గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2011, బుధవారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(దత్త పది2)

ఆర్యులారా! శ్రీ కట్తమూరి చంద్రశేఖరావధాని గారి యొక్క అమ్మమ్మ, తాతయ్య కూడా మహా పండితులే. పై చిత్తరువు వారిదే.చూచారు కదా? ఇక విషయానికొద్దాము. 
అవధాని చంద్రశేఖరం గారికి పూరణకై ఇచ్చిన  దత్తపదినొకదానిని చూచి పూరణ చేద్దాం.
"కంటే-వింటే-తింటే-ఉంటే"
రామాయణార్థంలో ఐచ్ఛిక ఛందస్సులో పూరణము చేయవలసి యున్నది.
ఈ దత్తపదికి నా పూరణను, అవధాని గారి పూరణను  వ్యాఖ్యలో చూడనగును.
మీ పూరణలతో పాఠకులకానందమందించ నున్న మీకు నా అభినందనలు.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

15 comments:

Pandita Nemani చెప్పారు...

కనుచో రాముని రూపమే కనవలెన్ కంటే యదే భాగ్యమౌ
వినుచో జానకి సత్కథల్ వినవలెన్ వింటే మహాపుణ్యమౌ
తినుచో వారి ప్రసాదమే తినవలెన్ తింటే మహానందమౌ
ఉనికే సంతత రామభక్త తతితో నుంటే యదే యోగమౌ

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

మంధర కైక తో అన్న మాటలు...

వింటే! కైకా జెప్పెద,
కంటే నీకొడుకు భరతు ఘన పాలకుగా
నుంటే తప్పే మున్నది,
తింటే నీ యుప్పు నేను, తెలిపితి వినుమా!

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

ఉంటే చెరయందున మరి
తింటే యచ్చోట కూడు, దెలియును రామా!
కంటే కరుణను నాపై
వింటే నాదు మొర, తరలి వెంటనె రావా!--------------రామదాసు

ఉంటే నాపై దయ, నీ
కంటే వేరే విభుడిక కలడా రామా!
తింటే నీ నామ సుధలు,
వింటే నీ భజనఁ దక్క వేరే గలదా!---------హనుమ

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఈ దత్త పదికి నా పూరణము.

కంటే రాముని కనవలె.
వింటే తత్కథ వినవలె వీనులకింపౌన్.
తింటే రామ ప్రసాదము,
ఉంటే తత్ సన్నిధిన్, మహోన్నతి కలుగున్.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఈ దత్త పదికి అవధాని గారి పూరణము.

కంటే కాంతా మృగమది,
వింటే బంగారు రుచుల వెలిగెడిననుచున్.
ఉంటే తెచ్చెద వేగమె.
తింటే మాంసంబు రుచుల తీపులు దీరన్.

కంది శంకరయ్య చెప్పారు...

లంకకు వెళ్ళి వచ్చిన హనుమంతునితో జాంబవంతుడు ...

కంటే సీతను లంకను?
వింటే యా మాత పడెడి వెతలన్నింటిన్?
తింటే తృప్తిక ఫలముల
నుంటే నెమ్మదిని? రాము నొద్దకుఁ జనుమా!

కంది శంకరయ్య చెప్పారు...

నా పూరణలో ‘తింటే తృప్తిగ’ అని చదువుకొనవలసిందిగా మనవి.

Pandita Nemani చెప్పారు...

నా పూరణ:

ముక్తియె ముఖ్య లక్ష్యమని బుద్ధి ప్రబోధమొనర్చు చుండ నా
సక్తి యెలర్ప సాధనలు సల్పుచు జ్ఞాన వికాస మానసుల్
రక్తిని గూర్చు నవ్య కృతులన్ విరచించుచు ప్రోత్సహింపగా
భక్తి రసామృతంబు మన బ్లాగున పొంగు నిరంతరంబుగా

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

నేమాని వారి కలం నడకని చూచాము. మరి గళం వినే భాగ్యమదెప్పుడో?
పూరణము బాగుంది. ధన్యవాదములు.

హనుమచ్ఛాస్త్రి గారూ! మొత్తం మీద దశరథుఁడు చేత ఉప్పు తిన్న ఋణం తీర్పించారు. బాగుందండి పూరణము. ధన్యవాదములు.

మందాకిని గారూ! మొత్తం మీద రామదాసు బాధను బాగా ఆకళింపు చేసుకొన్నారు కబట్టే చక్కగా వ్రాయ గలిగారు. హనుమంతుని భక్తి భావాన్ని కూడా పుణికి పుచ్చుకొని ఉంటారు మీరు. కాకుంటే ఇంత చక్కగా వ్రాయడం సాధ్యపడుతుందా?
సుధ తినడానికి కాదు త్రాగడానికి అని ఎవరైనా ఆక్షేపించ వచ్చును. ఐతే మనం ఫ్రిజ్జు వాడుతూ ఉంటాము. అందు చేత అందులో ఉంచిన ద్రవ పదార్థం ఘన పదార్థంగా మారడం అది మనం ఐస్ ముక్కలాగా తినడం అలవాటు పడ్డవాళ్ళం కదాండీ. అందుకని మన అనుభవం ప్రకారం వ్రాసిందని గ్రహించకపోరని నా నమ్మకం.
ధన్యవాదములు.

శంకరయ్య గారూ! చక్కని సంభాషణా రూపంలో పూరించారు. బాగుందండి.
ధన్యవాదములు.

Pandita Nemani చెప్పారు...

అయ్యా! శుభాశీస్సులు.
మీరు 2 ఏళ్ళ క్రితం నా గళమును విన్నారు ఛోడవరములో. 1993లో చోడవరములో అష్టావధానము చేసినప్పుడు మీరు చూచేరేమో. మీ కోరిక తీరకపోదు. అట్టి అవకాశము నాకూ మంచిదే. వేచి చూద్దాము. సెలవు.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

గురువుగారూ, మెత్తటి చురక పెట్టారుగా, ధన్యవాదాలు.
చిన్న సవరణ. ఇంచు - చెఱకు అని మారుస్తున్నాను.

ఉంటే నాపై దయ, నీ
కంటే వేరే విభుడిక కలడా రామా!
తింటే నామమె యించగు.
వింటే నీ భజనఁ దక్క వేరే గలదా!---------హనుమ

మిస్సన్న చెప్పారు...

వింటే? నే నిక నొల్లనిన్ను పద నీ వేషాలు నే గంటి, నా
కంటే యెక్కువ సూరిగాడు కద! నా కళ్ళార చూడంగ, నే
తింటే గడ్డిని, రాములోరి వలె, నీ తీపూసులన్ నమ్ముదున్
ఉంటే సిగ్గిక చూప వద్దు మొగమున్ ఉండక్కడే వాడితో.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

వింటే రామ సుధా సారము
కంటె కోదండ రాము కనులకు ప్రీతిన్ !
తింటే రామ ప్రసాదము
ఉంటే మనసైన భక్తి నుత్తమ గతులున్ !

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

తిప్పని వృత్తాంతమునే
చెప్పిరిఘనమైన రీతి.శ్రీ మిస్సన్నా!
ఎప్పటి కప్పుడు మీరే
గొప్పగ రచియించు చున్న గురతరముగనౌన్.

మిస్సన్న చెప్పారు...

ఆర్యులకు ధన్యవాదములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.