 2011 న దర్శించి, వ్యాఖను వ్రాసినారు. కాకపోతే అది నా బ్లాగు అని గుర్తించి వుండరు. ఆ వ్యాఖ్యను నా స్పందనను కాపి చేసి ఉంచుతున్నాను. తరచూ గా దర్శించి మార్గ దర్శకము చేయవలసినదిగా కోరిక.
నేను కోరిన దానికి సహృదయముతో అనుమతి నిచ్చినందులకు ధన్యవాదములు.


వ్యాఖ్యలు:

చింతా రామకృష్ణారావు. said...

ఉత్తముల వద్ద మంచిగా నుండ వలెను.
అట్టి సుకృతికి సత్కృతి హాయి గొలుపు.
చేటు కలిగించు వినరాని చెడ్డ మాట
లాడు వారిని తన్నుటే న్యాయ మగును
8 July 2011 20:10
గోలి హనుమచ్ఛాస్త్రి said...

చింతా రామ కృష్ణారావు గారికి సుస్వాగతం. ధన్యవాదములు.

చింత లేదయ్య నాకిక చేరి జూచి
బ్లాగు దర్శించి బోధించు వారు యుండ
స్వాగతమ్మిదె మీకిక సరస హృదయ
మరల మరలను వీక్షించ మనవి జేతు.

జిగురు సత్యనారాయణ చెప్పారు...

మస్టారు గారు,
మీ బ్లాగులో శనివారం 14 ఫిబ్రవరి 2009 న నేను చేసిన పూరణ.

కడు నెయ్యపు వరుడు, సదా
యెడంద శోభిల్లు పేర్మి, యీడుకు జోడౌ,
ముడి పెట్టగనాడపడచు
కొడుకునకుం కూతునిచ్చె కోమలి ముదిమిన్!!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఈ సమస్యకు ఆనాటి నా పూరణము.

ఎడ తెగని బాంధవంబును
బడయం గోరినదయికడు పాత్రుఁడుమేన
ల్లుఁడు నిష్టుఁడు నగు తమ్ముని
కొడుకునకున్ కూతునిచ్చె కోమలి ముదిమిన్.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

జిగురు సత్యనారాయణ గారూ!
మొత్తంమీద ఆడపచులన్నా వారి బిడ్డలన్నా మీకు చాలా అభిమానం ఉందని మీ పూరణ తెలియజేసింది. చాలా సంతోషం. ధన్యవాదములు.

ఊకదంపుడు చెప్పారు...

పడిపడి వెతకియె,సంబర
పడిలిబ్బిపడతి సుతునకు పాటిగఁబలికీ
తడికనుల,నిత్య పెండిలి
కొడుకునకున్ కూతునిచ్చె కోమలి ముదిమిన్.

నిత్యపెళ్ళికొడుకు సాదు ప్రయోగము కాదనుకుంటానండి- ఐతే - ప్రజాబాహుళ్యం లో తఱచు వినబడె మాట అవ్వటం చేత ప్రయోగించాను.
పాఠాంతరం:

పడిపడి వెతకియె,సంబర
పడి లిబ్బిపడతి సుతునకు పాటిగఁబలికీ
వెడగున,"దినసరి పెండిలి
కొడుకునకున్" కూతునిచ్చె కోమలి ముదిమిన్.

Kalyan చెప్పారు...

పెద్దలు రామకృష్ణ రావు గారికి వందనాలు.. నా పేరు కళ్యాణ్ చక్రవర్తి .. నాకు తెలుగు అంటే మహా ఇష్టము.. నేను కొన్ని పద ప్రయోగములు చేస్తూ నా స్థాయికి కవితలు రాస్తుంటాను.. ఈరోజు మీ ప్రశ్నను చూసాను వారి వారి వివరములు చూసాను.. నాకు అంత హెచ్చు స్థాయి సాహిత్యము తెలియకున్నా నా రీతిలో సమాధానము చెప్పడానికి ఇష్టపడుతునాను..

క్లుప్తముగా నా వివరణ

"వరుసలేని వాక్యమది
కొడుకునకున్ కూతునిచ్చె కోమలి ముదిమిన్"

నా పూరణ ఎ మాత్రము సముచితమో మీరే నిర్ణయించాలి .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.