గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, ఏప్రిల్ 2010, గురువారం

సర్వ లఘు సీసము. మనమూ వ్రాయలేకపోతామా? యత్నించండి.

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgs3Y5q-HAOZq6jufeUohmhV6AVyqGy7f_Nbj8f07MIele51p1IN2X4limpqmm0poHgfQTP3kbYeeKOZKkepVELiYZvzzpK-K71ERZEYsEOysnQSU6cdAXChk5iIrF_mmJMhdEyZGH-yhGS/s320/Srirama.jpg
విశాఖ పట్టణమున వసించుచున్న శ్రీ నేమాని రామజోగి సన్యాసిరావు అష్టావధాని గారీమధ్యనే విరచించిన శ్రీమదధ్యాత్మ రామాయణము అను బృహత్తర గ్రంథమున షష్ట్యంతములలో శ్రీరాముని వర్ణిస్తూ ఒక సర్వ లఘు సీసమును వ్రాసి యుండిరి. ఇది వినుటకు చమత్కారముగ నుండి హృదయానంద హేతు వగుచున్నందున మీ ముందుంచుచుంటిని. ఇక చూడుడు.
సీ:-
జలజ హిత కుల కలశ జలధి హిమ కిరణునకు - దశరథుని తనయునకు నశికి హరికి;
జనక సుత హృదయమున తనరు ప్రియ సదనునకు - జన హృదయ నిలయునకు సహృదయునకు;
దివిజ గణ వినుతునకు; దితిజ గణ శమనునకు - జగదవన నిరతునకు జన హితునకు;
భవ భయములను దొలచి; పరమ సుఖములనొసగు - పరమ పురుషునకు పురహర సఖునకు
తే.గీ. 
వనజ దళ నయనునకు శుభ చరితునకు; - సవన ఫలదునకు నిగమ చయ నుతునకు;
దశ వదన ముఖ సురరిపు తపనజునకు; - కలిత భుజునకు విభునకు కపి హితునకు;

మనమూ ప్రయత్నించి సర్వ లఘు సీసము కని, సర్వ లఘు తేట గీతి కాని; సర్వ లఘు ఆట వెలది కాని; మరే యితరమైనదైనా గాని రచించే ప్రయత్నం చేస్తే కడుంగడు మెచ్చుకోలుగా నుండును కదూ? అందుకే తప్పక వ్రాసే ప్రయత్నం చేయండి; వ్రాసి పంపండి. ఎదురు చూస్తూ ఉంటాను; పంపుతారు కదూ?
జైహింద్. Print this post

30 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు " సర్వ లఘు సీసము " అనగా అన్నీ లఘువులతోనె వ్రాయ వలయునా ?ఐతె అలా రాయగల అదృష్ట వంతులు తమ వంటి పాండితీ స్రష్టలే ఇవన్నీ చదవగల అదృష్టం ఇప్పడి కైనా కలిగినందుకు చాల ఆనందం గాఉంది. తమ సొదరి

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

దైవ దత్త సహోదరీ! రాజ రాజేశ్వరీ!

క:-
కలికిరొ! చిలుకల పలుకులఁ
సలలితముగ సరస మృదుల చవులు కనబడన్;
బలుకుచు; పలుపలు విధముల
మెలకువలను గొలుపుదువుగ మిగులుగ! మృదులా!

Sandeep P చెప్పారు...

సీ:-
నిరతము భగవతి కరుణను రసనము సరసకవితలకు సదనమవద?
తిరముగ కృపనిడి గురువులు నడుపగ కవితలు పొరలవె? కలము కదుప
రసమయజగమున మసలుచు మురిసెడి శుకపికములవలె సుమధురముగ
తెలుగున పదములు వెలువడు బుధజనవినుతికి సరిపడు విధముగ సుధి!

