గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, మే 2018, సోమవారం

శ్రీమన్నారాయణ శతకము. 18/20వ భాగము. 86 నుండి 90 రచన చింతా రామకృష్ణారావు

1 comments

జైశ్రీరామ్
శ్రీమన్నారాయణ శతకము.
రచన. చింతా రామకృష్ణారావు.
86. శా. మన్నింపంబడుదీవు శోభన లసన్మాన్యంబుగాఁ జేసి సం
పన్నంబౌనటు చేయఁ గల్గిన మమున్. మా జీవితంబున్, స్వభా
వౌన్నత్యంబున వెల్గఁజేయుచు నిరంతానంద సంధాయి ! శ్రీ
మన్నారాయణ! సత్ప్రవృద్ధ మహితా ! మామాటలాలింపుమా. 
భావము. అంతులేని ఆనందమును కలిగించువాడా ! మంచిని పెంచెడివాడా ! ఓ శ్రీమన్నారాయణా!  మా మాటలను ఆలకించుము. మమ్ము శోభన ప్రకాశముతో శ్రేష్టముగా చేసి , మా  జీవితమును సుసంపన్నమగునట్లు చేయగలిగితివేని నీవు ఎల్లప్పుడూ మన్నింపబడుదువు.

87. శా. యన్నామైవ మహత్ప్రపుణ్యఫలదమ్ , హర్ష ప్రదమ్ , సత్ప్రదమ్,
యన్నామైవ దురంత పాప హరణమ్ , యత్ సౌఖ్యదమ్ , భాగ్యదమ్ ,
తన్నామైవ త్వదీయ నామ యనుచున్ దర్శింత్రు భక్తాళి. శ్రీ
మన్నారాయణ! నీదు నామమెదలో మార్మ్రోగనీ నిత్యమున్.  
భావము.  ఓ శ్రీ మన్నారాయణా! ఏ పేరు జగత్తున ఏకైక పుణ్య ఫలమునొసగునో , ఏ పేరు అత్యద్భుతమైనదో , ఏ పేరైతే పాపములు పోకొట్టెడి గొప్పదైన పేరో , ఏ పేరైతేఆయువునొసంగునో , ఆ పేరు నీ పేరే అనుచు భక్తులు ఆత్మలో దర్శింతురు. నీ నామమును నిత్యమూ మా మదిలో మార్మ్రోగునట్లనుగ్రహింపుము.

88. శా. ఎన్నున్ భారత జాతి నీ ప్రతిభ, నీ సృష్టిన్, బ్రవర్ధింప నీ
కన్ననన్ కర్తయు, కర్మయున్, క్రియయు లోకంబందు లేరం చిటుల్
నిన్నున్నమ్మగఁ జేసినట్టి ఘనుడా. నిన్నెట్లు కీర్తింతు? శ్రీ
మన్నారాయణ! భారతీయుల మదిం భాసించుమెల్లప్పుడున్.
భావము.   ఓ శ్రీమన్నారాయణా! ఈ సృష్టిని ప్రవర్ధింపఁ జేయుటలో నీకన్నా  కర్త, కర్మ, క్రియ, వేరొకరు లేరని భారత జాతి నీ ప్రతిభను గుర్తించును. ఈ విధముగానిన్ను నమ్ము విధముగా చేసిన గొప్పవాడా. నిన్నేవిధముగా నేను పొగడగలను? నీవు యెల్లప్పుడూ భారతీయుల మనసులలో ప్రకాశించుచూ ఉండుము.

89. శా. పున్నామాదిగ గల్గు యీ నరకముల్ పూరింప మాచేత నీ
వన్నీ గాంచుచు పాప కార్యములు మోహభ్రాంతిఁ జేయింతువా !
ఆన్నన్నా! మనసెట్టులొప్పు నరకంబందున్ మమున్నిల్ప. శ్రీ
మన్నారాయణ! మంచి చేసెడి మతిన్ మాకిమ్ము నిన్గొల్వగాన్.  
భావము.  ఓ శ్రీ మన్నారాయణా ! పున్నామాది మహా నరకములను నింపుటకని నీవన్నీచూచుచూకూడా మోహాదులు కల్పించి మాచేత పాపములు చేయించుచున్నావా? అన్నన్నా. మమ్ములను నరకమున నిలుపుటకు నీకు మనసెట్టులొచ్చును ? మంచి చేయవలెననెడి బుద్ధి మాకిమ్ము. నిన్నుకొలిచెదము.


