గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, నవంబర్ 2009, సోమవారం

చెప్పుకోండి చూద్దాం 21.

4 comments

సద్గుణ సంపన్నులారా!
మన పూర్వీకులు తమ మేధా సంపత్తితో అనేకానేక ప్రక్రియలలో మన ఆలోచనా పటిమను పెంవగలిగే విధంగా ప్రశ్నల రూపంలోను, కథల రూపంలోను, పెక్కువిధాలైన సాహితీ ప్రక్రియల ద్వారా అనేక అంశాలు మన ముందుంచారు.

మనం వాటిని మన కళ్ళ ముందే పెట్టుకొని, కనీసం వాటి విషయమై ఆలోచించడానుకైనా సమయం చిక్కక పేటికాంతర్గతరత్నాలలాగా వాటిని వదిలేస్తున్న మాట వాస్తవం కాదంటారా?
మన ముందు తరాల వారికి మనం స్వంతంగా ఇవ్వ గలిగే సాహితీ సంపద మనం గడింప లేకున్నా పూర్వీకులొసగిన దైనా వారికందే విధంగా చేయక పోవడం సోచనీయమౌతుందని భావించి, చదివేవారున్నా లేకున్నా స్పందించే హృదయాలున్నా లేకున్నా నేను మాత్రం ఈ ఆంధ్రామృతం లో నాకు లభించినవన్నీ నిక్షిప్తం చేస్తున్నాను. మీకు సమాధానాలు తెలియకపోయినా సమాధానాలనా లాలోచించగలిగేందుకు భావితరాలవారి కొఱకు భద్రపరచ వలసిన అవసరం ఉందనుకొంటున్నాను. ఆతరువాత మీ యిష్టం.
ఈ టపాద్వారా మీ ముందుకొస్తున్న సీసాన్ని చదవండి.

సీ:-
ఆద్యంత మధ్యమాంతాది వర్ణంబుల - తేటి రక్కసిరాజు తెలియ తల్లి.
ఆద్యంత మధ్యమాంతాది వర్ణంబుల - శివునిల్లు వరిచేను క్షీర ధార.
ఆద్యంత మధ్యమాంతాది వర్ణంబుల - భార్యయు ఖడ్గంబు పాదపంబు.
ఆద్యంత మధ్యమాంతాది వర్ణంబుల - మార్వన్నె యీటె ధూమంబు తనరు.
తే:-
అన్నిటికిఁ జూడ మూడేసి యక్షరములు
మొదలు తుదలును, నడి తుది, మొదలు నడుము,
ప్రాణ రక్షను, లతలను, పాదపముల
పరికరము లంద నిలుపుడు పదములన్ని.

చూచారు కదా? ఇక సమాధానం మీరు పంప గలరని ఆశిస్తూ ఎదురు చూస్తున్నాను.

జైహింద్.

28, నవంబర్ 2009, శనివారం

చెప్పుకోండి చూద్దాం 20.

2 comments

సాహితీ ప్రియులారా!
చెప్పుకోండి చూద్దాం 15 కు స్వాగతం. ఈ క్రింది సీసంలోగల ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నంలో కృత కృత్యులవగలరని నా నమ్మకం.
ఇక ఆ సీస పద్యాన్ని చూడండి.

సీ:-
ఏనుగు సింహంబు నెలనాగయును కూడ - ఒక మాట లోపల నుండ వలయు.
పక్షియు వస్త్రంబు పాషాణమునుగూడి - యొక మాట లోపల నుండ వలయు.
ఫణి రాజు ఫణి వైరి ఫణి భూషణుని గూడి - యొక మాట లోపల నుండ వలయు.
రారాజు రతి రాజు రాజ రాజును గూడి - యొక మాట లోపల నుండ వలయు.
గీ:-
దీని యర్థంబు చెప్పుడీ దీప్యముగను - నేర్పు మీరగ మీరలు నెనరు మీర.
చెప్పువారలు పండిత శ్రేష్ఠులు గద. - చెప్పదలచిన వారలు చెప్పుడయ్య.

సమాధానం పంపగలరు కదూ?

జైహింద్.

18, నవంబర్ 2009, బుధవారం

చెప్పుకోండి చూద్దాం 19.

6 comments

సాహితీ ప్రియులారా!
ఈ క్రింది పద్యములో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకోండి చూద్దాం.

