గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, అక్టోబర్ 2008, బుధవారం

ప్రత్యహం ప్రత్యవేక్షేత, మేలిమి బంగారం మన సంస్కృతి 1

ప్రాచీన సంస్కృతి మేలిమి బంగారం:-

శ్రీమన్మహా దేవుడైన పరమాత్మ సృష్టిలో గడచిన కాలం అనంతమైనది. ఈ అనంత కాలంలో అనంత విశ్వంలో సత్ శాస్వితం. అసత్ అశాశ్వితం.


ఈ సత్ స్వరూపాన్ని మన పురాణాలు ఇతిహాసాలు, వేదాలు, ఇంకా అనంతమైన గ్రంథ రాజము మన ప్రాచీన సంస్కృతి పేర తెలియ జేస్తున్నాయి. మానవ మనుగడకు ఆసూక్తులే సన్మార్గ దర్శకాలు. వాటిని మనం మననం చేసుకోవడమే కాకుండా ముందు తరాల వారికి కూడా అందించాలి. వాటిని పొడి పొడి మాటలతో చెప్పినచో అవి గాలిలో కలిసిపోతాయి. మంచి మాటలెందరో చెప్పారు. ఐనా వేమన పద్య రూపంలో నున్న నీతులు అందరి నోళ్ళలోను నానుతున్న మాట మనకు తెలియనిది కాదు. అందుకే మనం శ్లోకాల రూపంలోనూ, పద్యాల రూపంలోను కంఠస్థం చేసి అనర్గళంగా సమయానుకూలంగా ఎక్కడపడితే అక్కడ చెప్పేలాగ సాధన చేయాలి. ఇట్టి సాధన చేసేవారికుపకరిస్తుందనే ఆశతో కొన్నైనా మీముందుంచే ప్రయత్నం చేస్తున్నాను.ఈ ప్రయత్నం సహృదయుల మన్ననను తప్పక పొంద గలుగుతుందనుకొంటున్నాను. ఇక విషయానికి వెళ్దాము.

శ్లో:-
ప్రత్యహం ప్రత్యవేక్షేత, నరశ్చరిత మాత్మనః.
కిం ను మే పశుభిస్తుల్యం? కిం ను సత్ పురుషైరివ?----{మహాభారతం.--అరణ్య పర్వం---29 వ శ్లోకం.}
తే:-
పశువు వోలె ప్రవర్తించు పాపినా! సు
జనుని వలె నడచు కొను సుజనుడినా!
ని యను దినము ప్రశ్నించుకొని.మన నగును.
మానవాళికి తగునిది. మహితులార.
భావము:-
మానవుడు తాను సత్ పురుషుని వలే ప్రవర్తిస్తున్నాడా, లేక పసువు వలె ప్రవర్తిస్తున్నాడా అని ప్రతీ దినము ఆత్మ అరిశీలన చేసుకొంటూ ఉండాలి.
తప్పక అలాగే చేద్దాం కదూ?


జైహింద్.


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.