90. శా. ఎన్నో జన్మల పుణ్య సత్ఫలముగానిద్ధాత్రి సీతమ్మ నీ
కన్నుల్ కాంతిగ వెల్గ నీ సతిగ, భూకాంతారమావల్లభా!
మిన్నున్ ముట్టదె మాదు సంబరము సామీ చేయ మీ పెండ్లి. శ్రీ
మన్నారాయణ! భక్తులన్ సతము ప్రేమం జూచి దీవింపుడీ. 
భావము.  ఓ శ్రీమన్నారాయణా! ఓభూకాంతారమావల్లభా! ఓ స్వామీ! పెక్కు జన్మలలో చేసిన పుణ్యఫలముగా ఈ ధాత్రిపై సీతమ్మతల్లి నీ పత్నియై నీ కన్నులలో కాంతియై ప్రకాశించు విధముగా మీ వివాహము చేయుటచే మా సంతోషము ఆకాశమునంటును. మీరెల్లప్పుడూ భక్తులను కృపతో చూచుచు దీవించుడు.
జైహింద్

6, మే 2018, ఆదివారం

శ్రీమన్నారాయణ శతకము. 17/20వ భాగము. 81 నుండి 85 రచన చింతా రామకృష్ణారావు

0 comments

జైశ్రీరామ్
శ్రీమన్నారాయణ శతకము.
రచన. చింతా రామకృష్ణారావు.
81. శా. నిన్నున్ బోలుదు రార్యులెల్ల పృథివిన్ నీ నామ సారూప్యమున్,
పిన్నల్ పెద్దలు వారినెన్నుదురుగా విశ్వాసమొప్పారగా.
నిన్నే నీవు సృజించుకొందువొ హరీ ? నేర్పారఁగా బ్రోవ. శ్రీ
మన్నారాయణ! లోకమున్. సుజనులన్ మాపై కృపంజూపుచున్.
భావము.
ఓశ్రీమన్నారాయణా! పుడమిపై ఆర్యులు నామ సారూప్యముచే నిన్ను పోలి యుందురు. ఆబాలగోపాలము వారిని గుర్తించి విశ్వాసముతో ఫ్రశంసింతురు. నీ నేర్పు మీర లోకమును సుజనులను బ్రోచుట కొఱకు మాపై కృప జూపుతూ నిన్ను నువ్వే ఈ విధముగా పుట్టించుకొందువా?

82. శా. తిన్నన్ జాలు నుగాది పచ్చడిని, భాతిం గొల్పు నారోగ్యమున్,
విన్నన్ జాలును భూసురుల్ పలుకు భావిన్దెల్పు పంచాంగమున్.
కన్నా దివ్య యుగాదినాడునిజ సంకల్పంబులీడేరు. శ్రీ
మన్నారాయణ! నిత్య చేతనమిడన్ మాలో నుగాదైతివా?
భావము.
ఓశ్రీమన్నారాయణా! ఓ కన్న తండ్రీ. ప్రతీ సంవత్సరమూ ఉగాది రోజున ఉగాది పచ్చడిని తినిన చాలును. భాతిని, ఆరోగ్యమును కలిగించును. భూదేవతలు పలికెడి భావిని తెలియజేయు పంచాంగమును వినీనసరిపోవును. మా సంకల్పములన్నియు నెరవేరును. మాలో నిత్య చైతన్యము కల్పించుటకు నీవు మాలో ఉగాదివై యుంటుందువా.

