గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, సెప్టెంబర్ 2011, సోమవారం

మెఱుగుమిల్లి వారు ఇచ్చిన సమస్యా పూరణము

ఆర్యులారా! శ్రీ మెఱుగుమిల్లి వేంకటేశ్వరులు సుప్రసిద్ధ ఉన్నత పాఠశాల ప్రథానోపాధ్యాయులు.
మంచి కవి.
వారు ఇచ్చిన సమస్యను మీ ముందుంచుతున్నాను. 
"నీతిని మట్టుబెట్టవలె  నేతలు పెద్దలు దేశభక్తులున్".
ఈ సమస్యను పూరించమంటే ఇది సమస్య కానే కాదు అన్నంత సునాయాసంగా మీరు పూరించ గలరని నా నమ్మకం.
మరింక ఆలస్యమెందుకు? పంపించేప్రయత్నంలో ఉండండి.
ఇక నా పూరణ వ్యాఖ్యానంలో చూడ నగును. 
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

9 comments:

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

భీతిని లేక జేతురిల పెద్దల బోలిన గ్రద్ద,నక్కలే
నీతిని పైకి జెప్పి జన నేతగ మారుచు' స్కాము' లెన్నియో
జాతిని మేలుకొల్పి జనజాగృతి తోడుగ చూడ నిట్టి దు
ర్నీతిని మట్టుబెట్టవలె నేతలు పెద్దలు దేశభక్తులున్.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

పాతకులై జనావళిని బాధలు పెట్టెడి హీనమైనదు
ర్నీతిని మట్టుబెట్టవలె. నేతలు పెద్దలు దేశభక్తులున్
మా తరమౌనెయంచునిక మౌనము దాల్చుట పాడికాదికన్
చేతల యందుచూపవలె, చిక్కులు తీర్చుచు మానవాళికిన్.

కంది శంకరయ్య చెప్పారు...

ఖ్యాతిని భారతావని జగద్ధితమై వెలుగొందె నాఁడు, నేఁ
డాతత పక్షపాతము దురాశలు స్వార్థము మించె; దుష్ట సం
గాతము మీఱె; ధూర్తులు సుఖంబులఁ గోరుచు సేయునట్టి దు
ర్నీతిని మట్టుబెట్టవలె నేతలు పెద్దలు దేశభక్తులున్.

Pandita Nemani చెప్పారు...

నీతులు వల్లె వేయుచును నిత్యము చేయుచునున్ బ్రసంగముల్
నేతలు పెంచుచుండి రవినీతిని, మేతలు మేయుచున్ సదా
గోతులు త్రవ్వుచున్ ప్రజకు గూర్చుచు కష్టము, లింకనేని దు
ర్నీతులు మట్టుబెట్టవలె నేతలు పెద్దలు దేశభక్తులున్

పండిత నేమాని

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:

ప్రేతములట్లు జేరుకొని పేదల సంపద దొంగిలించుచూ
నేతలు నేడు జాతికిటు నీతులు జెప్పుట నెంత చిత్రమో!
భీతి యొకింతలేక కడు పెద్దల వోలె చరించుచున్న దు
ర్నీతుల మట్టుబెట్టవలె నేతలు పెద్దలు దేశభక్తులున్

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఈ సమస్యకు నా పూరణను చూడండి.

నేతలు "తస్మదీయు లవినీతులనందురు. అస్మదూయులే
నీతులనున్".కనగ నీతులు మార్తురు నప్పినట్లుగా.
చేతలు, మాటలున్, మనసు చేసెడిదొక్కటె నీతి. దుష్ట దుర్
నీతిని మట్టుబెట్టవలె నేతలు పెద్దలు దేశభక్తులున్.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

హనుమచ్ఛాస్త్రి గారూ! చాలా చక్కగా పూరించారండి. అభినందనలు.

మందాకిని గారూ! అబ్బా! చాలా ఉత్తేజంగా బల్లగుద్దీ మరీ చెప్పారు. ఓహో! అద్భుతం. ఐతే ఆవేశంలో మూడవ పాదంలో ఇకన్ అనే పదం ద్విరుక్తమైందండి. ఒకే పదం రెండు పర్యాయములు ఒకే వాక్యంలో మీరు వాడిన విధంగా వాడితే దానిని ద్విరుక్త దోషమంటారు.
పెద్ద తప్పు కాక పోయినా విషయం మరొక్కమారు తెలియ జేస్తే మంచిదికదా అని చెప్పానంతే.
అభినందనలు.

కంది శంకరయ్య గారూ! మీ ఆవేదన మొత్తం మీ పద్యంలో చూపించ గలిగేరండి. అద్భుతం.
అభినందనలండి.

ఆర్యా! పండిత నేమాని రామ జోగి సన్యాసి అవధాని గారూ! మీరు నిష్కర్షగా నేటి నేతల రూపు రేఖల్ని బైట పెట్టారు మీ పద్యం ద్వారా! చాలా చక్కగా సెలవిచ్చారండి.
ధన్యవాదములు.

శ్రీపతిశాస్త్రి గారూ!
చాలా చక్కగా చెప్పారు.
రెండవ పాదంలో నీతులు జెప్పుట నెంత చిత్రమో అనే కంటే నీతులు జెప్పుటదెంత చిత్రమో అంటే మరీ బాగుంటుందనిపిస్తోందండి.
అభినందనలు.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

గురువుగారు,
నిజమేనండి, గమనించలేదు. గుర్తుచేసి మంచి పని చేశారు. గురువులు చిన్నతప్పులైనా సరే తప్పని సరిగా మాకు చూపించి సరిగా రాయటం నేర్పుతారనే ఆశతోనే పూరణలు చేయటానికి తాపత్రయపడుతున్నాను గాని మరో ఉద్దేశ్యం లేదండి.
మరిన్ని ధన్యవాదాలతో.. సవరించిన పద్యం.


పాతకులై జనావళిని బాధలు పెట్టెడి హీనమైనదు
ర్నీతిని మట్టుబెట్టవలె. నేతలు పెద్దలు దేశభక్తులున్
మా తరమెట్టులౌననుచు మౌనము దాల్చుట పాడికాదికన్
చేతల యందుచూపవలె, చిక్కులు తీర్చుచు మానవాళికిన్.

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

గురువుగారూ ధన్యవాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.