గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, నవంబర్ 2009, గురువారం

చెప్పుకోండి చూద్దాం 15.

ప్రియ పాఠకులారా!
వ్యయే కృతే వర్థతయేవ నిత్యం విద్యా ధనం సర్వ ధన ప్రథానం అన్నారు కదా! అందు నిమిత్తం మన ఆలోచనలకు నిత్యం పదును పెట్టుతూ ఉండాలంటే నిరంతర వ్యాసంగమవసరం. నిజమే కదా! అందుకే మనల్ని ఆలోచింపఁ జేసే ఒక చక్కని అజ్ఞాత కవి కృత చాటువు మన ముందుకొచ్చింది. దానినందరం చదివి మన మేధస్సుతో మర్థించి, సమాధానం రాబట్టి, భావి తరాలకు ఉపలభ్యంగా బ్లాగులో ఉంచుదాం.
ఇక ఆ పద్యం చూడండి.

సీ:-
మనుజుని యాకార మహిమకు మొదలెద్ది ? { తల }
నగ వైరి వైరిదౌ నగర మెద్ది ? { లంక }
రఘుపతి కాచిన రాక్షసాండజ మెద్ది ? { కాకి }
శిబి కర్ణులార్జించు చెలువమెద్ది ? { కీర్తి }
పంచబాణుని వింటఁ బరగెడు రుచి యెద్ది ? { తీపు }
గిరిపతి భుజియించు గిన్నె యెద్ది ? { పుర్రె }
నయనాంగ రక్షకు ననువైన బలమెద్ది ? { రెప్ప }
చెలగి మానముఁ గాచు చెట్టదెద్ది ? { పత్తి }

గీ:-
అన్నిటికిఁ జూడ రెండేసి యక్షరములు.
ఆదులుడుపంగ తుదలెల్ల నాదు లగును.
చెప్పుకొనుడిది మీరలు శీఘ్ర గతిని,
కరుణ నాంధ్రామృతముఁ గ్రోలు జ్ఞానులార !

చూచారు కదా ! ఇక ఆలోచించి చెప్పండి.

జైహింద్.
Print this post

1 comments:

జ్యోతి చెప్పారు...

తల
లంక
కాకి
కీర్తి
తీపు
పుర్రె
రెప్ప
పత్తి

హి..హి..హి.. మీరు దాచిపెట్టిన సమాధానాలు నేను కనుగోనలేనా??

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.