ఆ:-
వెదురునుసురు పడయు! విదురవినుతుఁ చెయి
తగిలి మురళియగును, తపము ముగిసి
నుడివెనటులనిపుడె జడమతియు కవిత,
తమరి కరుణ కలిగి సుమతి! వినుమ

రవి చెప్పారు...

సీ||
జయము హరునకు, త్రిజగముల ధవునకు,
గజగరసు ధరుడు, గజముఖు పిత,
వెలికరువ విడిది, వెనదగు పెనుపరి
అనవరత స్మరిత హసిత ముఖుడు,
మదనదహనుడు, అమరనదవహి, ధరఁ
మసనములఁ దిరుగు అసుర నుతుడు
శిఖిరథి సవితుడు, మఖహతకుడు, హిమ
గిరిసుత పెనిమిటిఁ, దిరిపెమునకు,

తే.గీ ||
ఎలమి నలు దిసలనుఁ దన వలువలుగఁ దొ
డగిన అహిధరుడు,బుడబుడకల పతికి,
కమలభవు శిరము చెలగి కసిమసగిన
తరుణ శశిధర శశిముఖ పరమ శివుఁకు.

నిఘంటువు తప్పలేదండి.

గరసు = చర్మము
వెలి = తెల్లని
కరువ = కొండ
(వెనదగు-ప్రయోగం సరియో కాదో తెలియదు. వెనలేని వేదములు వెదకి చేర్చిన చేయి అని అన్నమయ్యను తలుచుకుని, వెనదగు అని ఉపయోగించాను)
పెనుపరి = ఐశ్వర్యప్రదాత
కసిమసగిన = ఖండించిన

**************

అనవరత స్మరిత హసిత ముఖుడు = ఎల్లప్పుడు ధ్యానమగ్నుడై, సుస్మిత వదనము దాల్చిన వాడు

శిఖిరథి సవితుడు = నెమలి వాహనుఁ దండ్రి.

***************

తప్పులుంటే దయచేసి సూచించగలరు. పెద్దలు మీరున్నారని, ఈ సాహసానికి పూనుకున్నాను.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రవి కృత కవనము చదివితి.
సువిదిత మగుటను మనమది సుఖమును గనె. భా
రవి కననివియును కనుగొనె!
రవికిని రవి సరిసముఁడగు రచనలు సలుపన్.
రవీ! ధన్యోస్మి.
ధన్యవాదములు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

సందీపూ! నీ వ్రాతన్
సౌందర్యోపేతమంచు; సర్వుల్ పొంగన్
డెందంబందెన్హాయిన్.
సందున్నన్పద్యమల్ల సౌమ్యుల్ మెచ్చున్.

Sandeep P చెప్పారు...

మీ భాషాఙానంబున్
మా బాగాచూపినారు, మాబోటుల్ మి
మ్మున్ భూషించన్ శక్యం
బే? భాషాభానుమూర్తి! విఙశ్రేష్ఠా!

ఊకదంపుడు చెప్పారు...

రామకృష్ణా రావు మేష్టారూ,
ఆటవెలది రాశననుకుంటున్నాను, తప్పొప్పులు చెప్పగలరు.

విరిసి కురుల విరులు మరులుగొనమదియె
నిదుర చెదరి, పడకనొదుగజతగ
సతి కదలి యొరిగెను పతిదెసకు, కనియె
శశి నిలచె కదలక సరసుడగుట.



సందీప్ గారూ, రవి గారూ, భలే...భలే ...!!!
నేను ఆటవెలదికే చేతులెత్తేశి, ఎదో అయ్యిందనిపించగల్గాను..
మీరిరువురూ చిటికెలో సీసము ఎత్తుగీతి పలికించారు...

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ప్రియమైన సందీప్!
అభినందనలు.

పదముల యమరిక నెఱిగిరి.
పదునగు పదములను కలిపి విలువలు పెరుగన్
యెదలను కదుపుట నెఱిగిరి.
సదయులగుచు నను మదినిడి సఖులయితిరిగా!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! ఊకదంపుఁడు ఉత్సుక నామధారీ!