83. శా. కొన్నన్మానస పీఠిపై నిలుపగా గోవింద ! నీ పాదముల్
చెన్నారన్ గొన నొప్పు మాకు శుభముల్ శ్రీ దేవి కల్పింపగా.
మిన్నున్ దాకును మా ముదంబు గని నీ మేలైన  పాదాళి. శ్రీ
మన్నారాయణ ! మాదు పుణ్యఫలముం బండించు  నీ సత్కృపన్. 
భావము.
ఓ గోవిందా! నీ పాదములను మా మనసు ఆనెడి సింహాసనముపై నిలుపుటకు గ్లహిఃచినచో ఆ లక్ష్మీదేవి కటక్షముచే మాకు చెన్నుగా శుభములు స్వీకరింపనొప్పును. నీ మేలచన పాదములను చూడగనే మా ఆనందము ఆకిశమునంటును. ఓ శ్రీ మన్నారాయణా!. నీ మంచి కృపతో మా పుణ్యములు పండింము..

84. శా. ఎన్నన్ బుణ్య ఫలంబు స్వర్గసుఖమే యిచ్చున్ శుభోద్దీప్తితో
నన్నన్మాకది చేసినంతె కద? మాకత్యంత సౌఖ్యంబు మే
మున్నన్ నీదరినబ్బు సత్యమిది. లేకున్నన్ వ్యర్థమే చూడ. శ్రీ
మన్నారాయణ! నీ పదాబ్జమమరన్ మాకేలనీ పుణ్యముల్ ?  
భావము.  ఓ శ్రీమన్నారాయణా! మనము గుర్తించినచో మేము చేసుకొనెడి పుణ్యము వలన ప్రాప్తించెడి ఫలము శుభమునుద్దీపింప చేయుచు స్వర్గ సౌఖ్యమే యిచ్చుననిన అది మేము చేసుకొనినది  ఎంత పుణ్యమో అంత మాత్రమే కదా. మేము నీ సమీపముననున్నచో మాకు అత్యంత సౌఖ్యము లభించును. ఇది సత్యము. ఆ విధముగా కానినాడు ఈ పుణ్యాదులు నిరుపయోగమే. నీ పాదపద్మములే మాకు అమరినచో యీపుణ్యములిక మాకెందులకు? వ్యర్థమే సుమా.


85. శా. భిన్నంబన్నది లేదు భావమున భావింన్ నినున్ నమ్ముటన్.
మన్నారాయణుడీవె. నన్ను సతమున్ మన్నించి రక్షింతువే.
నిన్నున్ వీడి మనంగలేను జగతిన్. నిత్యుండ నాకీవె. శ్రీ
మన్నారాయణ! మన్మనోజ్ఞ ధిషణా. మా ధైర్య మీవేనయా.
భావము.   నాలో ప్రకాశించే నిన్ను నమ్ముట విషయములో నా భావనలో భిన్నమన్నదే లేదు. నీవు నా నారాయణుడవు. నన్ను ఎల్లప్పుడు మన్నించి రక్షించుదువు. నిన్ను విడిచి జీవించలేను. ఈ లోకములో నాకు నీవే భాగ్యము. నాకు మనోజ్ఞమయిన జ్ఞానస్వరూపా. నీవే మా ధైర్యము.
జైహింద్

5, మే 2018, శనివారం

శ్రీమన్నారాయణ శతకము. 16/20వ భాగము. 76 నుండి 80 రచన చింతా రామకృష్ణారావు

0 comments

జైశ్రీరామ్
శ్రీమన్నారాయణ శతకము.
రచన. చింతా రామకృష్ణారావు.
76. శా. వెన్నన్ బోలిన మానసుండవనుచున్ వేమారు నిన్గొల్త్రు కా
వన్నిన్ వేడుచు భక్తపాళి. కనవో ? వారిన్ గృపన్ జూడవో ?
నిన్నేనమ్మిన భక్తులన్ నిలుపుమా. నిర్భాగ్యులన్ గాచు శ్రీ
మన్నారాయణ ! నమ్మకంబు కలుగన్.  మా మాట మన్నింపుమా.
భావము.  నిర్భాగ్యులను కాపాడెడి స్వభావమున్న ఓశ్రీమన్నారాయణా! వ్నవనీత సుకుమా హృదయుడవని భక్తులు తమను కాపాడమని , నిన్ను సేవించి అనేక పర్యాయములు నిన్ను వేడుకొందురు. అది నీవు గమనింపవా ? వారిని కృపతో చూడవా నిన్ను మాత్రమే నమ్ముకొనిన భక్తులను నిలుపుము.నీపై మాకు నమ్మకము. కలుగునట్లు చేయుటకు మామాట మన్నింపుము.

