గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, అక్టోబర్ 2008, శనివారం

ఒక సభలో గరికిపాటిని గూర్చి నా నిర్వచనం

ఆర్యా! నమస్తే !
నేను ఆంధ్రామృతంలో వ్రాసిన దత్తపదిని మీరు చూచారనుకుంటాను. దానిపైన మీ అభిప్రాయం వ్రాయగలరు.
ఆంధ్ర జ్యోతిలో ప్రకటించిన శ్రీమాన్ గరికపాటి నరసిమ్హం గారి దత్తపది తో వర్ణన అత్యద్భుతంగా వుంది.ఐతే దానిలో ఆశ్చర్య పోవలసిందేమీలేదు. ఎందుకలా అన్నానని ఆశ్చర్యపోతున్నారా? ఆశ్చర్యపోకండి. ఎందుకంటారా. అతడేమైనా సామాన్యుడా? వ్రాయలేకపోవడానికి? వారి శక్తి యుక్తులు తెలియనివారు ఆశ్చర్యపోవచ్చు. ఆంధ్ర భాషా సేవలో నిమగ్నమై వారు ఆంధ్రుల జీవనాడిగా మారారు.అతని సేవకు ఆంధ్ర మాత పులకరించిపోతోంది. వారితో పాటు నేనూ 30-11-2007 వ తేదీన సర్వసిద్ధి రాయవరం గ్రామంలో గురజాడ వర్ధంతి సందర్భంగా ఆ గ్రామస్తులు ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించినపుడు వారిని గూర్చి నే నొక సీస పద్యం ఆశువుగా చెప్పాను.మీరూ దానిని అవధరించండి.

సీ:-
శ్రీ కరం బైనట్టి చిన్మూర్తి యీనాటి, - కవి కులంబున మేటి గరికిపాటి.
సుజ్ఞాన సంపన్న సుందరంబుల సాటి - కనరాని ఘన మేటి గరికిపాటి.
అవధాన ప్రక్రియ నరయ లేరిల పోటి. - కమల సంభవు సాటి గరికిపాటి.
ఆంధ్ర మాతకు సేవ లందించు. యీనాటి - కల్యాణ గుణ వాటి గరికిపాటి.
తే:-
నవ్య రుచిరార్థ కవితల నరుడనంగ.
సిం హ గాంభీర్య వాగ్ ధాటి సిమ్హమనగ
నార సిమ్హుగ వెలుగొందె గారవముగ.
గరికి పాటిని గనుటీ నగరికి పాటి.


చూచారు కదా! గరికిపాటివారిని గూర్చిన నా నిర్వచనాన్ని. ఆ సభలో వారి తేజస్సే నాలోనుండి ఆశువుగా ప్రవహించింది.
వారివలె ఆంధ్రులైన వారు పెక్కురీ యాంధ్ర మాతకు సేవలందించాలని వారి ఆశయం. మీరూ ప్రయత్నిచండి. శుభమస్తు.

జైహింద్.
Print this post

2 comments:

అజ్ఞాత చెప్పారు...

గరికిపాటి నారసింహునిపై మీ పద్యాలు చక్కగా, పాడుకొనేట్టుగా ఉన్నాయి.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

క:-చదువరి మెచ్చిన చాలును
సదసద్ గుణ గణన లోన సత్తని యననౌన్.
సదయులుచదువరి. నను తన
మదినిడి శుభములను తెలుపు, మాన్యత గొలుపున్.
చదువరీ ! ధన్య వాదములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.