సీ:-
ఏమి చేయక వృధా ఏటినీరేగును ? { కట్ట కట్టక.}
భూపాలుడేటికి పుట్టువొందు ? { నేల నేలనే.}
తుంగ ముస్తెల ప్రీతి తొలకాడు వేనికి ? { కిటి కోటికి.}
సభవారి నవ్వించు జాణ యెవడు ? { వికట కవి.}
కలహంస నివసించు కాసార మెయ్యెది ? { సుర సరసు.}
వీరుడెద్దానిచే విజయమందు ? { చేతి హేతిచే.}
లజ్జ యెవ్వరికమూల్యపుటలంకారంబు ? { కుల స్త్రీలకు.}
దేవాంగులకు దేన జీవనంబు ? { నేత చేతనే.}
గీ:-
అన్నిటికిఁ జూడ నైదేసి యక్షరములు.
ఒనర నిరుదెసచదివిన నొక్కరీతి.
చెప్ప గలిగినవారెల్ల గొప్పవారు.
చెప్ప దలచెడి వారును గొప్పవారె.

సమాధానం వెంటనే పంపగలరు. సమాధానం తెలుకో లేకపోతే , తెలుసుకోవాలనే టేంక్షన్ ఆపుకో లేకపోతే ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది. వెతికి తెలుసుకొని, పంపండి .

జైహింద్.

17, నవంబర్ 2009, మంగళవారం

చెప్పుకోండి చూద్దాం 18.

2 comments

పాఠకావతంసులారా!
పొడుపు కథలకున్న ప్రత్యేకత మన తెలుగుకే సొంతం. ఇది చాలా యదార్థం.
అంతటి అసాధారణమైన ఈ పొడుపు కథలకు సంబంధించిన సాహిత్యాన్ని తెలుసుకోవడంలో మనం ముందంజే ఉంటున్నామనడానికి నేనొసగే అన్ని పొడుపు కథలకు పాఠకులనుండి వస్తున్న స్పందనే నిదర్శనం.
ఇప్పుడు మరొక చిన్న పద్యాన్ని మీ ముందుంచుతున్నాను.

క:-
చెట్టుకు నాల్గక్షరములు
తొట్ట తొలుత యక్షరంబు త్రోసిన త్రాడౌ.
చెట్టెయ్యది? త్రాడెట్లగు?
పట్టుగ తెలుపుడయమీరు ప్రస్ఫుటమవ్వన్.

చూచారు కదా! ఇక ఆలసింపక సమాధానం తెలియ పరచడానికి సిద్ధంగా ఉన్నట్టున్నారుగా! ఐతే వెంటనే వేగుద్వరా పంపండి.

జైహింద్.

16, నవంబర్ 2009, సోమవారం

చెప్పుకోండి చూద్దాం 17.

2 comments

సాహితీ పిపాసా తప్తు లారా!
ఈ క్రింది సీస పద్యాన్ని చూడండి. దానిలో మనకీయబడిన ప్రశ్నకు సమాధనమం గురించి ఆలోచించి చెప్పండి.

సీ:-
నక్షత్ర వీధికి నాధుండు యెవ్వడు ? { శశి }
రంగగు గుడిలోన లింగమేది ? {శిల }
వాహనంబులమీది వన్నెకు మొదలేది ? {లక్క }
దేవతా ఋషులకు తిండి యేది ? {కంద }
నరకాసురుని గన్న నాతి నామంబేది ? { ధర }
పొలతి చక్కదనాల పోల్ప నేది ? {రంభ }
తల్లికి కడగొట్టు తనయుని ఏరేది ? { భ్రమ }
కమలాప్త బింబంబు కప్పునేది ? {మబ్బు }

గీ:-
అన్నిటికిఁ జూడ రెండేసి యక్షరములు.
ఆదులుడుపంగ తుదలెల్ల నాదులగును.
కడగి యాంధ్రామృతముగ్రోలు ఘనులు మీరు
చెప్పనేర్తురు. చెప్పుడీ! శీఘ్రముగను.

చూచారుకదా! మరి ఆలస్యమెందుకు? సమాధానం చెప్పి ఆనందపరచండిసహపాఠకుల్ని.

జైహింద్.

