గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, అక్టోబర్ 2008, శనివారం

యతులకోసం మతులెందుకు పోకొట్టుకోవడం ? నేర్చుకొందాం రండి . ౩ వ భాగం.

"యతుల కోసం మతులెందుకు పోకొట్టుకోవడం. నేర్చుకొందాం రండి " శీర్షికతో యిది వరకు 2 భాగాలలో కొన్ని యతులను గూర్చి తెలుసుకొన్నాం.
ఇప్పుడు ఉభయ యతులు :-

1) యుష్మ దస్మచ్ఛబ్ద యతులు :-
యుష్మదాగమనము < యుష్మత్ + ఆగమనము > ఇందులో " ద - అ " లు పూర్వ పదాంత, పరపదాది వర్ణాలు. వీటిలో దేనికైనా యతి వేయ జెల్లును.

2) పర రూప యతి :-
వేదండ < వెద + అండ > అఖండ శబ్దము వలె గాన వచ్చుటచే యిట్టి పదములలో ఉభయ యతి. అనగా " ద - అ " అను రెందింటిలో ఏ వొక్క అక్షరంతోనైనా యతివేయ జెల్లును.

3) ప్రాది యతి :-
ప్రాప్తి < ప్ర + ఆప్తి > యిందు " ప్ర - ఆ " అనే 2 వర్ణములలో ఏ వొక్క దానితో నైనను యతి గూర్ప జెల్లును.

4) అ ఖండ యతి ( లేదా ) నిత్య సమాస యతి :-
కర్ణాట < కర్ణ + అట > ఇది పద విభాగము తోపని నిత్య సమాసము గావున యిట్టి పదములలో " ర్ణ - అ "అను 2 వర్ణములలో ఏ వొక్క వర్ణమునకైనను యతి గూర్ప జెల్లును.

5) దేశ్య నిత్య సమాస యతి :-
క్రిక్కిఱియుట < క్రిక్కు + ఇఱియుట > అచ్ సంధి అయి యేక పదముగా కనిపించుచున్న దేశ్య పదములందు " క్కు - ఇ " వంటి 2 వర్ణములలో ఏ వొక్క వర్ణముతో నయనను యతి గూర్ప జెల్లును.

6) నిత్య యతులు :-
క్రూర కర్ముడేనియు < క్రూరకర్ముడు + ఏనియు > యిందు " ఐనాసరే అనే అర్ధంలో ఏనియు అనేపదంతో కూడిన మొదటిపదం నిత్య సమాసంగా కనిపిస్తున్నందున యీ పదంలో " డు - ఏ " అనే 2 వర్ణాలలో ఏవొక్కవర్ణంతోనైనను యతి వేయ జెల్లును.


7) రాగమ సంధి యతి :-
జవరాలు < జవ + ఆలు > ఇందు { ర్ + ఆగమ } (ర్) ర ఆగమంగా వచ్చినందున యిట్టి చోట " ర - అ " అను 2 వర్ణములలో ఏ వొక్క దానికైనను యతి గూర్ప జెల్లును.

8) విభాగ యతి :-
గంపెడేసి < గంపెడు + ఏసి > ఇట్టివి నిత్య సంధులు. ఇట్టిపదములలో " డు - ఏ " అను 2 వర్ణములలో ఏవొక్క వర్ణమునకైనను యతి గూర్ప జెల్లును.

9) నామాఖండ యతి :-
రామయ్య < రామ + అయ్య > ఇట్టి అఖండ నామములలో " మ - అ " అను 2 వర్ణములలో ఏవొక్క వర్ణమునకైనను యతి గూర్ప జెల్లును

10) పంచమీ విభక్తి యతి :-
రామునికన్న < రామునికి + అన్న > < రామునకు + అన్న >
రామునికంటే < రామునికి + అంటే >
ఇట్టి పదాలలో ఏ వొక్క వర్ణమునకైనను యతి వేయ జెల్లును.

11) కాకు స్వర యతి:-
లేరో < లేరు + ఓ > ఇట్టి పదములందు " రు - ఓ " అనునటువంటి 2 వర్ణములలో ఏ వొక్క వర్ణమునకైనను యతి వేయ జెల్లును.


12) ప్లుత యుగ యతి :-
ఏ గతి కాచెదో రఘుపతీ < ఏ గతి కాచెదు + ఓ > మొదటి వర్ణమునందు, యతి స్థానమునందు ప్లుతవర్ణములున్నందున ఈ 2 ప్లుత వర్ణములకు యతి వేయ జెల్లును.

13) ప్రాస యతి :-
సీసము. తేటగీతి. ఆటవెలది.పద్యములందు యతికి బదులు ప్రాస యతి వేయ జెల్లును.
ఉ :- తే.గీ:- తెలుగు భాషయె జగతిని వెలుగు నిజము. < తెలు - వెలు > తె మొదటి అక్షరము. యతి స్థానమున యతి వేయ బడక దాని తరువాత గల ప్రాసాక్షరమునకు యతివేయబడినందున యిది ప్రాసయతికి ఉదాహరణ యగుచున్నది.

యతులను గూర్చి నేర్చుకొన్నాం కదా ! ఇక సాధ్యమైనంత వరకూ మన రచనలలో నియమాన్ని అతిక్రమించకుండా యతులు ప్రయోగించడానికి ప్రయత్నిద్దామా మరి ? ప్రాస విషయం కూడా సమయం చిక్కినప్పుడు తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.

జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నిజంగానె " యతుల గురించి చదువుతుంటే ఖచ్చితంగా మతులు పోవలసిందె " అప్పుడు గాని యతి కుదరదంటే.....కుదరదు. ......కుదరనే....కుదరదు....కుదరదు గాక...కుదరదు అస్సలు.....కుదరదు.....అదన్న ...మాట....చ్చందస్సంటే .[ తమాషాకి ]

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.