గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, ఏప్రిల్ 2010, శుక్రవారం

మనం కూడా సమస్యా పూరణము చేద్దామా ?

http://www.indiavilas.com/wldofind/images/Saraswati/saraswati1.jpg
ప్రియ సాహితీ బంధువులారా!
వ్యయే కృతే వర్ధతయేవ నిత్యం
విద్యాధనం సర్వ ధన ప్రథానమ్. అని ఆర్యోక్తి.  మనం నిత్యమూ సాహితీ చర్చాపరులమైనప్పుడే అది తేజో విరాజితమౌతుంది మనలో. కానినాడు మరపు పెరిగి క్రమంగా మరుగై పోతుంది.
దాని అవసరం మనకేంటని మీరనరులెండి. ఎందుచేతనంటే సాహిత్యమంటేనే సహితయోః భావః అని మీకు తెలియనిది కాదు కదా! అందుకని.
కావున నిత్యం సామాజిక హితాన్నే కోరేటువంటి సాహితీ చర్చాపరులమగుట మనకూ సమాజానికీ కూడా ఇది మేలే కదా!
మనలో ఎవరు కవిత్వం చెప్పే ప్రయత్నం చేసినా అది తప్పక పదిమందీ మెచ్చే భావ పూర్ణమైనదే కాని అన్యము కాకుండుటయే నా మాటలకు ప్రమాణము.
ఇక మనం మనలో నిబిడీ కృతమై యున్న సాహితీ పిపాసను పెంచడం కొఱకు; కవితా ప్రవాహాన్ని వెలువరించి మంచి పద్య రచన ధారాశుద్ధి పొందడం కొఱకు ఉపయోగ పడే సమస్యా పూరణ చేద్దామా?
ఇదివరలో ఇచ్చిన సమస్యాపూరణ విషయంలో చాలా తక్కువమందే స్పందించారు.
చాలా ఎక్కువ మంది రచయితలున్నా ఉత్సాహం కొరవడిందని నేననలేను కాని; కారణం మాత్రం ఏదైనా స్పందన తక్కువగా ఉందని మాత్రమే చెప్ప గలను.
ఆ సమస్య ఏమిటంటే
"రమణి యాతడు గావున రక్ష సేయు"
(సమస్యా పూరణ చేద్దామా శీర్షికతో 13 - 4 - 2010.వ తేదీన ఆంధ్రామృతం చూడండి)
మీరీ సమస్యపై ఇదివరకు స్పందించి ఉన్నా లేకున్నా తప్పక మళ్ళీ చక్కని పూరణ చేయడంతో పాటు  ఈ రోజు ఇస్తున్న సమస్యను కూడా పూరించి పంపుదురని ఆశిస్తున్నాను.
సందేహాలుంటే నిరభ్యంతరంగా అడగండి. సందేహ నివృత్తి చేసుకొని పూరణకుపక్రమించండి. అభినందనలు.
ఈరోజు పూరణకై ఇస్తున్న సమస్య తిలకించండి.
"క్షామము బ్రోచుచుండుటనె గౌరవ మొందుట; సత్యమిద్ధరన్."
చూచారు కదా! మరెందుకాలస్యం? మెదడుకు పదును పెట్టండి. సమస్యా పూరణ చేయండి. పంపండి.
అభినందన మందార మాల మీకోసం సిద్ధమౌతుంది మిమ్మల్నలంకరించడానికి. అందుకొనే ప్రయత్నం చేయండి..
జైహింద్.
Print this post

13 comments:

హరి చెప్పారు...

'సీమ'ను క్షామ మెక్కువని చెప్పుచు కొందరు; కాదు కాదు మా
సీమన క్షామ మెక్కువని చెప్పెద రింకొక ప్రాంత నాయకుల్;
క్షామము తాండవించుటకు కారణ మౌచును, సిగ్గు లేకయున్
క్షామము బ్రోచుచుండుటనె గౌరవ మొందుట; సత్యమిద్ధరన్.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా!
అభినందనలు

మేలగు భావ పూర్ణముగ;మేల్తరమైనదటంచు మెచ్చగా;
మాలగ నుత్పలమ్ములను మన్నికతో విరచించినట్టి దో
ర్నాలహరీ!నమస్కృతులు!రమ్యకవిత్వపటుత్వ పద్ధతుల్
చాలగపొందివ్రాయుమయ!చక్కగ పూరణచేసి పంపుమా!

మీ రచనలు పంపుతూ ఉండండి. ఆంధ్రామృతం గ్రోలుతూ మీ అభిప్రాయాలు; సూచనలు తెలియఁ జేయండి

హరి చెప్పారు...

మీ సలహాలు, సూచనలు పాటించగల వాడినే కాని, మీకు సూచనలు చేయగల వాడిని కాను. మీ సూచనను శక్తి మేరకు పాటిస్తాను.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ప్రియ పాఠకుల కభివందనములు.
ఇక నేను చేసిన సమస్యా పూరణ చూడండి.