14, నవంబర్ 2009, శనివారం

దీర్ఘాయుష్మతీ భవ.

1 comments

శ్రీ కల్యాణ గుణ ప్రపూర్ణ అయిన మన భరత మాత కన్న ముద్దు బిడ్డ, ఆంధ్రుల గర్వ హేతువు అయిన గాన కోకిల శ్రీమతి పి.సుశీలమ్మ డబ్బది ఐదవ జన్మదిన మహోత్సవము పేరుతో అనేక మంది గాయనీ గాయకులు మనను తమ గాన మాధుర్యంతో సంతోషపెట్టారు. గాంధర్వ కళా ప్రపూర్ణులందరూ వందనీయులు.
ఈ సందర్భంగా కళారాధకులందరికీ నా అభినందనలు.

కొందరు పెద్దలు ఆ యమను దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించినట్టుగా గమనించాను.
ఈ సందర్భంగా నాదో సందేహం.
పెద్దలు మనలను దీవించేటప్పుడు స్ర్తీలకూ, పురుషులకూ ఒకే విధంగా పద ప్రయోగం (భాషా) దోషం కానేరదా?

పురుషులకు దీర్ఘాయుష్మాన్ భవ అని అనడం పుంలింగాన్ని సూచిస్తుంది.
మరి స్త్రీల విషయంలో అంత శ్రద్ధ చూపకపోవడం ఆలోచించ వలసిన విషయం.

స్త్రీలకు దీర్ఘాయుష్మతీ భవ అని దీవించడం సముచితమేమో అనిపిస్తోంది.
నా అభిప్రాయం తప్పైతే సరిచేయండి.
లేదా సముచితమైన ప్రయోగం సూచించండి.

సుశీలమ్మ నిండు నూరేళ్ళూ తన గాన మాధుర్యంతో గాన ప్రియు లందరినీ పరవశింపఁ చేస్తూ ఆయురారోగ్య మహదైశ్వర్యాలతో భారతావని గర్వ కారణంగా వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను.

జైహింద్.

13, నవంబర్ 2009, శుక్రవారం

చెప్పుకోండి చూద్దాం 16.

2 comments

ప్రియ సాహితీ ప్రియులారా!
ఈ క్రింది గీత పద్యంలోని ప్రశ్నకు సమాధానం కనుక్కోండి చూద్దాం.
వెంటనే పోష్ట్ చెయ్యండి.

తే:-
ఒక్క పురము పేరొప్పు నైదక్కరములు.
మొదటి మూడును వత్సరమునకు పేరు.
చివరి రెండును వీధికి చెల్లు వేణి
యగు ద్వితీయాంతముల చెప్పుడాపురంబు.

జైహింద్.

12, నవంబర్ 2009, గురువారం

చెప్పుకోండి చూద్దాం 15.

1 comments

ప్రియ పాఠకులారా!
వ్యయే కృతే వర్థతయేవ నిత్యం విద్యా ధనం సర్వ ధన ప్రథానం అన్నారు కదా! అందు నిమిత్తం మన ఆలోచనలకు నిత్యం పదును పెట్టుతూ ఉండాలంటే నిరంతర వ్యాసంగమవసరం. నిజమే కదా! అందుకే మనల్ని ఆలోచింపఁ జేసే ఒక చక్కని అజ్ఞాత కవి కృత చాటువు మన ముందుకొచ్చింది. దానినందరం చదివి మన మేధస్సుతో మర్థించి, సమాధానం రాబట్టి, భావి తరాలకు ఉపలభ్యంగా బ్లాగులో ఉంచుదాం.
ఇక ఆ పద్యం చూడండి.

సీ:-
మనుజుని యాకార మహిమకు మొదలెద్ది ? { తల }
నగ వైరి వైరిదౌ నగర మెద్ది ? { లంక }
రఘుపతి కాచిన రాక్షసాండజ మెద్ది ? { కాకి }
శిబి కర్ణులార్జించు చెలువమెద్ది ? { కీర్తి }
పంచబాణుని వింటఁ బరగెడు రుచి యెద్ది ? { తీపు }
గిరిపతి భుజియించు గిన్నె యెద్ది ? { పుర్రె }
నయనాంగ రక్షకు ననువైన బలమెద్ది ? { రెప్ప }
చెలగి మానముఁ గాచు చెట్టదెద్ది ? { పత్తి }

గీ:-
అన్నిటికిఁ జూడ రెండేసి యక్షరములు.
ఆదులుడుపంగ తుదలెల్ల నాదు లగును.
చెప్పుకొనుడిది మీరలు శీఘ్ర గతిని,
కరుణ నాంధ్రామృతముఁ గ్రోలు జ్ఞానులార !

