గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, అక్టోబర్ 2008, బుధవారం

ఒక కంద పద్యం లో ఒకటా, రెండా, మూడా కాదు నాలుగు కంద పద్యాలు.

కందంలో కందం, అందులోనే మరో కందం, మరో కందం కూడా. చూడాలనుందా? ఐతే యీ క్రింది పద్యాన్ని గమనించండి.

క:-
శంకర! ఉమాధిపా! వృష
భాంకా! కరుణార్ద్ర హృదయ! అభవా! గిరిశా!
సంకటము బాపి, కృప గన
నింకన్ శరణంబు వేడ నేలవు. భరమా? ఇది 1 వ కంద పద్యము.

క:-
కరుణార్ద్ర హృదయ! అభవా!
గిరిశా! సంకటము బాపి, కృప గన నింకన్
శరణంబు వేడ నేలవు.
భరమా! శంకర! ఉమాధిపా! వృషభాంకా! ఇది 2 వ కంద పద్యము.

క:-
సంకటము బాపి కృపగన
నింకన్ శరణంబు వేడ నేలవు. భరమా?
శంకర ! ఉమాధిపా !వృష
భాంకా! కరుణార్ద్ర హృదయ! అభవా! గిరిశా! ఇది 3 వ కంద పద్యము.

క:-
శరణంబు వేడ నేలవు.
భరమా! శంకర! ఉమాధిపా! వృషభాంకా!
కరుణార్ద్ర !హృదయ ! అభవా!
గిరిశా! సంకటము బాపి, కృప గన నింకన్. ఇది 4 వ కంద పద్యము.

చూచారుకదా! తమాషాగాలేదూ? ప్రయత్నం చేయాలేకాని బోలెడన్ని తమాషాలు చేయవచ్చు. ఐతే మీ వుత్సాహాన్ని తెలుసుకొన్న తరువాతే మరి కొన్ని విషయాల్ని గూర్చి తెలియ జేసే ప్రయత్నం చేయగలను.

జై హింద్.
Print this post

2 comments:

అజ్ఞాత చెప్పారు...

ఎవరు వ్రాసారండి ఈ పద్యాన్ని?

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఈ కందాంతర్గత కంద చతుష్టయం పద్యం కీర్తి శేషులు శ్రీ శ్రీరాం వీర బ్రహ్మయ్య గారు. వ్రాసినట్లుగా నాకు లభించింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.