దోషం బెన్నన్ గానన్.
ధ్యాసన్ వ్రాయన్ సఖుండ! తప్పేలుండున్?
మీ సత్వంబే గంటిన్.
భాషా సంస్కారముండె. బాగుండెన్గా!!!

రవి చెప్పారు...

గురువులు తమరును మాకును
అరయముగ నిటుల కవితను ఆలాపింపన్
విరివిగ వ్రాయగ లేమొ? త
మరి ఆశీర్వచనములను మాకందింపన్.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

చిరంజీవి రవీ!

వ్రాయన్; వ్రాయించన్ నే
మీ యందీ ప్రశ్ననుంచి మేలౌనట్లున్
ధ్యేయంబున్ గల్గంగా
వ్రాయంగా లేని దేది? భవ్యాత్ముండా!

కామేశ్వరరావు చెప్పారు...

మీరిచ్చిన పద్యంలో "నల"/"నగ" బదులు "నలల" గణాలు ఉన్నాయి. "నగ" వేస్తే వచ్చే పంచమాత్రల నడక సరిపోయినా, లక్షణం ప్రకారం అది సీసమవ్వదు కదా?
ఇది ఒక కొత్త రకమైన రగడ అనుకోవచ్చేమో!

సందీప్, రవిగార్లవి రెండూ అచ్చమైన సీసాలే. బాగున్నాయి. ఊదంగారి సర్వలఘు ఆటవెలది కూడా బాగుంది.

.C చెప్పారు...

కం.
హరిణపు తతి పగిది పరుగు,
సురవన సుమసరము వలెను సొబగుల నెలవై
సరి లఘువుల నడకల సిరి
సరసపు హృదయపు బహుమతి సభికులకిదిగో!

సీ.
ముదమున నెగసెను పులకరమున యెద - తమ తమ కవితల సుమధురిమల రుచి
పలు దినముల పిదప దెలియగ మదికి - కలమది నుఱుకుల గదలగ రసమయ
పదములు పొదిగియు హృదయములలరగ - పదునగు లఘువులు పలుకుల నమరగ
రచనము విరిసెను రయమున గదులుచు - ఒడుపది తమరిదె, కడు కడు నెనరులు!

ఆ.వె.
నిలువని గమనమున పలు తళుకుల సిరి
కుదురుగ లఘువులవి కొలువవగను
రసికులు, గురువుల వరములకు బదులుగ
మిలమిల నిగనిగలు మెఱిసెనిచట

తే.గీ.
సభను కవులు గలిసిచట నిభసమముగ
కలముల లఘువున నడుపగ వెలసెనివె
కవితలు, కొలనిని కలువల వలె విరిసె,
విని విరిసిన మనసులవి వెలుగులిడగ

ఉత్సాహ.
పదుల లఘువులొకటి యవగ పలుకు మధురమయెనుగా
నదిని అలల పగిది గలసి నడచి సొగసునలరగా
ఎదను సుధలు పదముల డిగి* యెదుట పడిన క్షణములో
వెదుకదలచు నిధియె దొఱికి విరిసె మనసు రతనమై

కం.
ఒడిదుడుకుల నడకల వడి
తడబడినది యచటనచట తలవని తలపై,
కడకెటులనొ సరి యడుగుల
బడి పరుగిడెననుకొని వదరితి నిచటన్

తప్పులు చేయలేదనే అనుకుంటున్నాను. కానీ అన్ని లఘువుల మధ్య లాఘవంగా నడిపించటంలో అనుభవము లేక జరిగిన తప్పులేమైనా చేసి ఉంటే, చెబితే సరిదిద్దుకొనగలను.

(* = పడముల+డిగి = పదము లడిగి, పదముల డిగి/దిగి అన్న రెండు అర్థాలూ వస్తాయని చేసిన ప్రయోగం సరైనదేనని అనుకుంటున్నాను.)

