సీత జాడ తెలియరావడం లేదు. కాలం గడిచిపోతున్నది. శ్రీరాముఁడు కాల గమనమునందు అసహిష్ణువు అగుచున్నాఁడు. ఆ క్షణమున ఆయన భావనలిట్లున్నవి.
" ఈ సూర్యునకు ఎవరినీ సంతోష పెట్టు స్వభావం లేదు. ఉదయ సంధ్య అను కామినికీ; సాయం సంధ్య యను భామకూ; ఇరువురికీ కోపం కలిగించు చున్నాఁడు. (ఆయా సంధ్యలు సూర్య సమాగమమునందు ఎఱ్ఱ బడుచున్నవి. ఎఱుపు కోపమునకు సూచకము. ప్రియుఁడు తమ యందు ఎక్కువ కాలం గడపకపోవడం వల్ల ప్రాక్ పశ్చిమ దిగంగనలకు కోప కారకు డగుచున్నాఁడు) పోనీ జలజాప్తుఁడని పేరు పొందినందుకు ఆ పద్మినినయినా సంతోష పెడుతున్నాడా? అదీ లేదు. మిట్ట మధ్యాహ్న సమయమున ఆమె వేడి కన్నీళ్ళు విడుస్తూ దుఃఖించునట్లు చేస్తున్నాఁడు. ఈ విధంగా ముగ్గురు సతుల్నీ అలరింప లేని నిత్య తపన శీలము నిరంతర గమన శీలము గల భాస్కరునకు కలుగుచున్న సతీ విరహమునకు అంతమే లేదా? అయ్యో! దనుజ గ్రస్త అయిన సీతపైనా సూర్యునకు కనికరం లేదు. సంధ్యా సమయానికే చీకట్లు ముసురు తున్నాయి.
ఈ విధమైన విశ్వనాథ భావుకతయందు అవతరించిన పద్యమిది.
మ:-
అనయంబున్ జలజాప్తుడై ఉభయ సంధ్యా కామినీ కోప భా
జనిఁడై ఆ సతి ఉష్ణ భాష్ప సలిల వ్యాసక్త చిత్తాబ్జగాన్
దినముల్ పుచ్చెడు నీ వియోగమునకుం దీరమ్ము లేదాయె నా
దనుజ గ్రస్తకుఁ గాడు భాస్కరుఁడు సంధ్యా వేళకే యింతయున్.
(వి.రా.క.వృ.కి.కాం.నూ.స.1-37.)
కాలము పరమేస్వర స్వరూపము. భూత భవుష్యద్వర్తమానము లను పేర లిప్త లిప్తకూ పరిణామ రూపముగా కదలి పోవుచున్నది కాలము. భగవానుడు గీతలో"కాలోస్మి లోక క్షయ కృత్ ప్రవృద్ధః?" అని నాడు. ఈ కాలమున కవులు మన ప్రాచీన కావ్యములలో ఋతు వర్ణలను పేర వర్ణించారు. కొందరు భౌతికముగా కాలమునందు ప్రకృతిలో కనబడు మార్పులను రమ్యంగా వర్ణించగా మరి కొందరు కథా గమనమునకు నేపథ్యముగా, సూచ్యార్థకముగా వర్ణించారు. కాళిదాసు ఋతు సంహారమును ఈ నాటికీ అనుసరిస్తున్న కవులున్నారు. విశ్వ నాథ కూడా ‘తెలుగు ఋతువులు’ పేర ఆంధ్ర దేశ గ్రామీణ ప్రకృతి సౌందర్యాలను రస భరితంగా గానం చేసినవాడే. వాల్మీకి రామాయణము నందలి ప్రకృతి వర్ణనలు సరే సరి. అత్యద్భుత వర్ణనలకు వాల్మీకము వల్మీకమే(పుట్టయే).విశ్వనాథ తన కల్ప వృక్షమున ఋతు వర్ణనలు కథా సంబంధిగా చేసినాడు. ఎక్కడా కథలో అంతర్హితము కాని కాల నిర్దేశికమైన వర్ణనలు కల్ప వృక్షములో కనబడవు. మహా కవుల వాఙ్మయ సృష్టిలో ఇది శిల్పముగా కీర్తించ బడినది.
