గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, సెప్టెంబర్ 2011, శనివారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(సమస్యాపూరణ18)

సుందరభావ సుశోభితు
లందరికీ వందనంబులార్యులు మీరల్
ముందున్న యా సమస్యను 
తొందరగా నింపి, పంపి, తోడు నిలుచుడీ!
"కానరారాతనికి సములైనవారు"
ఇదీ అవధాని చంద్రశేఖరం గారెదుర్కొనిన సమస్య.
మీరు  ఈ సమస్యను అద్భుతంగా పూరించి పాథకులకానంద కారకులై నాకూ సంతోషం కలిగిస్తారని నా నమ్మకం.
నాయొక్క, అవధాని గారి యొక్క పూరణలను వ్యాఖ్యలలో చూడనగును.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

23 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

విశ్వమంతట నిండిన విష్ణువతఁడు
దీన జనులను కాపాడు దివ్యరూపి
జగము లనుగాచు చుండును జాలిఁదలచి
కానరారాతనికి సములైనవారు

Pandita Nemani చెప్పారు...

జ్ఞాన చైతన్య తేజోనిధాన మతడు
శౌర్య ధైర్య పరాక్రమశాలి యతడు
రామచంద్రుండు సుగుణాభిరాము డౌర
కానరారాతనికి సములైన వారు

శ్రీ రామకృష్ణ రావు గారూ!
ఇందులో యెట్టి సమస్యా లేదు. కేవలం పాద పూరణ మాత్రమే.

ఈ చిన్న సమస్యము తిలకించండి.

రాతి బ్రీతు జేయు నాతి గొలుతు

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

కలసి వచ్చిన హెచ్చగు కలిమి జూచి
కనులు మూసుకు పోయెను గనుక నేడు
కానరారాతనికి, సములైనవారు
చిన్న వారలు పెద్దలు, కన్న వారు.

మిస్సన్న చెప్పారు...

జానకిం గూడి లక్ష్మణ సహితు డయ్యు
రాక్ష సాళిని వధియించె రామ మూర్తి
వనములందున గాచెను ముని గణముల
' కాన ' రారాతనికి సములైనవారు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఈ సమస్యకు నా పూరణము.

ద్రుపదునర్ధించె ద్రోణుఁడు ధనము కొఱకు
బాల్య మిత్రునికీయక భంగ పరచె.
రాజ గర్వాంధుడా మహా రాజు.కాన
కానరారతనికి సములైనవారు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఈ సమస్యకు అవధాని గారి పూరణము.

శిరము నందున పింఛము. కరము నందు
పిల్ల గ్రోవియు దాలిచి, ఎల్లవారి
ఉల్లముల నూగులాడించు నల్లనయ్య
కానరారతనికి సములైనవారు.

నిజమే ఆపరమాత్మకు సమానమైనవారు మనకు కానరారు కదా!
చాలా గొప్పగా చెప్పారండి అవధాని గారు. వారికి నా అభినందనలు.

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:

దేశ స్వాతంతంత్ర్యమును గోరి దీక్షబూని
కఠిన శిక్షల నోర్చిన ఘనుడు గాంధి
సత్యనిష్టతో సాధించె, శౌరి యనగ
కానరారతనికి సములైనవారు.

స్వతంత్రపోరాటంలో గాంధీజీ కృష్ణుని లాంటివాడని శౌరి పదం వాడినాను.

ఊకదంపుడు చెప్పారు...

ఉభయభాషాప్రవీణుడు, ఒజ్జకుదగు
ఛాత్రుడును,కవిసామ్రాట్టు,స్వామికధను
కల్పవృక్షమనుచునిచ్చెఘనుడు, నేడు
కానరారాతనికి సములైనవారు.

ఊకదంపుడు చెప్పారు...

పండిత నేమాని వారి సమస్య కు పూరణకు ప్రయత్నిస్తున్నానండి.
ఏమైన తప్పులుంటే - చెప్పగానే సరిదిద్దుకుంటాను.
భవదీయుడు

లాస్యమాడువేళ లలితాంగిననుచును
జగతి బ్రోచువేళ జనని నంచు,
నన్ని వేళలందు నర్ధాంగియై స్మరా
రాతి బ్రీతు జేయు నాతి గొలుతు.