Sandeep P చెప్పారు...

భ్రాతా! నీ పద్యంబుల్
నే తీరిగ్గా పఠించఁ నీమాలెల్లన్
తోతెంచెన్, సీసంబం
దున్ తప్పేనే? గణించు, దోషంబెంచన్

(తప్పని చోట తప్ప అన్నీ దీర్ఘాలు ఉన్న కందం ఇది)

చదువరి చెప్పారు...

అదరగొడితిరిచట మధుర కవనములు
ఒకరి మిగిలి యొకరు ఉరికి యురికి
లఘువు బలిమి తెలుపు రచనలు సలిపిరి
గురువు దెసనె గనక గురువు లయిరి

గురువులిట బరువట, కుదరవట అకట!
లఘువు లిముడ వలెను లలితముగను
గురువు లగుట వలన కుదురును తమరికి
లఘువు కిటుల తెలిసె రచన కిటుకు

ఊకదంపుడు చెప్పారు...

(.C) కిరణ్ గారూ, మీ పద్యాలు ఇదేనండి ప్రధమం చూడటం...
నే గణాలు లెక్కపెట్టలేదు కానీయండి, బావున్నాయి.
ఇభసములు నిజమే .. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కళ్లు బయటపడుతున్నారు..
మీరేమో నదుల అలలు అంటున్నారు ..
నాకు గురు రహిత కవనం చూస్తే .. అలలు కదలని కడలి వలె కనపడినవి.

మీరు అందరినీ సభికులు అనేశారు ....రామకృష్ణారావు గారు ఏమంటారో మరి

భవదీయుడు
ఊకదంపుడు

ఊకదంపుడు చెప్పారు...

కిరణ్ గారు, ఇప్పుడే మీ ఇంటిపుట చూసి డా.నచకి గా గుర్తించాను, సంతోషం.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా!
C. గారూ! అభినందనలు

తమదగు యతనము ఘనమది.
సుమధుర మనఁ దగదు. కనగ సురుచిరమగు సీ
సము తుదఁ గల రవి గణములు
సమముగ యొనరగ యతనము సలిపిన కుదురున్.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మీరు కిరణ్ ని తెలుసుకొన్నాను. చాలా సంతోషం.
మీకు కవితావేశం అత్యద్భుతంగా ఉంది. నాకు చాల ఆనందం కలిగింది. మీ వంటి యువ కవులు పదిమంది తయారవాలని నాప్రగాఢమైన ఆకాంక్ష.
అనేక ఛందో రీతులలో పద్యాలను ఆసువుగా చెప్పినవిధంగా చెప్పిన మీకు నా అభినందనలు.
ఐతే అత్యద్భుతంగా ఉన్నాయి అని అంటే అది పొగడ్తే ఔతుంది. నేనలా అనను కాని; మీ ప్రయత్నం కొనసాగిస్తే మాత్రం అత్యద్భుతమైన పద్య రచన మీ సొత్తౌత్తుంది అని మాత్రం అనగలను. ఆ సరస్వతి మిమ్ము కటాక్షిస్తుంది. ప్రమాదో ధీమతామపి అన్నారుగా! అలాంటప్పుడు దశ దోషాలలో ఏ దోషమూ లేని పద్యాలు వ్రాసే కవులు అరుదుగా మాత్రమే ఉంటారు. ఏది ఏమైనా మీ కవిత్వం నా కు ద్విగుణీకృత ఉత్సాహాన్నిచ్చింది.
అభినందనలు;
ధన్యవాదములు.

.C చెప్పారు...

ఈసారైనా తప్పులు లేవనే ఆశిస్తున్నాను. కానీ నాకదేంటో తప్పులు దొర్లుతూనే ఉంటాయి, ఎన్ని సార్లు సరి చూసినా! :-(

కం.*
Impatience is culprit
Compensation hitherto coughed up promptly!
Some patience I need - More
important is remembering this mistake!