77. శా. కన్నా ! కన్నులు కల్గినట్టి ఘనులే గర్వాంధతన్ వర్తిలన్
కన్నుల్లేని కబోదిగా పుడమిపై గాంచున్ గదా జన్మమున్.
ఎన్నంజాలరదేలనో? వలచు దుష్కృత్యంపు దుర్వృత్తి. శ్రీ
మన్నారాయణ! మార్పుకొల్పుమనఘా ! మౌఢ్యంబు పోకార్పుమా.
భావము.  ఓ కన్నయ్యా ! కన్నులు కల్గిన మహనీయులే గర్వాంధ ప్రవృత్తులైనచో భూమిపై కన్నులు లేని కబోదిగా జన్మింతురు కదా. ఈ విషయమును వారు ఎందుచేతనోగుర్తింపరు. చెడు వర్తనతో కూడిన ప్రవృత్తినే ఈష్టపడుదురు.  పాపరహితుడవైన ఓ శ్రీమన్నారాయణా ! అట్టివారీలోని మౌఢ్యమును నశింప జేయుము. వారిలో
మార్పును తీసుకురమ్ము.

            శ్రీ చక్రాల రాజారావు కవివరులు విధముగా తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేసియున్నారు.
                చింతావారిమనోభిరామమగుసచ్చిద్బావమందాకినీ  
                ప్రాంతోద్యానవనాంతసీమ రమణీయాకారపుంస్కోకిలా
                స్వాంతోద్భూతమనోజ్ఞగీతగతపద్యమ్మున్స్వరైకావిధిన్   
                సంతోషాత్మఁబఠించితిన్ముకుళితస్వాంతాన వందించితిన్

78. శా. నిన్నున్ గూర్చిన భక్తి సంయుత కథల్ నేర్పున్ ప్రబోధించు శ్రీ
మన్నారాయణ మానవుండవయి నీ మాహాత్మ్యముల్ నీవె మా
కున్నిత్యమ్ము వివేకమున్ దెలుపు వైకుంఠా! చిదానంద ! శ్రీ
మన్నారాయణ! భక్తపక్ష! శుభముల్ మాకబ్బు నీ సత్కృపన్.  
భావము. వైకుంఠా! చిదానందరూపా !  శ్రీమన్నారాయణా !  నీకు సంబంధించిన భక్తి కథలను నేర్పుతో ప్రబోధించు శ్రీమన్నారాయణ మానవుడవయి, నీ కథలను నీవే నిత్యము మాకు వివేకముతో తెలుపుచుంటివా. భక్తుల పక్షము వహించువాడా !   నీ వలననే మాకు పుణ్యము లభించుచున్నది.

79. శా. కన్నా ! నీవె యనంతకృష్ణుడవు సత్ కామ్యార్థముల్ తీర్చ మీ
కున్నానంచును నన్ను చేరుదువు దీనోద్ధారకా నీవె న
న్నన్నాయంచును. నాదు భాగ్యఫలమై. యాత్మన్ ప్రదీపించు శ్రీ
మన్నారాయణ! తమ్ముడా యనుచు నిన్ మర్యాదతో పిల్వగన్. .
భావము.  ఓ కన్నా ! ఆత్మలో ప్రకాశించు శ్రీమన్నారాయణా ! నీవు అనంతకృష్ణుడవే. ఓ దీనౌద్ధారకా ! నేను నిన్నుతమ్ముడా యని మర్యాదతో పిలుచుకొను విధముగామంచి కామితార్థములను తీర్చుట కొఱకు మీకు నేనున్నానని నాభాగ్య ఫలమై అన్నాయని పిలుచుచు నన్ను  చేరుదువు కదా.

