గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, అక్టోబర్ 2008, ఆదివారం

పద్య రచనకుపయోగించు ప్రాసలు

"ఛందో బద్ధ పద్య రచనకు ఉపకరించు ప్రాసలు
ఇంత వరకు మనం పద్యములలో ప్రయోగింప దగిన యతులను గూర్చి తెలుసుకొన్నాం కదా! ఇప్పుడు ప్రాసలను గూర్చి తెలుసుకొనే ప్రయత్నం చేద్దామా మరి?

అసలు ప్రాస అంటే ఏమిటి ?
పద్య పాదమునందలి ప్రథమాక్షరాన్ని యతి అంటారని ముందుగా తెలుసుకొన్నాం కదా! రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు. పద్యంలో మొదటి పాదంలో యే అక్షరం రెండవాక్షరంగా ప్రాస స్ఠానంలో ఉంచారో ఆ పద్యంలోని మిగిలిన అన్ని పాదాలలోనూ అదే అక్షరం ప్రయోగించాలి.
ప్రాసాక్షరంలో అచ్ సామ్యమక్కరలేదు.
ప్రాస పూర్వాక్షరం గురువైతే గురువు, లఘువైతే లఘువు అన్ని పాదాల లోను ఉండాలి.
ఇక ప్రాసలను గూర్చి తెలుసుకొందాం.

1) అర్థ బిందు సమప్రాస:-
ప్రాసాక్షరానికి ముందు అర సున్న అన్ని పాదాలలో నుంచుట. " వీఁక - తాఁకి "

2) పూర్ణ బిందు సమప్రాస :-
మొదటి పాదంలో ప్రాసాక్షరం పూర్ణ బిందు పూర్వక మైనట్లైతే ఆ పద్యంలోని మిగిలిన అన్ని పాదాలలోను ప్రాసాక్షరం బిందు పూర్వకమే అవాలి. " పొందు - బృంద "

3)ఖండాఖండ ప్రాస:-
అర సున్న కలిగి యున్న ప్రాసాక్షరంతో అరసున్న లేని ప్రాసాక్షరాన్ని ఆ పద్యంలో ప్రాసగా ప్రయోగించ వచ్చును."బో( టి - పాట "

4) సమ్యుక్తాక్షర ప్రాస:-
ఏ సమ్యుక్త హల్లు ప్రాస స్థానంలో ఉంటుందో అదే సమ్యుక్త హల్లు ఆ పద్యంలోని మిగిలిన అన్ని పాదాలలోను ప్రయోగించాలి. " అక్ష - కుక్షి "

5) సమ్యుతాసమ్యుత ప్రాస :-
రేఫ యుత సమ్యుక్తాక్షరముతో రేఫ రహితమైన అదే అక్షరమునకు ప్రాస చెల్లును. " శ్రీకర - ఈ క్రియ "

6) లఘు ద్విత్వ ప్రాస :-
సమ్యుక్త పూర్వాక్షరము లఘువయితే మిగిలిన అన్ని పాదాలలోనూ అటులనే రావాలి. "విద్రుచు - అద్రువ"

7)వికల్ప ప్రాస :-
అనునాసిక వికల్ప సంధ్యక్షరములకు ప్రాస. " దిఙ్మహిత - యుగ్మ "

8) ఉభయ ప్రాస :-
" న - ణ " లకు,
" స - ష " లకు, ప్రాస. " ప్రాణ - దాన " "వసుధ - విషమ "

9) అను నాసిక ప్రాస:-
భ/ క్తిమ్ముర < భ/ క్తిన్ + ముర = భ/ క్తిం ముర > తో - తమ్ములు. కు ప్రాస.

10) ప్రాస మైత్రి ప్రాస :-
" మ్మ - ం బ " లకు ప్రాస చెల్లును.

11) ప్రాస వైరము :-
" ర - ఱ ' లకు ప్రాస పనికి రాదు.

12) స్వ వర్గజ ప్రాస :-
" థ - ధ " లకు,ప్రాస చెల్లును.
" ద - ధ " లకు ప్రాస చెల్లును.

13) ఋ ప్రాస :-
" ఋ - ర " లకు ప్రాస చెల్లును. ఉ:- " ఆఋషి - చీరలు "

14) లఘు యకార ప్రాస :-
" ఆయజు < ఆ + అజు > - శాయికి "

15) అ భేద ప్రాస :-
" ల -ళ " లకు ప్రాసచెల్లును.
" ల - డ " లకు ప్రాస.చెల్లును.

16) సంధి గత ప్రాస :-
వ/ చ్చెంగుంతి < వ/ చ్చెన్ + కుంతి > - సింగము.
మొదలగునవి.

తెలుసుకొన్నాం కదా ! ఇంకెందుకు ఆలస్యం? పద్యాలు వ్రాసే ప్రయత్నం చెద్దామా మరి ?

జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఎంత బాగున్నాయొ ఇవన్ని బట్టీ పడితె తప్ప పద్యం రాయలేమేమొ అనిపిస్తుంది .ఒక్కొక్కటి చదువుతుంటే ఇంతటి అయోమయావస్థ నుంచి తేరుకోవడానికి చాలా టైము కావాలి అనిపిస్తోంది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.