చూచారు కదా ! ఇక ఆలోచించి చెప్పండి.

జైహింద్.

11, నవంబర్ 2009, బుధవారం

చెప్పుకోండి చూద్దాం 10

2 comments

పాఠకాగ్రణీ! మీరాసక్తితో ఆంధ్రామృతాన్ని గ్రోలుతున్నందుకు చాలా సంతోషం.
మీ కోసం మరొక ప్రశ్న మీముందుంచుతున్నాను.
అంతాచదివి చక్కగ ఆలోచించి సమాధనం చెప్పుకోండి చూద్దాం.

కం:-
కాయ మీద మ్రాను, కడు రమ్యమై యుండు.
మ్రాను మీద లతలు మలయుచుండు.
లతల మీద వ్రేళ్ళు లాస్యమాడుచు నుండు.
దీని భావమేమి తిరుమలేశ.

ఆసక్తితో సమాధానం తెలుసుకో గోరే పాఠకుల కొఱకు మీ సమాధానాలు పంపండి.

జైహింద్.

చెప్పుకోండి చూద్దాం 14.

4 comments

పాఠకావతంసులారా! ఈ క్రింది కందంలో అందగించుచున్న భావాన్ని చెప్పుకోండి చూద్దాం.

క:-
శిల వృక్ష లతలఁ బుట్టిన
చెలువలు మువ్వురును గూడి చిడిముడి పడుచున్
తల వాకిట రమియింతురు.
సలలితముగ దీని నెఱుగు సరసులు గలరే?

మీ సమాధానాన్నందించండి ఆసక్తితో గ్రహించేవారికి.

జైహింద్.

8, నవంబర్ 2009, ఆదివారం

చెప్పుకోండి చూద్దాం 13.

2 comments

సదసద్వివేచనా శీలీ! ఈ క్రింది పద్యాన్ని పఠించి అంతర్లీనమైయున్న సమాధానం చెప్పండి.
క:-
శుద్ధ కుల జాత యొక సతి
యిద్ధరణిన్ దండ్రిఁ జంపి యెసగ విశుద్ధిన్
బుద్ధి బితామహుఁ బొందుచు
సిద్ధముగా దండ్రిఁ గనును. చెప్పుడు దీనిన్.

ఆలోచించాలే గాని మీరు చెప్పలేకపోవడమేమిటి? ఆలోచించి సరైన సమాధానం చెప్పండి.
నమస్తే.

జైహింద్.

శ్రీ హనుమన్ మాహాత్మ్యము.

3 comments


శ్రీ బల్లేపల్లి గ్రామాన గల శ్రీ పీఠాధిపతులు, సుప్రసిద్ధ శ్రీ వి.బి. దుర్గేశ్వర రావు గారు వసుధైక కుటుంబకులు. వారు లోక కల్యాణార్థము అనేక విధములుగా సర్వ దైవతారాధనలు చేస్తూ, చేయిస్తూ ఉండడం అందరికీ తెలిసిన విషయమే.

అవ్యాజ అనురాగమూర్తులైన శ్రీ దుర్గేశ్వరరావుగారు భగవత్సేవా కార్యక్రమాల పరంపరలో ఒకపరి శ్రీహనుమత్సేవాతత్పరులుగా భక్తులను మేల్కొల్పి, నలుబదొక్క దినములు హనుమచ్చాలీసా పారాయణా కార్యక్రమాన్ని ప్రతిపాదించి, భక్తుల సకలమనోభీష్టసిద్ధి కొఱకు వారిచే భక్తితో పఠింపించారు.

