గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, సెప్టెంబర్ 2011, శుక్రవారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(సమస్యాపూరణ17)

ఆర్యులారా! అవధానిగారు ఎదుర్కొని పూరించిన సమస్యను పూరణార్థం మీ ముందుంచుతున్నాను.
"జనకుని పెండ్లి యాడుమని జానకి కోరెను ప్రేమ మూర్తియై."
ఈ సనస్యకు సంబంధించిన నాయొక్క, అవధాని గారి యొక్క పూరణములను వ్యాఖ్యలలో చూడనగును.
మీరు మీ పూరణలతో పాఠకులను అలరింప జేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.
ధన్యవాదములు.
జైశ్రీరాం.
జైహింద్. 
Print this post

22 comments:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఈ సమస్యకు నా పూరణము.

జనకుని పుత్రి, జ్ఞాన విలసద్గుణు రాముని రూపు రేఖలన్,
ప్రణవ పర స్వరూపమును, భావన చేసి, తరింప చేయగా
"జనకుని, పెండ్లి యాడుమని జానకి కోరెను ప్రేమ మూర్తియై."
మనమున రామునిన్. భరత మాత పునీతగ! సీత పుట్టుటన్?

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఈ సమస్యకు అవధాని గారు పూరణము.

అనఘుఁడు రామ చంద్రుఁడట. ఆతఁడు విష్ణు సరూపుఁడంట. అ
య్యనఘునిగాని వేరొకని ఔనె వరింపగ? అంతె కాదు. తు
త్తునియలు చేసె వింటినట. తోరపు వేడుక శంబరారికిన్
"జనకుని, పెండ్లి యాడుమని జానకి కోరెను ప్రేమ మూర్తియై."

కంది శంకరయ్య చెప్పారు...

జానకి అనే అమ్మాయి తన ప్రియునితో అంటున్న మాటలు ....

నను మనసారగా వలచి మానని కోర్కె వివాహమాడు మం
చనెదవు; తండ్రిచాటు సుత నయ్య స్వతంత్రముఁ బూని వెంట వ
త్తునె? యది యుక్త మౌనె? కడు తియ్యని మాటల వేడుకొమ్ము మ
జ్జనకుని; పెండ్లియాడు మని జానకి కోరెను ప్రేమమూర్తియై.

Pandita Nemani చెప్పారు...

వినుము సినీ విశేషములు విశ్వమనోహరి జానకీ సుద
ర్శిని యను తార ప్రేమికుని చిత్తము దోచెను దర్శకున్ మనో
జుని విభవమ్మునున్ గెలుచు సుందరు ధీమణి యౌ సినీ జగ
జ్జనకుని పెండ్లియాడుమని జానకి కోరెను ప్రేమమూర్తియై

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శంకరయ్య గారూ! చాలా సహజంగా చేసిన మీ పూరణము చక్కగా ఉందండి. సమస్యని విడగొట్టడం ఇంత సులభమా అన్నట్టు పద్యరచనాసక్తులకు రచనాసక్తి కల్గిస్తోందండి. అభినందనలు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

పండిత జాతికిన్ కనుల పండువు మీరును మీ కవిత్వముల్.
పండిత రామజోగి! కవి బాంధవ! చెన్నయి రామచంద్రనున్
పెండిలి యాడినట్టి సుమ పేశల జానకి వృత్తమే కదా
మెండగు భావనాకలిత మీదగు పూరణ? అద్భుతంబహో!

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

ఘనమగు విల్లు ఫెళ్ళుమనె కంజదళాక్షుఁడు యెక్కు పెట్టగా
వినెనిక లోకమంత కడు వేడుక గొల్పగ నాజ్ఞ వేడె నా
జనకుని, పెండ్లి యాడుమని జానకి కోరెను ప్రేమ మూర్తియై
కనపడు రామ చంద్రుడిని, గౌరవమొప్పగ, సిగ్గుమొగ్గయై.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

జానకి అను నామె తన తండ్రి షష్టి పూర్తి మహోత్సవములో తల్లి తో చెప్పుచున్న మాటలు...

గణనకు నర్వదేండ్లు యగు కాలము దొర్లెనునేటి తోడ మా
జనకుడు పుట్టి, నాడు నిను జట్టుగ పట్టెను తల్లి ! పట్టి నే
నొనరగ నొక్క దాన,గన నోములు పండగ షష్టి పూర్తి లో
జనకుని పెండ్లి యాడుమని,జానకి కోరెను ప్రేమ మూర్తియై

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆహా! మందాకిని గారూ! సీతమ్మ సిగ్గు మోము, సిగ్గుతో కూడిన ఆమె మాటలు కళ్ళకు కట్టించిన మీ పూరణ సంతోషం కలిగించింది. మీకు నా అభినందనలు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

హనుమచ్ఛాస్త్రి గారూ!
తండ్రి షష్టి పూర్తి తనయయే గుర్తించి
తల్లి నడుగఁ జేసి తండ్రినపుడు
పెండ్లి యాడు మంచు. పెద్దగా భావించి,
పూరణంచేసిరీరు. ఘనులు.

ఊకదంపుడు చెప్పారు...

ఇనకులవంశబాలుడు, భువీశులు వీరులు సోలివ్రాలగా,
ధనువునుచేతబూనిగుణధారణచేయునెపమ్మునద్రుంచి,చే
కొనుటకుఁవచ్చుటన్ గనియె, కూరిమితోన్, దిలకింపఁబిల్చిమీ
జనకుని, పెండ్లి యాడుమని జానకి కోరెను ప్రేమ మూర్తియై.