               శ్రీ చక్రాల రాజారావు కవివరులు విధముగా తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేసియున్నారు.
                    హృద్యభావార్థసంబద్ధపద్యమిద్ది   
                భక్తితాత్పర్యసంయుక్తపద్యమిద్ది
                    పద్మనేత్రకృపాపాత్రపద్యమిద్ది   
                భవమునందంగదిక్సూచిపద్యమిద్ది


80. శా. నిన్నే గాంతును సోమయాజులయెడన్, నీవే సదా చూచుచున్,
నన్నున్ దోష విహీన సద్వరుగ  గానం జేయ యత్నింతువే.
నిన్నున్ నమ్మిన దోషమెట్లు కలుగున్ నీవే సదా రక్ష. శ్రీ
మన్నారాయణ! పాపతాప హరణా! మామ్ పాహి సర్వేశ్వరా.
భావము.  ఓ శ్రీమన్నారాయణా! యాజ్ఞికులగు సోమయాజులలో నిన్నే చూతును. నీవే యెల్లప్పుడూ నా రచనలను  చూచుచు నన్ను దోషమేమాత్రము లేని మంచివారిలో శ్రేష్టునిగా చూపు యత్నము చేయుదువు కదా. నిన్నేనమ్ముకొనిననాడు దోషమేవిధముగా కలుగును? ఎల్లప్పుడూ నీవే మాకు రక్ష. పాపతాపమును హరించు సర్వేశ్వరా! నన్ను కాపాడుము.
జైహింద్

4, మే 2018, శుక్రవారం

శ్రీమన్నారాయణ శతకము. 15/20వ భాగము. 71 నుండి 75 రచన చింతా రామకృష్ణారావు

1 comments

జైశ్రీరామ్
శ్రీమన్నారాయణ శతకము.
రచన. చింతా రామకృష్ణారావు.
71. శా. సన్నేతల్ మహనీయతా గరిమతో సత్కార్యముల్ చేయుచున్,
నిన్నేమున్ను స్మరింత్రు సంతసమునన్ నీ దివ్య తేజంబె సం
పన్నంబౌనటు చేయ కార్యముల నుద్భాసింపగాఁ జేసి. శ్రీ
మన్నారాయణ ! సజ్జనాళి కృషినే మన్నించి దీవించుమా.  
భావము.
ఓశ్రీమన్నారాయణా ! మంచి నాయకులు వారికిగల మహనీయత యొక్క ఆధిక్యముతో మంచి పనులు చేయుచు, నీకు గల గొప్ప తేజస్సే తాము చేపట్టిన కార్యము ప్రకాశితమగునట్లు చేసి సుసంపన్నము అగునట్లు చేయుట కొఱకు ముందుగా సంతోషముతో నిన్నే స్మరించుదురు. అట్టి మంచివారి ప్రయత్నమును నీవు మన్నించి వారిని దీవింపుము.

72. శా. సన్నంబై చనుచుండెనాయువు. మన:శాంతిన్ నినుం గొల్వనే.
క్రన్నన్ వచ్చి ప్రశాంతిఁ గూర్చుమయ. నాకన్నన్ హితుల్ లేరనన్.
మన్నైపోవకమున్నె నేను నిను సమ్మాన్యా! మదిం గాంచ శ్రీ
మన్నారాయణ ! నీ పదాంబుజములం బ్రాణంబు చేరున్ గదా.
భావము.  సమ్మాన్యుడవైనవాడా! ఓ శ్రీమన్నారాయణా! చిన్నదయిపోవుచు నా ఆయుర్దాయము తరిగిపోవుచున్నది. నేను శాంత మనస్కుడనై కనీసము మనసులో భావింపనైను లేదు. నా కన్నా హితులు నీకు లేరనునట్లుగా నీవు వెంటనే వచ్చి నాకు ప్రశాంతత కలిగించుము. నేను భూమిలో కలిసిపోవక మునుపే నిన్ను మనసులో చూచినచో నా ప్రాణము నీ పాద పద్మములను చేరును కదా.