ఈ పద్యములోని కొన్ని పద ప్రయోగాల ద్వారా అత్యద్భుతమైన వ్యంగ్యము భాసిస్తున్నది. శ్రీ రాముడు సూర్య వంశ సంజాతుఁడు. ఆయనకు సూర్యునితో అభేదము. శ్రీ రాముఁడు రాజ్య లక్ష్మికి కోపము తెప్పించి యున్నాడు. ఎందువలన అనగా రాజ్యలక్ష్మీ ఆయన భుజముపై విశ్రాంతిపొందుదునని భావించి యున్నది. కాని పితృ వాక్య పరిపాలనచే శ్రీరాముఁడు ఆ రాజ్యలక్ష్మిని త్రోసివేసినాఁడు. ఇంక యిప్పుడు భార్యను కోల్పోయినవాఁడై (అపహృత భార్యుఁడై) యశో లక్ష్మికీ కోపం రప్పించినాడు. (దొంగిలింపఁబడిన భార్య కలవానికి అప్రతిష్టయే మిగులును కదా!) ఇంక సీతను మాత్రము తాను సుఖపెట్టినదేమున్నది? ఆమె ఈ సమయమున వేడి కన్నీళ్ళు విడుస్తూ దుఃఖ హృదయయై ఉంటుంది. (ఆనంద భాష్పాలు చల్లన; దుఃఖ భాష్పాలు వెచ్చన అని ఆర్యోక్తి.) కనీసం రాక్షస గ్రస్త ఐన సీత పైనను సూర్యునికి జాలి లేదు. ( సూర్య వంశ వధువు ఐనది సీత) సంధ్యా కాలమై పోతున్నదే! అని ఆర్తి పొందుతున్నాడు శ్రీరాముఁడు.
శబ్ద శక్తులు మూడు. అభిద - లక్షణ - వ్యంజన. అభిద లక్షణలు తమ అర్థమును తోపింపఁ జేసి విరమించగా వ్యంజన అన్యార్థమును తోపింపఁ జేస్తుంది. ఉదాహరణకు చంద్రుఁ డుదయించాడు. సూర్యుఁ డస్తమించాడు అనే వాక్యాలు ప్రకృతంలో సంధ్యావందనాది కార్యక్రమాలను జ్ఞాపకం చేయుచుండగా అన్యార్థములో యుద్ధం ముగించవలసిన సమయం యిది, అనే అర్థాన్ని స్ఫురింపఁ జేస్తుంది. ఈ శక్తి చేత సిద్ధించెడు అర్థము వ్యంగ్యము. దీనిని బోధించే శబ్దమే వ్యంజకము. ఈ వ్యంగ్యార్థమునే ధ్వని అంటారు.
చదువుకొనే పిల్లవాడితో నాయనా! తెల్లారింది. అని చెప్పగానే ఆ విద్యార్థికి కాల బోధక జ్ఞానంతో బాటు పాఠాలు చదవాలి; బడికి వెళ్ళాలి; అనే విషయాలు స్ఫురించడం లాంటి దన్న మాట సులభంగా ధ్వని అంటే. కావ్య వర్ణనల యందు ఈ శబ్ద శక్తి మూలకమైన ధ్వని గుర్తించడం కొంచెం కష్టమే. పాఠకుఁడు నిత్యం కావ్య పఠన యోగ్యత కోసం తపించాలి. క్రమ క్రమంగా నిరంతర కావ్య పఠనం వల్ల అర్హతలు సంపాదించుకొనడం వల్లా సహృదయుని మనస్సులో ధ్వని స్ఫురిస్తుంది. దీనికి వేరే మార్గాలు లేవు. ‘మేడీజీ’ పద్ధతులూ లేవు.