కం.
రామా! కృష్ణా!** చెప్పా
రేమా తప్పేంటనంచు నిట్లా జూస్తే...
ఏమంటా, నేనైనా?
ధీమాగా తప్పు జేస్తి, తేలిందద్దే!

కం.
ఏమో, ఏం చేస్తాంలే!
ధీమాతో చూడలేదు - This is so true!
నీమాలేం గుర్తే లేవ్!
ఆ మాటే ఒప్పుకుందు నంతే, సత్యం!

సీసాల్లో సూర్యుండా?
ఓసోసంతే గదాని ఓ లుక్కేస్తే
చూసానింకంతే shock!
ఓసారీ లేడినుండు యింద్రుల్ నిండన్!

సీ.
"రవి" యగుపడనటుల మొయిలొకటి యట "సురపతి" నిలిపెను, సొగసు చెడెను
రవిని గనని కవిని విడువదె నిశియు! మరులు గొలిపెను అమరుల ప్రభువు
తిమిరమది మది నతిగ బరచుకొనెను, కనుకనె గనకనె మునిగితినిట
సురల విధములవి పరిపరి యగునట, తెలియని మరుడను, వలను పడితి!

తే.గీ.
అకట, తికమకలగు యమరికల నడుమ
తడబడెను పదము తుదకునడుసున వడి!
తెలిపిన గురువులకు నెనరులివె గొనుడు -
చివరను దెలుపుటది పొగరవదు, నిజము!
(అది చివర బలుక పొగర ననుకొనకుడు)

(* - ఆంగ్లంలో syllables ప్లుతములే కానీ గురువులు కాదని గతంలో ఎవరో చెప్పగా విన్నాను. అయినా నేను వాటిని గురువులుగానే గ్రహించానని మనవి. ఆంగ్లంలోనూ పద్యసంభాషణలు చేసి నన్ను ప్రేరేపించిన గురువు సుప్రభ గారికి నెనర్లు.)
(** - రామకృష్ణ సాందీపు, శ్రీ రామకృష్ణ గురువర్యుల వారు తప్పని చెప్పిన తరువాత... అన్న అర్థమూ ఉన్నది.)

.C చెప్పారు...

@ఊకదంపుడు: మీ అభిమానానికి ధన్యుణ్ణి. గురువర్యులు శ్రీ "సిరివెన్నెల" సీతారామశాస్త్రి గారు వ్రాసిన సర్వలఘుపంక్తులలో నాకు ఎప్పుడూ ఒక లయ కనిపిస్తుంది. అది స్వరక్రమం వల్లనేమో తెలియదు కానీ... మచ్చుకి కొన్ని ఉదాహరణలు:

1. ఇది వఱకెఱుగని వరుసలు కలుపు ముఱిసిన (బంధు జనం); తమ నిగనిగ నగలను పదుగురి ఎదురుగ (ఇదిగిదిగో యని చూపెడుతూ)
2. మురళికి గల స్వరముల కళ పెదవిని విడి పలుకదు కద; ఇది తెలియని మనుగడ కథ దిశనెఱుగని గమనము కద!
3. పలికిన కిలకిల స్వనముల స్వరజతి జగతికి (శ్రీకారము కాగా)
4. తొలి తొలి తొలకరి చిలికిన చినుకు; పుడమికి పులకలు మొలకల పిలుపు
5. ...ఎదసడి నడిగితె శ్రుతి,లయ తెలుపద, బ్రతుకును నడిపిన (సంగతి తెలియద); వినగల చెవులను కలిగిన హృదయము తన ప్రతి పదమున చిలకద సుధలను; ...నిలువున నిమిరితె గగనము కఱగద, జలజల చినుకుల సిరులను కుఱవద, అణువణువణువున తొణికితె స్వరసుధ అడుగడుగడుగున మధువని విరియద(దా...)?
6. గగనము వెఱువగ గమక గతులు (సాగ), పశువుల శిశువుల ఫణుల శిరసు (లూగ)
7. తొలి చినుకుల తడి ఇదని, తొలి కిరణపు తళుకిదని, తొలి వలపుల తలపిదని (ఎట్టాగ పోల్చడం?); జత కుదిరిన క్షణమిదని, ముడి బిగిసిన గుణమిదని, కథ ముదిరిన విధమిదని (ఎట్టాగ తేల్చడం?)