73. శా. నిన్నన్, మొన్నను, నేడు, రేపు, సతమున్ నీ నామ సంకీర్తనే
నన్నున్ నిల్పెడి ప్రాణశక్తి, నృహరీ! నాకున్న ధీశక్తియున్.
మన్నింపంబడు పద్యధారవగుచుం బ్రాప్తించుచున్ బ్రోచు శ్రీ
మన్నారాయణ! నిన్ స్మరించు గుణమున్ మాకిమ్ము నిత్యంబుగా.
భావము. ఓనరసింహా! భూత భవిష్యద్వర్తమానములందు ఎల్లప్పుడు నీ నామ సంకీర్తనమే నన్ను నిలుపు ప్రాణశక్తి. నా ధీశక్తియునదియే. మన్నింపఁబడెడి పద్యధారవయి ప్రాప్తించుచు బ్రోచెడి ఓశ్రీమన్నారాయణా! నిన్ను స్మరించెడి
గుణమును నిత్యముగా మాకు ప్రాప్తింపఁజేయుము.

74. శా. ఎన్నం  జాలని భవ్య భాగవతులన్ హృద్యంబుగానొప్పు శ్రీ
మన్నామాద్భుత వాక్సుధా లహరివా ? మచ్చిత్త సంవాసివై
క్రన్నన్ వెల్వడు సత్ కవిత్వ ఝరివా ? కారుణ్యవారాశి! శ్రీ
మన్నారాయణ! దివ్య శక్తినిడి , నీమంబొప్ప నిన్ గొల్వనీ.  .
భావము.  ఎన్నజాలనంతటి గొప్ప భాగవతోత్తములలో హృద్యముగానొప్పునట్టి శ్రీమన్నారాయణునికిసంబంధించిన వాగమృత లహరివా ? నా హృదయమున నివశించుచు క్రన్నన వెల్వడునటువంటి మంచి కవితా ప్రవాహమా నీవు? కరుణా సముద్రుడివా ? ఓ శ్రీ మన్నారాయణా ! మాకు దివ్యమైన శక్తినొసగి నిన్ను భక్తితో సేవించునట్లు చేయుము.

75. శా. ఎన్నోశంకలవాత్మలో కలుగు నీ వీతీరునీ సృష్టి చే
యన్నీకున్ గల మూలమేది ? మహనీయంబైన యామూలమీ
వెన్నాళ్ళే తపమాచరించి గనితో ? సృష్ట్యాదినే నీకు శ్రీ
మన్నారాయణ! సాధ్యమెట్లయినదో ? మా శంక పోకార్పుమా.  

భావము.  ఓ శ్రీమన్నారాయణా ! ఎన్నో అనుమానములు ఐవి నా ఆత్మలో కలుగుచున్నవి. నీవు ఏ విధముగా ఈ సృష్టిని చేయుటకు నీకు కలిగిన మూలాధారమేది ? గొప్పలయిన ఆ మూలాధారమును నీవు ఎన్నాళ్ళు ఎటువంటి తపస్సూను చేసి పొఃదితతివో? సృష్ట్యాదినే నీకు ఇది ఏవిధముగా సాధ్యమయినదో మా అనుమానములను నివృత్తి  చేయుము.
జైహింద్