అలా పారాయణ చేసే భాగ్యం నాకుమారుడైన చిరంజీవి వేంకట సన్యాసి రామ శర్మకు కూడా లభించింది.
భక్తి శ్రద్ధలతో శ్రీ హనుమాన్ చాలీసా నలుబదొక్క దినములు పారాయణ చేశాడు.
శ్రీ దుర్గేశ్వర రావుగారు చెప్పిన విధంగా మా అబ్బాయికి యోగ్యురాలైన కన్యకామణి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శైలజా లక్ష్మితో వివాహం ఖాయమవడమే కాదు మొన్నటి అక్టోబరు మాసంలో ఇరవై ఎనిమిదవ తేదీన ఉదయం వివాహం జరిగింది.

వశ్యవాక్కయిన శ్రీ దుర్గేశ్వర రావుగారి మాటలు అక్షర సత్యాలయ్యాయని కృతజ్ఞతా పూర్వకంగా తెలియఁజేసుకొంటున్నాను.

భక్తసులభుడైన రామదూత శ్రీ ఆంజనేయస్వామివారి అసాధారణ ప్రేమామృతాన్ని గూర్చి నిరంతము దానిని గ్రోలే భక్త కోటికి వివరింపనవసరం లేదు.

చ:-
నలుబదియొక్కరోజులు అనావిల భక్తి ప్రపత్తు లొప్పగా
మెలగుచు, అంజనీ సుతుని మేల్తర చాలిసనే పఠించినన్
తొలగును దుష్ట సంహతులు తోడుగ యా హనుమంతుడుండుటన్.
సులభుడు భక్త కోటికి. విశుద్ధిఁగఁ జేయుడటంచు తెల్పగా,

శా:-
శ్రీ దుర్గేశ్వరు నాన సమ్మతిని తా చే గొంచు, నా పుత్రుడున్
వేదంబట్టుల యక్షరాక్షరము సంప్రీతిన్ పఠించెన్. సుధా
మాధుర్యంబును గ్రోల గల్గె. విలసన్‍మాంగళ్య సద్యోఫలం
బా ధుర్యుండగు అంజనీసుతుడు తానందించి, కాచెన్ గృపన్.

ఉ:-
ఎంతటి ప్రేమఁ జూపె! మనసెంతటి మెత్తన! ఎంత కొల్చినన్
కొంతయె యౌను. తాను ప్రతికూలత బాపెను. కొల్పె సత్ఫలం
బంతటి అంజనీ తనయు నారయఁ జేసిన రావుగారు తా
నెంతటి ధన్య జీవి! మనకెంతటి పూజ్యులొ చెప్ప నేటికిన్?

శా:-
దీక్షాకాలము పూర్తి కాక మునుపే దేదీప్యమానుండు తా
రక్షా బాధ్యత స్వీకరించి, శుభమున్ రప్పించి, మా శర్మనే
దీక్షా కంకణ బద్ధుఁ జేసె నటుపై దేదీప్యమానంబుగా
నక్షయ్యంబగు దివనాళిఁ నిడె, తా నందించె నీ శైలజన్.

ఉ:-
యోగ్యతఁ గొల్పి, చేసెడు నయోగ్యుని యోగ్యుగ నాంజనేయు డా
భాగ్యము పొందనెంచితిరొ- - - పన్నుగ చాలిసనే పఠించుడీ.
మృగ్యములౌను దౌష్ట్యములు. మీ గ్రహచారము మేల్తరంబులౌన్.
భాగ్యప్రదంబునౌన్. విమల భావ ప్రపూరిత పాఠకోత్తమా.

జైహింద్.


7, నవంబర్ 2009, శనివారం

సకల కామితార్థ ప్రదాయిని శ్రీ లలితా చాలీసా.

4 comments


శ్రీ లలితా చాలీసా.
రచన:- శ్రీమతి తల్లావజ్ఝలరామలక్ష్మి.

శ్రీమతి రామలక్ష్మి గారి వయసు సుమారు తొంభై వసంతాలు. హైదరాబాదు నివాసిని.
శ్రీ లలితా ఉపాసకురాలు.
ఈమె శ్రీ లలితా చాలీసా స్వయంగా రచించారు. ఈ లలితా చాలీసా పఠించిన వారికి ఈడేరని మంచి కోరికలంటే ఉండవని వీరు ప్రగాడ విశ్వాసంతో నొక్కి వక్కాణించడమే కాదు. అలా నలభై ఒకటి రో జులు పారాయణ చేసి భక్తితో ఆలలితామాతను ఆరాధించి తమ ధర్మ బద్ధమైన కామితము ఈడేరకపోయినట్లైతే లలితా చాలీశా కాగితం చింపి పారేయమంటున్నారు. ఆమెకు గల ప్రగాఢ విశ్వాసమే సహృదయుల పాలిట కల్పవృక్షమై ఈ లలితా చాలీసా వర్థిల్ల చేస్తోంది అనడంలో సందేహం లేదు. నమ్మినవారికి అందుబాటులోఉండే విధంగా ఈ చాలీసా మీ ముందుంచుతున్నాను.