...ఇవి మఱి కొందఱికైనా ప్రేరణ కాగలవనిపించి వ్రాసినవే తప్ప వ్యక్తిపూజగా చూడవద్దని మనవి. నేను చూపించదలచినది లఘువుల వాడుకలో వైవిధ్యమూ, వాటి లయ విన్యాసమే తప్పించి వ్రాసిన వ్యక్తిని గుఱించి కాదు.

మరో సంగతి: నేను ఇంకా "డా." నచకి కాలేదు. మరో సంవత్సరం పడుతుంది లెండి. :-)

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రీ భైరవ భట్ల కామేశ్వర రావుగారూ! సర్వ ల్ఘు సీసము విషయంలో మీ ఆక్షేపణను తెలిఁ జేసారు.
నేను ప్రకటించిన నల కాక నగ తో తుల్యమైన నలల ను ఇంద్ర గణంగా గ్రహించి సర్వ లఘు సీసమును వ్రాయుట ఉచితమే యనే విషయమునకు సంబంధించిన ఆధారాలు మీ ముందుంచుతున్నాను. పరిశీలించ మనవి.

అప్పకవీయమున 4 వ ఆశ్వాసమున గల 531 వ పద్యము సర్వ లఘు సీసమును తెలియఁ జేస్తుంది.

ఉదాహరణకు పోతన మహాకవికృత శ్రీ భాగవతమున గల సర్వ లఘు సీసము ఒకటి ఇక్కడ చూడ గలరు.

నవ వికచ సరసి రుహ నయన యుగ ! నిజ చరణ గగన చర నది! నిఖిల నిగమ వినుత!
జలధి సుత కుచ కలశ లలిత మృగమద రుచిర పరిమళిత నిజ హృదయ! ధరణి భరణ!
ద్రుహిణ ముఖ సుర నికర విహిత మతి కలిత గుణ! కటి ఘటిత రుచిరతర కనక వసన!
భుజగ రిపు వరగమన ! రజత గిరిపతి వినుత! సతత వృత జప నియమ సరణి చరిత!
తిమి! కమఠ! కిటి! నృహరి! ముదిత బలినిహి
త పద! పరశు ధర! దశ వదన విదళన!
ముర మథన! కలుష సుముదపహరణ
కరివరద! ముని నరసుర గరుడ వినుత!
(శ్రీ మహా భాగవతము ఏకాదశ స్కంధము చతుర్థాధ్యాయము. 72 వ పద్యము.)

కామేశ్వరరావు చెప్పారు...

రామకృష్ణారావుగారు,

సందేహ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. తెలియని విషయాన్ని తెలుసుకున్నాను. ఏకాదశ స్కందం కాబట్టి ఈ పద్యం పోతనది కాదు కాని, భాగవతంలో ఉండి, లక్షణకారులు ఒప్పుకున్నారు కనుక ఇక ఆక్షేపించాల్సింది ఏమీ లేదు. అప్పకవి చెప్పిన లక్షణాన్ని చూస్తే పంచ లఘువులతో ఉన్నదే సర్వలఘు సీసం అన్నట్టుగా ఉంది! అంటే అన్నీ "నల" గణాలతో వ్రాస్తే దాన్ని "సర్వలఘు" సీసం అనలేమా? అప్పకవి (అంతకుముందు అనంతుడు) ఇచ్చిన ఉదాహరణ పద్యాలలో ఎత్తుగీతిలో మాత్రం సర్వలఘు నియమం పాటించకపోవడం ఆశ్చర్యంగా ఉంది!