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:

వినయము చూపువాడు కడువీరుడు కోశల రాజపుత్రునిన్
జనకుని యాజ్ఞ మీరడ టుజాతికి ప్రాణము తానెయైన స
న్మునిజన యాగరక్షకుని మోహన రూపుని సృష్టికర్తకున్
జనకుని, పెండ్లి యాడుమని జానకి కోరెను ప్రేమ మూర్తియై

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

చిరంజీవీ! రామ కృష్ణా! వృత్త పద్య రచన కూడా అద్భుతంగా నీ చేతికి చిక్కింది. పూరణ చాలా బాగుంది. నాకు ఆనందంకలిగింది.
రెండవ పాదంలో మాత్రం నెపమ్మున అని కాకుండా నెపాన అని ఉంటే నిర్దోషతతో అలరారగలదనిపిస్తోంది. అభినందనలు. శుభమస్తు.

శ్రీపతి శాస్త్రి గారూ! సమస్యా పూరణము మీరు చేసిన పద్ధతిని బట్టిచూస్తే మీరు ఎంతటి రామ భక్తులో అర్థమౌతోంది. రాముని గూర్చి ఎంతటి చక్కని విశేషాల్ని ప్రయోగించారు! నిజమే ఆ సీతమ్మ హృదయంలో దూరి చూసి వ్రాసి ఉంటారు మీరా పద్యాన్ని. లేకుంటే ఇంతటి ప్రతిభావంతంగా వ్రాయడం సాధ్యమౌతుందా? ధన్యవాదాలు.

ఊకదంపుడు చెప్పారు...

ధన్యవాదములండీ ...


నెపమ్మున - నదులు చేయుదునంచు అంటాను.

ఇనకులవంశబాలుడు, భువీశులు వీరులు సోలివ్రాలగా,
ధనువునుచేతబూనిగుణధారణచేయుదునంచు ద్రుంచి,చే
కొనుటకుఁవచ్చుటన్ గనియె, కూరిమితోన్, దిలకింపఁబిల్చిమీ
జనకుని, పెండ్లి యాడుమని జానకి కోరెను ప్రేమ మూర్తియై.


గోలి హనుమచ్ఛాస్త్రి గారూ!
"నేనొనరగ నొక్క దాన,గన నోములు పండగ షష్టి పూర్తి లో" అని విశేషార్ధమేదో గుప్పించినట్టున్నారు మీరు :)

మిస్సన్న చెప్పారు...

తనయుడు ప్రేమలో పడెను తండ్రికి నిష్టము లేదు తల్లిగా
తన విధి గుర్తు చేసుకొని తానుగ పెన్మిటి చేరి మెల్లగా
ననునయ వాక్యముల్ పలికి యాత్మజు పంపెను మ్రొక్కి వేడగా
జనకుని, పెండ్లి యాడుమని జానకి కోరెను ప్రేమ మూర్తియై.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మిస్సన్నగారూ! అభినందనలు. మాటాడుతున్నట్టుగానే అలవోకగా పద్యాన్ని పరుగుపెట్టించారండి. చాలా సంతోషమండీ.

కంది శంకరయ్య చెప్పారు...

నా పూరణలో మూడవపాదంలో యతి తప్పింది. దోషాన్ని ఎత్తి చూపిన ‘ఊకదంపుడు’ గారికి ధన్యవాదాలు. సవరించిన నా పూరణ ....

జానకి అనే అమ్మాయి తన ప్రియునితో అంటున్న మాటలు ....

నను మనసారగా వలచి మానని కోర్కె వివాహమాడు మం
చనెదవు; తండ్రిచాటు సుత నయ్య స్వతంత్రముఁ బూని వెంట వ
త్తునె? యది యుక్తమా? నయముతోఁ దగు మాటల వేడుకొమ్ము మ
జ్జనకుని; పెండ్లియాడు మని జానకి కోరెను ప్రేమమూర్తియై.

కొత్త పాళీ చెప్పారు...

చాలా బావున్నై పూరణలన్నీ. ఏడాది రెండేళ్ల కిందట పొద్దువారి భువనవిజయ సభలో వాల్మీకి "ఇయం సీతా అమసుతా" శ్లోకాన్ని మన కవులు తెలుగులో అనువదించ చేసిన ప్రయత్నాలు గుర్తొచ్చినాయి.

మిస్సన్న చెప్పారు...

అంతా ఆర్యుల ఆశీస్సుల ప్రభావం

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

గురువుగారూ మీరు నాభావమును ఆవిష్కరించినందులకు చాలా ఆనందముగా ఉన్నది. పద్యం సరిగా కుదరలేదనుకొన్నాను. కానీ శ్రీసీతారాములను తలచుకొని పోస్టు చేసినాను. మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నది.ధన్యవాదములు.

రామ రఘురామ రామ శ్రీరామ రామ
నిత్య నూతనమోస్వామి నీదు మహిమ
భక్తి వైరాగ్య మారోగ్య భాగ్య మిచ్చు
మోక్షదాయక మంత్రమై ముక్తి నొసగు

లంకా రవీంద్ర చెప్పారు...

"తనయకు యీడువచ్చినది, తానిపుడచ్చనగాయలాడునో?

అనుగుణమైన రీతి దగు యవ్వన క్రీడల దేలియాడునో?

జనకుడ! జూచివత్తు! గని సంతస మొందెద!"నంచు బోవగా,
"జనకుని పెండ్లి, యాడు!"మని జానకి కోరెను ప్రేమ మూర్తియై.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

ఆర్యా ! ధన్యవాదములు.
ఊకదంపుడు గారూ ! వి' శ్లే ' షార్థాన్ని పట్టుకున్నారు. ధన్యవాదములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.