అన్నట్టు చెప్పడం మరిచాను. ఈ చాలీసాను గానం చేయాలనుకుంటే " రఘుపతి రాఘవ రాజారాం - పతిత పావనా సీతారాం. ఈశ్వర అల్లా తేరేనాం సబ్కో సమ్మతి దే భగవాన్ " అనే గీతంలాగా పాడుకోవచ్చునని శ్రీమతి రామ లక్ష్మిగారు వివరించారు. ఆ విధంగా పాడడానికి మీరు ప్రయత్నించగలరు.

1. లలితా మాతా, శంభుప్రియా, జగతికి మూలము నీవమ్మా!
శ్రీభువనేశ్వరి అవతారం. జగమంతటికీ ఆధారం.

2. హేరంబునికీ మాతవుగా హరిహరాదులు సేవింప
చండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం.

3. పద్మరేకుల కాంతులతో బాలా త్రిపుర సుందరిగా
హంస వాహన రూపిణిగా వేదమాతవై వచ్చితివి.

4. స్వేత వస్త్రము ధరియించి, అక్షర మాలను పట్టుకొని
భక్తి మార్గము చూపితివి. జ్ఞాన జ్యోతిని నింపితివి.

5. నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండ
ఆదిభిక్షువై వచ్చాడు సాక్షాత్తాపరమేశ్వరుడు.

6. కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కళత్రమ్ముగా
కామితార్థప్రదాయినిగా కంచికామాక్షివైనావు.

7. శ్రీచక్ర రాజ నిలయనిగా శ్రీమత్రిపుర సుందరిగా
సిరిసంపదలను యివ్వమ్మా! శ్రీమహాలక్ష్మిగ రావమ్మా!

8. మణిద్వీపమున కొలువుండి, మహాకాళి అవతారముతో
మహిషాసురునీ చంపితివీ. ముల్లోకాలను ఏలితివీ.

9. పసిడివెన్నెల కాంతులతో పట్టువస్త్రపు ధారణలో
పారిజాతపు మాలలలో పార్వతీ దేవిగ వచ్చితివి.

10. రక్తవస్త్రమును ధరియించి రణరంగమును ప్రవేశించి
రక్తబీజుని హతమార్చి రమ్యకపర్థినివైనావు.

11. కార్తికేయునికి మాతవుగా, కాత్యాయినిగా, కరుణించి
కలియుగమున మము కాపాడ, కనకదుర్గవై వెలసితివి.

12. రామలింగేశ్వరు రాణివిగా, రవికుల సోముని రమణివిగా
రమా వాణీ సేవితగా రాజరాజేశ్వరివైనావు.

13. ఖడ్గం శూలం ధరియించి, పాశుపతాస్త్రము చేబూని,
శుంభ నిశుంభుల దునుమాడి, వచ్చితివీ శ్రీ శ్యామలగా.

14. మహామంత్రాధిదేవతగా లలితా త్రిపుర సుందరిగా
దరిద్ర బాధలు తొలగించి పరమానందము కలిగించి.

15. ఆర్తత్రాణ పరాయణివే అద్వైతామృత వర్షిణివే.
ఆదిశంకర ప్రపూజితవే. అపర్ణాదేవి! రావమ్మా.

16. విష్ణుపాదమున జనియించి, గంగావతారం ఎత్తితివి
భగీరథుడు నిను కొలువంగా భూలోకానికి వచ్చితివి.

17. అశుతోషునినే మెప్పించి అర్థ శరీరం దాల్చితివి.
ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిస్తివి జగదంబ.

18. దక్షుని యింటను జనియించి సతిగా తనువును చాలించి
అష్ఠాదశపీఠేశ్వరిగా దర్శనమిస్తివి జగదంబ!

19. శంఖ చక్రములు ధరియించి, రాక్షస సంహారము చేసి,
లోక రక్షణ చేశావు. భక్తుల మదిలో నిలిచావు.

