గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, మే 2010, బుధవారం

కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత 44.

కనులందున్ ఖగముల్ లతాంతములు వృక్షంబుల్ సరోవారియ
ల్లిన వల్లీ చయమున్ మృగంబులు సుమాళిన్ యౌగ పద్యంబుగా 
గ ననిర్వాచ్య మనోజ్ఞితా మధురిమల్ కల్పించు బోవాకొనన్ 
మనసొక్కొక్క మనోజ్ఞ వస్తువె పరామర్శింపగా గల్గెడిన్.
(వి.రా.క.వృ.కి.కా.నూ.స.1 - 44.)
సృష్టి అంతా సౌందర్యఖని. అది అనంతము. అనిర్వాచ్యము. కన్నులతో పక్షుల్నీ, తీగల ఆకుల్నీ, వృక్షాల్నీ, సరస్సు లోని నీరు, అల్లుకొన్న తీగల్నీ, మృగాల్నీ, పూవుల్నీ, ఇలా యౌగపద్యంగా అంటే ఒకదానితో ఒకటి కలసి ప్రకృతి అనిర్వాచ్యమైన సౌందర్య మాధుర్యాన్ని పంచుతున్నది. కాని నీ మనస్సు ఒక్కొక్క మనోజ్ఞ వస్తువును మాత్రమే పరామర్శింప జాలి యున్నది.
శోకార్తస్సాపి మే పంపా శోభతే చిత్ర కాననా - శోకార్తుఁడనైనప్పటికీ ఈ పంపా సరస్సు పరిసరాలు నాకు అందముగానే కనిపిస్తున్నవని మొదట పలికిన శ్రీరాముడు తత్తత్ప్రదేశములందలి సౌందర్య భరిత దృశ్యాలను ఆశ్వాదిస్తూనే సీతా వియోగియై పరితాపం పొందుతున్నాడు. ఈ విధంగా సృష్టి యొక్క సమగ్ర సౌందర్యము అంతా వివిక్తముగా కాకుండా సంసక్తము, అన్యోన్యాశ్రితము అని తన మాటలతో వ్యాఖ్యానించు చున్నాడు.     
శ్రీరాముఁడు సహస్రాక్షః సహస్ర పాత్. అని స్తుతింపఁ బడిన నారాయణుని అవతారమే అగు గాక. ప్రస్తుతము మానవుఁడై మానవ దృగింద్రియము యొక్క శక్తి పరిధిని తెలుపుచున్నాఁడు. కళ్ళతో ఒక దృశ్యమును చూచు సమయమునందు మరొక వస్తువును చూడ లేము. 
మృగముల స్వాభావిక చేష్టల్నీ వాని సౌందర్యమును చూచునపుడు లతలను పువ్వులను కాంచ లేము. అనగా మనస్సు ఒక్కొక్క మనోజ్ఞ వస్తువు నందలి సౌందర్యమునే చూచి ఆనందించ గలుగు చున్నది. కాని సౌందర్యము యొక్క సమగ్రతను ఆస్వాదించ లేకపోవు చున్నదని శ్రీరాముఁడు భావించెను. శ్రీరామునిలో ఈ సౌందర్య లాలసయే ఆయనను సీతా వియోగ దుఃఖము నుండి కొంత మరలించి జీవింపఁ జేసినది.
సృష్టి అంతయు పరస్పరాధారము. పరస్పరాధేయము అను విషయమును ఇంద్రియములయొక్క పరిధిని ఈ పద్యము వ్యంగ్యముగా తెలుపు చున్నది.
బహుశః మహా కవి విశ్వనాథ అవస్థయు ఇట్లే ఉన్నది కాబోలు. పంపా సరోవర సౌందర్యములను భిన్నభిన్న కోణముల నుండి దర్శించుచూ తత్తత్ మనోహరత్వమును వర్ణించుచూ, కవి తన రచన యందు అసంతృప్తుడు కావడం మనం గ్రహించ వచ్చు.
నిజమునకు విశ్వనాథ చేసిన కవితా రూప తపస్సు చేసిన వారు అరుదు.
సరస్వతీ కంఠాభరణములో భోజుడు వాక్కు యొక్క ఉచ్చారణ దశల్ని ఆలంబనగా చేసుకొనిసరస్వతిని ఇలా ప్రార్థించాడు.
ధ్వనిః వర్ణాః పదం వాక్యం ఇత్యాస్పద చతుష్టయం.
యస్యాః సూక్ష్మాది భేదేన వాగ్దేవీం తాం ఉపాస్మహే.
మూలాధారమునందు పరా వాక్కు అని పిలువబడేది నిర్వికారమైనది. అది నాభియందు పశ్యంతి అను పేరుతో వికారాన్ని పొందుతుంది. హృదయమునందు స్పందన రూపమైన వాక్కు పేరు మధ్యమ. కంఠమునందు ఉచ్చారణ స్థితిని పొందిన వాక్కు వైఖరి అంటారు. ఈ విధంగా పరా పశ్యంతి మధ్యమ వైఖరి నామాలతో నాలుగు స్థానములతో (ఆస్పద చతుష్టయా) సూక్ష్మ భేదాల్ని పొందుతున్న వాగ్దేవిని ఉపాసించు చున్నాము. అని భావం. మొదటి మూడు దశల్లో శారద నిర్వికార. నాల్గవ స్థానమున ఆమె సాకార.
ఇది ఇట్లుండగా విశ్వనాథ వాగ్దేవిని ఎట్లు సందర్శించ దలచినాడో ఎట్టి తపస్సు చేసినాడో చూడండి.
ఆరసి నిన్నునీరజ దళాంతర మోహన నిస్వనంబుగా 
కోరి యెఱింగితిన్. తెలిసికొన్న కొలందిగ నక్కటా నిరా
కార తపస్వి నిన్ను వినగావలె అట్టి నినున్  శరీర సం
స్కార బలంబునన్ వినుటెగాకను చూడగ గూడ నెంచెదన్.
(విశ్వనాథ)
అమ్మా! నిరాకార తపస్వీ! నువ్వు సహస్ర దళ కమల కోమల నిస్వనానివి (ధ్వనివి) అని నిన్ను తెలుసుకొన్నాను. ధ్వని రూపిణివైన నిన్ను వినాలి. అంతే కాదు ఈ శరీరముతోనే నిన్ను చూడాలని కూడా తలంచు చున్నాను.
పై పద్యం వల్ల సాహిత్య రూప యైన వాగ్దేవిని దర్శించుటకు ఆయన ఎంత తపించినాడో! ఆయన భావనా బల మెట్టిదియో మనకు కొంత వరకు తెలుస్తుంది. (కొంత వరకు మాత్రమే) విశ్వనాథ సాహిత్యాన్ని మనం జన్మాంతర సంస్కారం వల్ల తత్పుణ్యం వల్ల చదువుతున్నాము అని అనుకోవాలి.
ఆముక్త మాల్యదలో విష్ణు చిత్తుడు అతిథులకు షడ్రసోపేత భోజనము పెట్టుచు వారితో వినయాన్వితుడై
 "నాస్తి శాక బహుతా నాస్త్యుష్ణతా నాస్త్యపూపాః నాస్త్యోదన సౌష్టవంచ. కృపయా భోక్తవ్యం. "
( కూర ఎక్కువగా లేదు కాబోలు. వేడిగా లేదేమో, అరిసెలు చాల లేదేమో అన్నం ససిగా లేదేమో .దయతో భుజించండి. ) అంటాడుట.
ఆ మాటలు నిజం కాదు. అది విష్ణు చిత్తుని అతిథి సేవా సంస్కారం. 
విశ్వనాథ కూడా రసోచిత కవితా వ్యావృత్తిని అట్టివాడే.   
జైశ్రీరాం.
చూచాం కదండీ నలుబది నాల్గవ భాగాన్ని. తదుపరిప్ద్యం  అతి త్వరలో మీ ముందుంచ గలవాడను.
జైహింద్. Print this post