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:
శ్రీ పండిత నేమాని వారికి వందనములు.మీరు రచించిన రామాయణ కావ్యం
కొంతవరకు చదివినాను. చాలా బాగున్నది. పుస్తక రూపంగా ఎక్కడ లభిస్తుందో తెలుప ప్రార్థన.

మీ రొసగిన సమస్యను పూరించే ప్రయత్నం

శిలను మలచి శిల్పి శిల్పంబుగా మార్చె
రాతిలోన నిలచె మాతరూపు
శిలల భాగ్యమనగ శిల్పియే బ్రహ్మయై
రాతి బ్రీతు జేయు, నాతి గొలతు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మందాకిని గారూ! విష్ణువు యొక్క కరుణా స్వరూపాన్ని కళ్ళకు కట్టించుతూ మీరు చేసిన పూరణము మనోరంజకంగా ఉంది. మీకు నా అభినందనలు.

ఆర్యా!రామ జోగి సన్యాసిరావుగారూ! సమస్యను ఇచ్చిన వారు ఉద్దేశ్యంలో అతనికి తనతో సమానమైనవారు కంటికి కనపడరు అనే భావన అయి ఉంటుందనుకుంటానండి.
ఐతే ఏది ఏమైనా శ్రీరాముని గూర్చి అద్భుతంగా వర్ణించి సార్థక నామ ధేయులయ్యారు మీరు. ధన్యవాదములు.
మీ రిచ్చిన సమస్య కూడా చాలా బాగుంది. చాలా మంది చక్కగా ఇప్పుడే పూరించి తమద్విగుణీకృత ఉత్సాహాన్ని ప్రకటించండం నాకెంతో సంతోషం కలిగిస్తోందండి. మీకు మరొక్క పర్యాయం ధన్యవాదాలు తెలుపుకొంటున్నానండి.

హనుమచ్ఛాస్త్రి గారూ! సమస్యనిచ్చినవారి దృక్కోణంలో మీ పూరణ ఉంది. చాలా బాగుందండి. ధన్యవాదములు.

మిస్సన్న గారూ! కాన అనే పదానికి అడవి, వనము అనే అర్థాలను తీసుకొని చేసిన మీ పూరణము వైవిధ్యభరితమై ఒప్పుతోందండి. మీకు నా అభినందనలు.

శ్రీపతి శాస్త్రి గారూ! మహోన్నత వ్యక్తిత్వము గల గాంధీని గూర్చి వ్రాసి మరొక్క మారు ఆమహనీయుని మా స్మరణకు తెచ్చారు. చాలా బాగుందండి. అభినందనలు.
పండిత నేమాని వారి సమస్యను కూడా మీరద్భుతంగా పూరించిన విధము శ్లాఘనీయము.అభినందనలు.

చిరంజీవీ!రామ కృష్ణా! రామాయణ కల్పవృక్షాన్ని ఆంధ్రుల కందించిన మహోన్నత కవి విశ్వనాధ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అట్టి మహనీయుని స్మరిస్తూ సమస్యాపూరణను అవలీలగా చేసిన నిన్ను నేను మనసారా అభినందిస్తున్నాను.
పండిత నేమాని వారు ఇచ్చిన సమస్యను కూడా అవలీలగా పూరించిన నీ ప్రతిభ శ్లాఘనీయము. చాలా సంతోషం.

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

దివ్యమైనరూపు, తేజోనిధానంబు,
భక్తజనులబ్రోచు శక్తి మాత,
పంచముఖుని, శివుని, భస్మాంగునంగజా
రాతి బ్రీతు చేయు నాతి గొలుతు.

అంగజారాతి = మన్మథుని శత్రువు = ఈశ్వరుడు

ఈశ్వరుని ప్రీతిచేయు నాతి = పార్వతి దేవి.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

విషము గొంతు బెట్టి విషనాగులను చుట్టి
నిప్పు కంట దట్టి నీరు నెత్తి
మీద నెత్తుకొన్న మిత్తి జితుడు, పురా
రాతి బ్రీతు చేయు నాతి గొలుతు.