20. పరభట్టారిక దేవతగా, పరమ శాంతస్వరూపిణిగా,
చిఱునవ్వులనూ చిందిస్తూ, చెరకుగడను ధరియించితివి.

21. పంచదశాక్షరి మంత్రాధితగా, పరమేశ్వర పరమేశ్వరితో,
ప్రమథ గణములు కొలువుండ, కైలాసంబే పులకించె.

22. సురలు, అసురులు అందరును శిరములు వంచి మ్రొక్కంగా
మాణిక్యాల కాంతులతో నీ పాదమ్ములు మెరసినవి.

23. మూలాధార చక్రములో యోగినులకు అధీశ్వరియై,
అంకుశాయుధ ధారిణిగా భాసిల్లితి శ్రీజగదంబ !

24. సర్వ దేవతల శక్తులచే సత్య స్వరూపిణి! రూపొంది
శంఖ నాదమును చేసితివి. సింహ వాహినిగ వచ్చితివి.

25. మహా మేరువు నిలయనివి మందార కుసుమ మాలలతో
మునులందరు నిను కొలువంగా, మోక్ష మార్గము చూపితివీ.

26. చిదంబరేశ్వరి నీలీల చిద్విలాసమే నీ సృష్టి
చిద్రూపి వర దేవతగా చిఱునవ్వులను చిందించే.

27. అంబా శాంభవీ! అవతారం అమృత పానం నీ నామం.
అద్భుతమైనది నీ మహిమ అతి సుందమూ నీరూపు.

28. అమ్మల గన్నా అమ్మవుగా ! ముగ్గురమ్మలకు మూలముగా !
జ్ఞాన ప్రసూనా ! రావమ్మా! జ్ఞానమందరికి ఇవ్వమ్మా!

29. నిష్టగ నిన్నే కొలిచెదము. నీ పూజలనే చేసెదము.
కష్టములన్నీ కడదేర్చి, కనికరమున మము కాపాడు.

30. రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప,
అభయ హస్తమును చూపితివి. అవతారమ్ములు దాల్చితివి.

31. అరుణారుణపు కాంతులతో, అగ్ని వర్ణపు జ్వాలలలో,
అసురులందరిని దునుమాడి, అపరిజాతవై వచ్చితివీ.

32. గిరిరాజునకుపుత్రికగా నంద నందుని సోదరిగా
భూలోకానికి వచ్చితివి. భక్తుల కోర్కెలు తీర్చితివి.

33. పరమేశ్వరునికి ప్రియ సతిగా, జగమంతటికీ మాతవుగా,
అందరి సేవలు అందుకొని, అంతట నీవే నిండితివి.

34. కరుణించమ్మా లలితమ్మా! కాపాడమ్మా దుర్గమ్మా!
దర్శనమీయగ రావమ్మా! భక్తుల కష్టం తీర్చమ్మా!

35. ఏవిధముగ నిను కొలిచిననూ, ఏ పేరున నిను పిలిచిననూ,
మాతృహృదయవై దయజూపు. కరుణా మూర్తిగ కాపాడు.

36. మల్లెలు మొల్లలు తెచ్చితిమి. మనసును నీకే యిచ్చితిమి.
భక్తులమంతా చేరితిమీ. నీ పారాయణ చేసితిమి.

37. త్రిమాతృ రూపా లలితమ్మా! సృష్టి స్థితి లయ కారిణివి.
నీ నామములు ఎన్నెన్నో! లెక్కించుట మా తరమౌనా?

38. సదాచార సంపన్నవుగా సామ గన ప్రియ లోలినివి.
సదాశివుని కుటుంబినివి. సౌభాగ్యమిచ్చే దేవతవు.

39. ఆశ్రితులంతా రారండి. అమ్మ రూపమును చూడండి.
అమ్మకు నీరాజనమిచ్చి, అమ్మ దీవనలు పొందండి.

40. మంగళ గౌరి రూపమును మనసుల నిండా నింపండి.
మహాదేవికీ మనమంతా మంగళ హారతులిద్దాము.

భక్తి విశ్వాసములతో పఠించువారు ఆ లలితాంబ కృపాకటాక్షములు పొందుదురుగాక.

జైహింద్.