గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, ఏప్రిల్ 2010, గురువారం

కవి సమ్రాట్ విశ్వ నాథ భావుకత 39.

శా:-
నానామౌనికులంబులన్ ప్రియ సఖుల్ నానా మునీంద్రాంగనల్ 
కానల్ కోనల యందు పండుగులకున్ గైకొంచు తా రేగి డో
లానిర్వ్యాజ రసాను కూలమగు హేలన్ వల్లులన్ దూగి నా
తోనావార్తలు చెప్పు జానకియు చేతోవీధి బాధించెడిన్. ( వి. రా. క. వృ. కి. కాం. నూ. స. 1- 39 )
ఎందరో ఋషుల భార్యలు సీతకు ప్రియ సఖులు. ఆ ఋషి పత్నులు పండుగలూ పబ్బాలూ వచ్చినపుడు సీతను తమతో తీసుకొని పోయేవారు. వారందరూ యధేచ్ఛగా అడవి తీగల తూగుటుయ్యాల లూగేవారు. ఆశ్రమమునకు వచ్చి ఆయా క్రీడా విశేషాలు ఆసక్తియో నాతో చెప్పు జానకి స్మృతి నా హృదయాన్ని బాధపెట్టు చున్నది.
రామునికి అవిస్మరణీయమైన సీతా స్మృతుల్లో ఒక అందమైన జ్ఞాపకం. సీతా దేవి ఎక్కడ ఉన్నా ఋషి కాంతలతో ఇట్టే కలిసిపోయేది. ఆ ముని పత్నులూ అంతే. ధార్మిక జీవనానుబద్ధలైన ఆ ఋషి కాంతలకు భర్తృ జీవనానుగమనమే వ్రతం. ఐననూ ఏ పండుగలయందో వారి కొకింత ఆట విడుపు. ఆ సమయంలో వారు సీతను ఆత్మీయంగా తమతో తీసుకొని పోయి ఉయ్యాల లూగేవారు. మధురంగా సంభాషించేవారు. బహుశా ఆ ఋషి పత్నులు రాచరిక జీవన విధానాలకు శ్రోతలై యుండగా సీత ఋషి జీవిత సంప్రదాయాచారాలకు శ్రోత అయి ఉండ వచ్చును. సీత తిరిగి వచ్చి రామునితో ఆ విశేషాలను పూస గ్రుచ్చినట్లు చెప్పి ఆనందించును కాబోలు. అట్టి సీతా స్మృతి శ్రీరామునకు ఇప్పుడు దుఃఖ హేతువైనది.
మనకు అత్యంత ప్రియతమమైన వ్యక్తి మనకు దూరమైనాడనుకొందము. ఆ వ్యక్తి యొక్క ప్రతీ కదలిక; ప్రతీ మాటయు మనకు పదే పదే జ్ఞాపకము వచ్చును. ఈ సమయమున వాఁడిట్లుండి యుండెడివాఁడు. ఇట్లు మాటలాడేవాఁడు అని ప్రతి క్షణ భార విహ్వలము కామా? అదే ఇప్పటి శ్రీరాముని స్థితి.
మహా కవుల కల్పనమునందు ఎక్కువ భాగము వారి ప్రతిభపై ఆధార పడి యున్నది. అతఁడు పూర్వ కవులను చదివి యుండ వచ్చును. వారి ప్రభావము ఈ కవులపై తక్కువ. నిరంతర మననము చేత మహాకవి అనునట్టివాడు పూర్వ కవుల వాక్కులలోని మర్మములను తెలుసుకొని అట్టి మర్మములను తాను కూడా ప్రయోగించును. సందర్భము వేరు వేరు కావచ్చును.
కాళిదాసు ఉన్నాఁడు. ఆయన అభిజ్ఞాన శాకుంతలము ఉన్నది. శకుంతల మరియు ఆమె వెనుక వచ్చిన తాపసులు ఎంత చెప్పినను ముని శాపమువలన దుష్యంతునకు తాను శకుంతలను వివాహ మాడితినన్న విషయము స్మృతికి రాలేదు. తరువాత అంగుళీయక దర్శనము వలన శకుంతలా వృత్తాంతము సర్వము జ్ఞప్తికి రాగా రాజు ఆమె యందు సావధాన భావుకుఁడైనాఁడు. నాడు సభలో "నీవు నాభార్యవు కాదు"  అని తాను పలికినపుడు వెంట వచ్చిన కణ్వ శిష్యులు నీవు మావెంట రావలదని శకుంతలతో కటువుగా పలుకగా ఆమె భాష్ప పూరిత నేత్రములతో తనను చూసిన చూపు విషము పూసిన బాణపు ములుకు వలె బాధించు చున్నది  అని దుష్యంతుఁడు అన్నాడు.
ఇతః ప్రత్యాదేశాత్ స్వజనమనుగతుం వ్యవసితా
ముహుస్తిష్ఠేతి వదతి గురు శిష్యే గురు సమే
పునః దృష్ఠిం బాష్ప ప్రసర కలుషా మర్పితవతీ
మయీ క్రూరే యత్తత్ స విషమివ శల్యం దహతి మాం.
స్మృతి విషలిప్త శల్యము వలె బాధించు చున్నదట. అంతే కాక దహించివేయుచున్నదని కాళి దాసు దుష్యంతునిచే అనిపించినాడు.
విస్మృతియందు ఏ బాధయు లేదు. స్మృతి బాధను రెట్టింపు చేయును. ప్రతిభాశాలి కల్పన ఇట్లుండును. ఆ కల్పన భావుకుని మనస్సును వ్రక్కలించును. మనస్సు వ్రక్కలించఁ బడగా దూరాన కన్పించునది జీవ చైతన్యమే అని విశ్వనాథ తన కావ్యానందంలోఅనినాడు.
ఈ సందర్భమున వాల్మీకములో ఇట్లున్నది.
స్మిత హాస్యాన్తర యుతం గుణవన్మధురం హితం.
వైదేహ్యా వాక్యమతులం కదా శ్రోష్యామి లక్ష్మణ!
లక్ష్మణా! సీత చిఱునవ్వుతో మధ్యమధ్య వినోదం కొఱకు నవ్విస్తు మాట్లాడుతూ ఉండేది. ఆమె మాటలు గుణవంతములై మధురం గానూ హితం గానూ ఉందేవి. మళ్ళీ  ఆమె మాటల్ని ఎప్పుడు వినగలనో కదా.
మూలశ్లోకంలోని భావానికి విశ్వనాథ ఎంత కల్పనము చేసాడో. మూలమునకు అనువాదమూ అనుసరణమూ  కాని  ఒకానొక ప్రతిభావంతమైన కల్పన  ద్వారా ఎంత సౌందర్యమును జాలువార్చినాడో గమనిస్తే ఆ మహా కవి భావుకత విశదమౌతుంది మనకు.
జైశ్రీరాం.
బులుసు వేంకటేశ్వర్లు.
సెల్ నెం. 09949175899.
చూచారుకదండీ! ఎంత శ్రమించి మన కవి వతంస బులుసు వేంకటేశ్వర్లు శ్రీ విశ్వనాథ భావుకతను వెలువరిస్తున్నారో!
మిగిలిన భాగాలు కూడా సావధనంగా తెలుసుకొందాం అంతవరకూ ఆంధ్రామృతాన్ని గ్రోలుతూ ఆనంద రస సాగరంలో మునిగి తేలుతూ ఆ పరమాత్మ దయకు పాత్రులమౌదామా!
జైహింద్.    
Print this post

