ప్రియ సాహితీ బంధువులారా! నిత్య శుభాకాంక్షలు.
మన ఆంధ్ర సాహిత్యంలో అసదృశమైన సాహితీ ప్రక్రియలున్నాయి. ముఖ్యంగా అవధాన ప్రక్రియలో మనం దత్తపదిని చాలా చమత్కారంగా వుండేలాగ పృచ్ఛకులివ్వడం చూస్తుంటాము. వాటిని మనం కూడా పూరించ గలిగితే చాలా బాగుండుననిపిస్తుంది. ఆలోచిస్తే అది పెద్ద కష్టమైన పనెమీ కాదుకూడాను.
ఒక సారి నేను కళాశాలలో విద్యార్థులకు అవధానం గురించి వివరిస్తుండగా అందులో ఒక తెలివైన విద్యార్థి మాస్టారూ! మనం 1. అన్న, 2. అక్క, 3 చెల్లె, 4 బావ. దత్త పదాలుగా యివ్వవచ్చా? అని అడిగాడు. ఇవ్వొచ్చన్నాను. సీతాన్వేషణను గూర్చి వర్ణించమనొచ్చా? అని అడిగాడు. ఔనన్నాను.ఐతే మీరిప్పుడు వర్ణించి వ్రాయగలరా? అని పదిమందిలోవుండగా అడిగాడు. ఈ పరిణామాన్ని నేనూహించలేదు. ఏం చెప్పాలో అర్థం కాకపోయినా వెంటనే ఎందుకు వ్రాయలేను? అని అన్నాను. ఐతే వ్రాయండిసార్! చూస్తామన్నాడు. అందరూ నావైపే ఎలా వ్రాస్తానో అని చూస్తున్నారు. వాళ్ళందరినీ 2 నిమిషాలు మాటల్లో పెట్టి ఆలోచించేసరికి కొంత అవగాహన వచ్చింది. వ్రాయడమ్మొదలు పెట్టాను. 2 నిమెషాల్లో వ్రాయడం పూర్తి చేశాను. దత్త పదులతో నేనువ్రాశిన ఆ వర్ణన చూడండి.
ఉ:-జానకి యేడనున్నదియొ? జాడ కనుంగొను " మన్న " రాముడా
యానతి విన్న మారుతియె " అక్క " డ, యిక్కడ, లేక, లంకలో
జానకి గాంచు " చెల్లె " డల , చాటుగ " బావ " ని గాంచె.నద్దిరా!
జ్ఞాని కసాధ్య మెద్దియొకొ? చక్కని భక్తి ప్రపత్తి గల్గినన్.
చూచారుకదా! నేను చేసిన పూరణని. నేను పడిన టెంక్షనంతా పద్యం వ్రాయడం పూర్తవడంతో వదిలింది. చాలా భయపడ్డాను .ఐతే ఈ సంఘటన నాకు కొండంత ఆత్మ విశ్వాసాన్ని కలిగించింది. ఎప్పుడైనా సమస్య ఎదురైనప్పుడు ఎదుర్కొనే ముందుకష్టంగా అనిపించినా దానిని పూర్తి చేయగానే కొండంత ధైర్యం, ఆత్మ విశ్వాసం మనలోతప్పక కలుగుతుంది. మీరూ ప్రయత్నించండి. పద్య రచనాభిలాషాభివృద్ధిరస్తు .
Print this post
ప్రజాసంకల్పంలో నా పద్యం. లక్ష్మీ సహస్రనామావళిలో 505 వ నామం పద్యము.
-
జైశ్రీరామ్.
జైహింద్.
1 రోజు క్రితం
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.