ఒకచోట విశ్వనాథవారు ఏమన్నారంటే " విషయాన్ని కవిత్వం ఒక విలక్షణంగా చెపుతున్నది. కవిత్వంలో ఎప్పుడూ ఒక ముడి ఉంటుంది. ఆ ముడి విప్పదీస్తే కాని ఆనందం కలుగదు. లోకంలో ఏదైనా ఇంతే. మనసు చొప్పించి విచారణ చేసిన చోట అధిక సుఖం. మనసుతో ఆలోచించకపోతే సుఖమూ దుఃఖమూ రెండూ లేవు అన్నారు.
ఈ పద్యానికి వ్యాఖ్యానం చేసే సమయంలో ఒక మిత్రుఁడు నాతో అయ్యా! మీరు తల్లి కడుపులో ఉన్న శిశువు యొక్క హస్త రేఖల్ని పరీక్షిస్తున్నారు. అన్నాఁడు అభిమానంతో. నాకూ నిజమే అనిపించింది.
సీత కనబడ లేదు. సూర్యాస్తమయం అవుతున్నది. శ్రీరాముఁడు కాల గమనాన్ని సహించ లేకపోతున్నాఁడు అన్నది పద్యంలో ముడి. అది విప్పఁ బడిన తరువాత మనకు కనిపించినది భావుకతా రత్న ప్రభ అన్న మాట.
జై శ్రీరాం.
బులుసు వేంకటేశ్వర్లు.
సెల్ నెం. 09949175899.
చూచారుకదండీ! ఎంత శ్రమించి మన కవి వతంస బులుసు వేంకటేశ్వర్లు శ్రీ విశ్వనాథ భావుకతను వెలువరిస్తున్నారో!
మిగిలిన భాగాలు కూడా సావధనంగా తెలుసుకొందాం అంతవరకూ ఆంధ్రామృతాన్ని గ్రోలుతూ ఆనంద రస సాగరంలో మునిగి తేలుతూ ఆ పరమాత్మ దయకు పాత్రులమౌదామా!
జైహింద్.
Print this post
కలువలరాజు బావ సితి,,,,ప్రహేళిక.
-
జైశ్రీరామ్.
తన యింటికి వచ్చుచున్న వానిని చూచి ఒక ఇంటి యజమాని తన భార్యతో పలికిన పద్యము.
చం. కలువలరాజు బావ సితి గన్నకుమారుని యన్న మన్మనిన్
దొలచినవాని కా...
1 రోజు క్రితం
2 comments:
నమస్కారములు.
ఈ రోజు శ్రీ విశ్వనాధ వారి ఆణిముత్యం ఎంత అందమైన పద్యం ? మనసుని కదిలించె వర్ణన.నిజమె ఎవరినీ రంజింప చేయలేని సూర్యుడు ముగ్గురు సతులవలన తాను విరహతాపాన్ని అనుభవిస్తూ వారికి వేదనను మిగిలుస్తున్నాడు.ఇది ఒకరోజా ? వత్షరమా ? ఈ ప్రకృతి ఉన్నంత వరకు ఇంతె ." ప్రొద్దు వాలిపోతున్నా సీత కనబడలేదన్న రాముని వ్యధ అనే ఈ పద్యం లో ముడివిప్పి ముత్యాలసరాలను అందించిన కవివతంస శ్రీ బులుసువెంకటేశ్వర్లు గారు,మన ముందుంచిన శ్రీ చితా వారు అదృష్ట వంతులు+ అభినందనీయులు.
అమ్మా!
మీ ఆనందాన్ని ఇంత అద్భుతంగా వ్యక్తం చేస్తూ మాకపరిమితానందాన్ని పంచిన అవ్యాజానురాగ మూర్తివమ్మా! శ్రీ బులుసు వేంకటేశ్వర్లు తరపున; ఆంధ్రమృతం తరపున; మీ అభిమానానికి కృతజ్ఞతలు తెలియఁ జేసుకొంటున్నానమ్మా!
ధన్యవాదములు.
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.