గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, నవంబర్ 2009, సోమవారం

చెప్పుకోండి చూద్దాం 21.

సద్గుణ సంపన్నులారా!
మన పూర్వీకులు తమ మేధా సంపత్తితో అనేకానేక ప్రక్రియలలో మన ఆలోచనా పటిమను పెంవగలిగే విధంగా ప్రశ్నల రూపంలోను, కథల రూపంలోను, పెక్కువిధాలైన సాహితీ ప్రక్రియల ద్వారా అనేక అంశాలు మన ముందుంచారు.

మనం వాటిని మన కళ్ళ ముందే పెట్టుకొని, కనీసం వాటి విషయమై ఆలోచించడానుకైనా సమయం చిక్కక పేటికాంతర్గతరత్నాలలాగా వాటిని వదిలేస్తున్న మాట వాస్తవం కాదంటారా?
మన ముందు తరాల వారికి మనం స్వంతంగా ఇవ్వ గలిగే సాహితీ సంపద మనం గడింప లేకున్నా పూర్వీకులొసగిన దైనా వారికందే విధంగా చేయక పోవడం సోచనీయమౌతుందని భావించి, చదివేవారున్నా లేకున్నా స్పందించే హృదయాలున్నా లేకున్నా నేను మాత్రం ఈ ఆంధ్రామృతం లో నాకు లభించినవన్నీ నిక్షిప్తం చేస్తున్నాను. మీకు సమాధానాలు తెలియకపోయినా సమాధానాలనా లాలోచించగలిగేందుకు భావితరాలవారి కొఱకు భద్రపరచ వలసిన అవసరం ఉందనుకొంటున్నాను. ఆతరువాత మీ యిష్టం.
ఈ టపాద్వారా మీ ముందుకొస్తున్న సీసాన్ని చదవండి.

సీ:-
ఆద్యంత మధ్యమాంతాది వర్ణంబుల - తేటి రక్కసిరాజు తెలియ తల్లి.
ఆద్యంత మధ్యమాంతాది వర్ణంబుల - శివునిల్లు వరిచేను క్షీర ధార.
ఆద్యంత మధ్యమాంతాది వర్ణంబుల - భార్యయు ఖడ్గంబు పాదపంబు.
ఆద్యంత మధ్యమాంతాది వర్ణంబుల - మార్వన్నె యీటె ధూమంబు తనరు.
తే:-
అన్నిటికిఁ జూడ మూడేసి యక్షరములు
మొదలు తుదలును, నడి తుది, మొదలు నడుము,
ప్రాణ రక్షను, లతలను, పాదపముల
పరికరము లంద నిలుపుడు పదములన్ని.

చూచారు కదా? ఇక సమాధానం మీరు పంప గలరని ఆశిస్తూ ఎదురు చూస్తున్నాను.

జైహింద్.
Print this post

4 comments:

జ్యోతి చెప్పారు...

మొదటి పదం.. అంబలి
1+3 అక్షరాలు కలిపితే తుమ్మెద (అలి),2+3 అక్షరాకతో రాక్షసరాజు (బలి) 1+2 అక్షరాలు కలిపితే తల్లి (అంబ)

రెండవ పదం... గుమ్మడి.
ఇందులో శివుని ఇల్లు(గుడి),వరిచేను(మడి) క్షీరధార(గుమ్మ) ఉన్నాయి.

మూడవ పదం..ఆవాలు
ఇందులో భార్య(ఆలు), ఖడ్గం(వాలు), చెట్టు(ఆవ)ఉన్నాయిగా.

నేను చెప్పింది రైటేనా???

mmkodihalli చెప్పారు...

తేటి - అలి
రక్కసిరాజు - బలి
తల్లి - అంబ

అంబలి

శివునిల్లు - గుడి
వరిచేను - మడి
క్షీర ధార - గుమ్మ

గుమ్మడి

భార్యయు - ఆలు
ఖడ్గంబు - వాలు
పాదపంబు - ఆవ

ఆవాలు

మార్వన్నె - పొడ
యీటె - గడ
ధూమంబు - పొగ

పొగడ

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

కోడిహళ్ళి మురళి కూర్చిన పదములు
నియమ బద్ధమగుచు నిలిచె నిచట.
జ్ఞానశక్తిచేత సాధ్యమౌనన్నియు
ననుచు తెలియఁ జేసె నతడు మనకు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

జ్యోతి సోదరి చెప్పిన రీతి బాగు.
మూడు ప్రశ్నల ఫలమందె ముచ్చటగను.
అరసి నాల్గవ ప్రశ్నకు నరయ దెలుప
యత్నమొనరించి తెలిపెద రద్భుతముగ.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.