సందేహం అడగగానే అప్పకవిని, భాగవతాన్ని ఉదహరించిన సన్యాసిరావుగారి పాండిత్యానికి జోహార్లు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా!కామేశ్వర రావుగారూ! సుమనర్నమస్సులు.
మీరిచ్చే ఉత్సాహమే రచయితలకు వరం. మీ అభినందనలందుకొన్న మన మెత్ర కవులు ద్విగుణీకృతోత్సాహంతో రచనలు చేయఁ గలరని మనవి చేయు చున్నాను. పోతన భాగవతంలో నారయ రచనగా వివరంగా వ్రాసాను. 36 లఘువులను కలిగి తీరాలనే అప్పకవి నియమం కూడా వ్రాసాను. ఈ రోజే పోష్ట్ చేసాను.
తప్పులుంటే సరిచేస్తూ ప్రోత్సహించే మీకు ధన్యవాదములు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్య! చదువరీ!
మీ సర్వ లఘు పద్యద్వయం చాలా బాగుంది.మొదటి పద్యంలో 3వ పాదంలో యతి విషయంలో నా సందేహం తఒకటుంది. ఈమధ్య మరుపు రోగం వచ్చిందేమో నాకు. తెలియటం లేదు. మీది తప్పు కాక పోవచ్చ్ ఐనా నేను తెలుసుకోవడం కోసం అడుగుతున్నాను.

ళలలకు; లడలకు; వబలకు;
నిడిటొప్పును యతినినిక లరలకనన్
కలుగునదెక్కడ? తెలుపరె?
సులలితముగ యతులయందు.సుజన! చదువరీ!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అమ్మా!శ్రీమతి రాజేశ్వరక్కా! నమస్తే.
చూచారా! మీరూ కవయిత్రే.
కొంచెం శ్రద్ధ పెట్టాలే కాని పద్యం వ్రాయడం మీకు పెద్ద పనేం కాదు.
మీరు వ్రాసిన పద్యాన్ని గణ బద్ధం చేస్తున్నాను చూడండి.

ఇత్తరి కందము సీసము
మత్తుగ నే చదివి చదివి మానసమందున్
చిత్తుగ తమ్ముని పొగడగ
సత్తువ నాకలము కేది? సత్కవి! తమ్మూ!!!

చూచారా! మీ భావనే మీ భాషే చిన్న మార్పుతో కందపద్యంగా మారింది.
మీ హృదయంలో తమ్మునిగా నాకీ స్తానం ఆ పరమాత్మే కలిగించాడు. ధన్యవాదాలమ్మా!
నమస్తే.

ఊకదంపుడు చెప్పారు...

రామకృష్ణా రావు గారూ,
ఇక్కడ
http://andhrabharati.com/bhAshha/ChaMdassu/sulakShaNasAramu/5.html
5.4.20 లో అబేధ యతి పద్యం (131) చూడండి. ల ర లకు యతి చెల్లునట్లు నాకు దాని భావము తోచినది.
భవదీయుడు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా!ఊ.దం. గారూ!
నాకో మంచి అవకాశం కల్పించిన వారవతారు. ఆ పద్యాన్ని దయ చేసి టైపు చేసిపంపితే.
మీరు పంపినది తెలుగులో రాకుండా ఇబ్బంది పెడుతోంది.
దయచేసి తెలుగులో టైపు చేసి పంప మనవి.

ఊకదంపుడు చెప్పారు...

రామకృష్ణా రావు మేష్టారూ,


తే. లలిత వీణారవంబుతో ! డక్క సరియె
రమ్యమణిరాజరాజితో ! లక్క సరియె
భరితభువనార్ణవంబుతో ! వంక సరియె
ననఁగను నమేధ నామాఖ్య ! యతులు సెలఁగు

ఇదండీ పద్యం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.