గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, నవంబర్ 2009, సోమవారం

చెప్పుకోండి చూద్దాం 17.

సాహితీ పిపాసా తప్తు లారా!
ఈ క్రింది సీస పద్యాన్ని చూడండి. దానిలో మనకీయబడిన ప్రశ్నకు సమాధనమం గురించి ఆలోచించి చెప్పండి.

సీ:-
నక్షత్ర వీధికి నాధుండు యెవ్వడు ? { శశి }
రంగగు గుడిలోన లింగమేది ? {శిల }
వాహనంబులమీది వన్నెకు మొదలేది ? {లక్క }
దేవతా ఋషులకు తిండి యేది ? {కంద }
నరకాసురుని గన్న నాతి నామంబేది ? { ధర }
పొలతి చక్కదనాల పోల్ప నేది ? {రంభ }
తల్లికి కడగొట్టు తనయుని ఏరేది ? { భ్రమ }
కమలాప్త బింబంబు కప్పునేది ? {మబ్బు }

గీ:-
అన్నిటికిఁ జూడ రెండేసి యక్షరములు.
ఆదులుడుపంగ తుదలెల్ల నాదులగును.
కడగి యాంధ్రామృతముగ్రోలు ఘనులు మీరు
చెప్పనేర్తురు. చెప్పుడీ! శీఘ్రముగను.

చూచారుకదా! మరి ఆలస్యమెందుకు? సమాధానం చెప్పి ఆనందపరచండిసహపాఠకుల్ని.

జైహింద్.
Print this post

2 comments:

జ్యోతి చెప్పారు...

నక్షత్ర వీధికి నాధుండు యెవ్వడు ? - శశి

రంగగు గుడిలోన లింగమేది ? - శిల
వాహనంబులమీది వన్నెకు మొదలేది ? - లక్క
దేవతా ఋషులకు తిండి యేది ? - కంద
నరకాసురుని గన్న నాతి నామంబేది ? - ధర
పొలతి చక్కదనాల పోల్ప నేది ? - రంభ
తల్లికి కడగొట్టు తనయుని ఏరేది ? - భ్రమ
కమలాప్త బింబంబు కప్పునేది ? మబ్బు

ఇందులోని చమత్కారంమేమనగా..మొదటి సమాధానం చివరి అక్షరం రెండో సమాధానం మొదటి అక్షరమవుతుంది. కదా..

ఇదే పద్ధతిలో నేనో ప్రహేళిక ఇవ్వనా..

అసమాన కోదండు డైన రాజెవ్వడు?
రాజు పేరిట గల్గు రత్నమేది?
రత్నంబు పేరిట రంజిల్లు ఋతువేది?
ఋతువు పేరిట గల్గు రుద్రుడెవరు?
రుద్రుని పేరిట రూఢిల్లు జగమేది?
జగము పేరిట గల జంతువేది?
జంతువు పేరిట జన్మించు పక్షేది?
పక్షి పేరిట గల వృక్షమేది?

అన్నిటికి జూడ మూడేసి యక్షరములు
అదులుదుపంగ తుదలెల్ల నాదులగును
సమ్మతిగ జెప్ప భావజ్ఞ చక్రవర్తి
చెప్పలేకున్న నగదు నే చిన్ని నవ్వు!! :)

అమరేందర్ గౌడ్ చెప్పారు...

అసమాన కోదండు డైన రాజేవ్వడు?
రాజు పేరిట గల్గు రత్నమేది?
రత్నంబు పేరిట రంజిల్లు ఋతువేది?
ఋతువు పేరిట గల్గు రుద్రుడెవరు?
రుద్రుని పేరిట రూఢిల్లు జగమేది?
జగము పేరిట గల జంతువేది?
జంతువు పేరిట జన్మించు పక్షి ఏది?
పక్షి పేరిట గల వృక్షమేది?
అన్నిటికీ జూడ మూడేసి అక్షరములు
దీనికి నాకు సమాదానం కావాలి దయచేసి తెలుపగలరు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.