Pandita Nemani చెప్పారు...

శ్రీపతి శాస్త్రిగారికి నమస్సులు.
అయ్యా! నేను అధ్యాత్మ రామాయణమును ఫ్రీ గా మీకు పోస్టులో పంపగలను. మీ చిరునామాను తెలియజేయండి.
పండిత నేమాని

Pandita Nemani చెప్పారు...

అయ్యా! శ్రీపతి శాస్త్రి గారూ! నమస్సులు.
మీ పూరణలో "దేశ స్వాతంత్ర్యము" అనే సమాసములో 2వ అక్షరము "శ" గురువు అవుతుంది. ఎలా మార్పు జేస్తే బాగుంటుందో ప్రయత్నించాలి. దేశకు బదులుగా "ఔర" అందామా?
పండిత నేమాని

Pandita Nemani చెప్పారు...

అయ్యా! నేను చేసిన పూరణ తిలకించండి:

తనువులోన సగము, మనసు సంపూర్ణంబు
నాత్మ యందభేదమై యలరెడు
త్రిభువనాధినేత్రి, విభుని, పురాసురా
రాతి బ్రీతు జేయు నాతి గొలుతు

Pandita Nemani చెప్పారు...

ఈ సమస్యను చూడండి.

కొమ్ముల గుర్రముం గనిన గొందలమందును సర్పరాజముల్

పండిత నేమాని

మిస్సన్న చెప్పారు...

విభుని వక్ష మెపుడు వీడ కుండెడు జాణ
పాల సాగరంపు మాలిమి సుత
సిరుల నిచ్చు తల్లి శ్రీ దేవి దానవా
రాతి బ్రీతు జేయు నాతి గొలుతు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

పండిత నేమాని వారిచ్చిన సమస్యకు సంపత్కుమార్ శాస్త్రి గారు, హనుమచ్ఛాస్త్రి గారు, మిస్సన్న గారు, శ్రీ నేమానివారూ అత్యద్భుత భావనారమ్యంగా పూరించారు. అందరికీ అభినందనలు.

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

గురువుగారూ ధన్యవాదములు. శ్రీ నేమానివారికి కృతజ్ఞతలు. మీ సూచనను గమనించి "దేశమాతకు స్వేచ్ఛకై దీక్ష బూని" అని సవరిస్తున్నాను. గురువర్యులు పరిశీలించి తప్పొప్పులు తెలుప ప్రార్థన.
మీరు ఆధ్యాత్మ రామాయణ కావ్యమును ఈ చిరునామాకు పంపగలరని ప్రార్థన. అన్యదా భావింపక మీ చిరునామాను తెలుప ప్రార్థన.

P.Sreepathi Sastry
18-1-734-A,
Bhawani Nagar,
TIRUPATI - 517501

Pandita Nemani చెప్పారు...

శ్రీ సరస్వత్యై నమః

సాహితీ మిత్రులకు అభివాదములు. రానున్న దసరా పండుగ దృష్ట్యా "అమ్మ" ప్రాశశ్త్యమును ప్రశంసిస్తూ పద్యములను వ్రాసి పంపితే బాగుంటుంది. సుమారు 4 - 5 పద్యముల సంచయములను వ్రాసి వచ్చే ఆదివారము లోపున పంపుటకు ప్రయత్నము చేయండి.

Pandita Nemani చెప్పారు...

Dear Sripathi Sastri garu! Namasthe. My address is as follows: N.R.Sanyasi Rao,
HIG 33, Flat No.203,
Marripalem Vuda Lay out,
Visakhapatnam - 530 009.
Ph: 0891 - 2565944 / 9440233175

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:

కొమ్ములు మూటగట్టుకొని గుర్రమునెక్కిన వర్తకుండు తాన్
క్రమ్మకముందె జీకటులు కానన దాటగ నిశ్చయించగా
చిమ్మిన స్వేదమున్ దడసి శీఘ్రముగా జనుచున్న వేళలన్
కొమ్ముల గుర్రముం గనిన గొందలమందును సర్పరాజముల్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.