4 comments:

Maruti చెప్పారు...

బాగుందండి !!

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

రామునికి దు:ఖ హేతువైన సీతా స్మృతి అతడి విరహ వేదనని " బాధే సౌఖ్యమనె బావన " అన్న ఆధునిక కవుల రీతిలొ సునిసితంగా వివరించారు." శకుంతలా దుష్యంతుల ఘట్టం " " వరూధినీ ప్రవరాఖ్యుల ఘట్టం " ఇలా మధురమైన విరహ వేదనలు మరీ మరీ చదవాలని పిస్తాయి. ప్రకృతిలొ పుట్టిన సీత అన్నీ మర్చి పోయి ప్రకృతిలొ లీనమై జీవించ గలదు. మర్చి పోతున్నామన్న బాధని మరపించటాని కా అన్నట్టు మంచి కావ్యాలను మనముందుంచుతున్న " కవి వతంసులు శ్రీ బులుసు వారు యధాతధం గా అందిస్తున్న చింతా వారు అభినంద నీయులు. మీ కృషి అనన్యము.

Sandeep P చెప్పారు...

బులుసు వేంకటేశ్వరులు గారు వారు వివరించిన విషయాన్ని ఇక్కడ తెలిపినందుకు ధన్యవాదాలు అండి!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఉల్లసన్మూర్తి వరులకు.
నమస్సుమాంజలి.
మీ స్పందనకు ధన్యవాదములు.

ఆంధ్రమునభ్యసించితిరి అద్భుతభక్తి ప్రపత్తు లుండె. మీ
రాంధ్రులు.ఆంధ్రబాలురకు ఆంధ్ర సుబోధకు లీరు. ఉల్లసత్
సాంద్రనిగూఢ భావనను చక్కగ విప్పి వచించి నట్టి యీ
యాంధ్రునివేంకటేశ్వరుని అద్భుతపద్యమునందు మెచ్చుడీ!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.