ప్రేమకు మారు పేరుగ; ధురీణుడవై జగతిన్ వెలుంగుచున్
మామదివ్రేచుబాధలను మాయముచేయుచుబ్రోచునట్టు యు
ద్ధాముఁడవీవు శంకరుఁడ! దక్షుఁడ! నీ కృపఁ జూపి లోకర
క్షా!మముబ్రోచుచుండుటనె గౌరవమొందుట; సత్యమిద్ధరన్.

రవి చెప్పారు...

మామకు మామ, పార్థునకు బంధువు భీషణ సంగరమ్మునన్
ప్రేమగ గీతయున్నుడివిఁ బ్రీతినిఁ గూర్చుచు వైరినాశమున్
భ్రామికఁ దీర్చె కేశవుడు మాకును నాతడె రక్ష! భక్త ర
క్షా! మము బ్రోచుచుండుటనె గౌరవమొందుట; సత్యమిద్ధరన్.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఏమని చెప్ప నేర్తు నిను నేమని నే పొగడంగ నేర్తు; నీ
ప్రేమ; పవిత్ర భక్తి;మురిపించెడిసత్ కవితాభియుక్తి; నా
ధీమతులెల్ల మెచ్చునటు ధీ మతితోడ వచించు శక్తి. నా
వామను డట్లు సత్ కవిగ వర్ధనమౌ రవి మిత్ర పుంగవా!

రవి చెప్పారు...

’సీమ’గ ఆంధ్రదేశమున చెన్నగు పేరును పొంది ఘోరమౌ
క్రామము కాలవాలమయి, రమ్యతఁ గొండల రాయునిల్లు, ఈ
భూమి, శశంబు కేసరితో పోరిన నేలయిదంచు దొల్లి, గొ
ప్ప ముని, విద్యారణ్యుడు అపారము యోచన జేసి ఏర్పడెన్
ఈమణి సీమ రత్నముల ఇల్లు, ధరిత్రిని కాంతులీనుచున్
క్షామముబ్రోచుచుండుటనె గౌరవమొందుట; సత్యమిద్ధరన్.

చదువరి చెప్పారు...

తామధికారమందుటకు దారులు కన్గొను యూహతో ప్రజా
క్షేమము కాలదన్ని ’మన కింతటి బాధల కారణమ్ము ఆ
సీమల యన్నలే’ యనుచు చెప్పుడు మాటల రెచ్చగొట్టిరే
క్షామము బ్రోచుచుండుటనె గౌరవ మొందుట; సత్యమిద్ధరన్.

హరి చెప్పారు...

ఆర్యా,

మీ పూరణ చూసిన తర్వాత నా లోపం తెలుసుకున్నాను. నా పద్యాన్ని క్రింది విధంగా మార్చాను, ఒకసారి చూడండి.

'సీమ'ను క్షామ మెక్కువని చెప్పుచు కొందరు; కాదు కాదు మా
సీమన క్షామ మెక్కువని చెప్పెద రింకొక ప్రాంత నాయకుల్;
క్షామము తాండవించుటకు కారణ మౌదురు, ఓటు కింత శి
క్షా? మము బ్రోచుచుండుటనె గౌరవ మొందుట; సత్యమిద్ధరన్.

హరి చెప్పారు...

చదువరి గారికి నా సమాధానం, రామకృష్ణారావు గారికి స్పేసు వాడుకున్తున్నందుకు క్షమాపణలతో,

ప్రేమగ కూడినాము మన పెద్దలు, అన్నలు వీరటంచు మీ
క్షేమము కోరినాము ఎలుగెత్తుచు ఏబది నాల్గు వత్సరాల్;
ప్రేమలు లేక పోయినవి, ప్రేగుల మంటలె; భ్రాత్రు కింత శి
క్షా? మము బ్రోచుచుండుటనె గౌరవ మొందుట; సత్యమిద్ధరన్.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

చదువరి వీవు. నీకుఁ గల చక్కని జ్ఞానము లౌకికంబుగా
మధుర పదాన్వితంబుగ సమాదరమొందగ; సద్జ్ఞులెల్ల నీ
మదిఁ గల వేదనాదికము మౌనముగా పఠియించి మెచ్చగా
సదసదులన్ స్ఫురించి కడు చక్కగ వ్రాసితి.మిత్రవర్యుఁడా!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

హరి డోర్నాల! కవిత్వ తత్వ విషయాహ్లాదా! సుధాత్మా! వివేకాంభుధీ!
కరుణన్ జూపుచు పూరణంబు లెలమిన్ పూరించి నాకంపిరే!
సరసత్వంబున సమ్యగర్థయుతమై సత్ పాఠకుల్ మెచ్చగా
మురిపెంబొప్పగ నుండె.మీకుశుభముల్ ముప్పొద్దులన్ గల్గుతన్.

రాఘవ చెప్పారు...

నీ మహిమన్ విరించి హరి నీలగళాదులు శక్తియుక్తులై
యీ మహి వేల్పులైరి కద యీప్సపు విద్యవు కర్మవైన త
ల్లీ మము నీవు ప్రేముడిని శ్రీకటదృక్కుల బ్రోవకుండుటన్
క్షామము బ్రోచుచుండుటనె గౌరవమొందుట సత్యమిద్ధరన్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.