6 comments:

సురేష్ బాబు చెప్పారు...

విశ్వనాథ సత్యనారాయణ గారి ఋషి గురించి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. దయచేసి పద్యార్థాలను వ్యావహారిక భాషలో వ్రాయమని మనవి. ఎందుకంటే బ్లాగ్ అంటే అందరూ చూస్తారు కదా. దయచేసి అన్యథా భావించచద్దని మనవి.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఇంత చక్కని కావ్యాన్ని చదివి ఆనందించ గల అదృష్టం ఎక్కడో మీగిలిన నా పూర్వ జన్మ సుకృతం నిరతాన్నదాత విష్ణు చిత్తుడు.అర్ధ రాత్రి వెళ్ళినా అతిధి సత్కారం చేయగల మహాను భావుడు.మరి విశ్వనాధ వారు తపస్సం పన్నులు ఈ అమృతాన్ని మనకందిస్తున్న వారు ధన్యులు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

సురేష్ బాబూ! మీసూచన నాకానందం కలిగించింది. తప్పక పాటించే ప్రయత్నమ్ చేయగలవాడను. చక్కని సూచనలందిస్తూ నిరంతరం ప్రోత్సహిస్తున్న మీకు ధన్యవాదములు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

సహృదయ సోదరీ!
రాజరాజేశ్వరీ!
ఈశ్వరి సత్కృపామహిమనెంతగ చెప్పిన తక్కువే. భువిన్
శాశ్వితమైన కీర్తి ప్రద సజ్జన మైత్రి నొసంగె నాకు. రా
జేశ్వరి సోదరీ! సుజన సేవిత పాద! కృపా సముద్రమా!
ఈశ్వరి మత్కలంబున వసించి రచింపగఁ జేయు నిచ్చలున్.

Unknown చెప్పారు...

చింతా రామకృష్ణారావు. గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మనోహరమైన మీ హారాన్ని గూర్చి తెలుసుకొన్నాను.
చాలా సంతోషమండి!
మీరు నాకు చేసిన చక్కని సూచనను; ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. ఇందు నిమిత్తము ధన్యవాదములు.
నా టపాపై కూడా మీ అభిప్రాయాన్ని వ్రాసి ఉన్నట్లైతే మాకింకా ఆనందాన్ని కలిగించినవారై ఉండేవారు.
మీ సూచనకు ధన్యవాదములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.