3, మే 2018, గురువారం

శ్రీమన్నారాయణ శతకము. 14/20వ భాగము. 66 నుండి 70 రచన చింతా రామకృష్ణారావు

1 comments

జైశ్రీరామ్
శ్రీమన్నారాయణ శతకము.
రచన. చింతా రామకృష్ణారావు.
66. శా. పిన్నల్ నిర్మల చిత్తశోభితులెగా. పెద్దౌదురవ్వారలే.
పిన్నన్ లేని దురంత దుష్కృతులిలన్ బెద్దైనచో నబ్బునే !
ఎన్నాళ్ళిట్టులొనర్తువీవిటుల నీకే చెల్లునేదైన. శ్రీ
మన్నారాయణ ! నిర్మలత్వమిడి సన్మార్గంబునన్ నిల్పుమా. 02 . 03 . 2018.
భావము.  ఓ శ్రీమన్నారాయణా! పసివారునిష్కల్మష మైన మనస్సు కలవారే కదా. ఆ పసివారే పెరిగి పెద్దవారగుదురు. భువిపై బాల్యమందు లేని దురంతమైన చెడ్డ పనులు పెద్దవారవగానే వచ్చునా ?   ఈ విధముగా నీవు ఎంత కాలము చేయుదువు? ఏదైనా నీకే చెల్లును కదా! మాకు నిర్మలత్వమును ప్రసాదించి మంచి మార్గములో నిలుపుము.
67. శా. సున్నంబైననునన్నమైన నొకటే శుద్ధాత్మవిజ్ఞానికిన్.
ఖిన్నుండవ్వడు పొంగిపోడు తెగడన్ గీర్తించినన్ భూమిపై.      
విన్నాణంబది నీవు గొల్పినదెగా వెల్గొందునీరీతి. శ్రీ
మన్నారాయణ ! జ్ఞానభాగ్యవరదా! మాకున్ బ్రసాదించుమా.   03 . 03 . 2018.
భావము. ఓశ్రీమన్నారాయణా! విశుద్ధమైన ఆత్మజ్ఞానము కలవానికి సున్నమైనను , అన్నమైనను ఒక్కటేకదా. భూమిపై అతనిని నిందించినను , పొగడినను చిన్నపుచ్చుకొనడు అటులనే పొంగిపోడు.  ఆట్టి విజ్ఞానము నీవు కలిగించినదే కదా. ఈ విధముగా ప్రకాశించును. జ్ఞాన భాగ్యమును వరముగనొసంగువాడా. మాకునూ ప్రసాదింపుము.
68. శా.నిన్నున్ మించిన భక్త రక్షకుని నే నెన్నన్ దగన్ బృథ్విపై.
నన్నున్ మించిన స్వార్థ వర్తనుడు కానన్ రాడదెట్లందువా
నిన్నున్నామదిలోనె శాశ్వితముగా నిల్వంగ వాంఛింతు. శ్రీ
మన్నారాయణ! నాది స్వార్థమె కదా. మన్నించు నా స్వార్థమున్.  06 . 04 . 2018.
భావము.  ఓ శ్రీ మన్నారాయణా! భూమిపై నిన్ను మించిన భక్త రక్షకుని నేను గుర్తింప దగను. నన్ను మించిన స్వార్థపరుడు కనిపించనే కనిపించడు. అది యేవిధముగా అని అందువేమో. నిన్ను శాశ్వితముగా నా హృదయమునందునే యుండవలసినదిగా కోరు కొందును. నాది స్వర్థమే కదాఅట్టి నా స్వార్థమును మన్నించుమా.
69. శా. వెన్నల్ బాలు మనంబులే. కయికొనున్ వెన్నుండటంచున్ ఘనుల్
మన్నున్ మెక్కకు. వెన్నవంటి మదులన్ మన్నించిగైకొమ్మటం
చున్నిన్నార్తిని కోరుచుందురు గదా. శుద్ధాత్మ సంభాస! శ్రీ
మన్నారాయణ! నీవె శాశ్వితము. నన్ మన్నించి చేకొమ్మయా. 05 . 03 . 2018.
భావము.
శుద్ధాత్మతో ప్రకాశించు ఓ శ్రీ మన్నారాయణా ! మహాత్ములు తమ మనస్సులే యని , అవి నీవు స్వీకరింతువని భావించి , నీవు మన్ను తినుట యెందులకు ? మా మనసులే వెన్న పాలు , స్వీకరించుమని నీదరికార్తితో చేరి కోరంచుందురు.నీవే మాకు శాశ్వము. నన్ను నీవు మన్ననముతో చేనుకొము.

70. శా. కన్నుల్ కాంచెడి శక్తి కోల్పడును. నిన్ గానంగ జ్ఞానాక్షి నా
కున్నన్జాలును. నీవొసంగుమది నాకున్ దివ్య చక్షుప్రదా!
ఎన్నాళ్ళైహిక దృష్టితో మనగనౌనీశా! పరంధామ ! శ్రీ
మన్నారాయణ! భక్తి గొల్తు నిను. శ్రీ మాతాహృదీశా.హరీ. 06 . 03 . 2018.
భావము.
ఓ శ్రీ మన్నారాయణా ! లక్ష్మీతల్లియొక్క హృదయేశ్వరా ! శ్రీవారి రీ !  మాకు కలిగియున్న యీ కన్నులు కొన్నాళ్ళకు వాటీకి ఊఃడే చూచే శక్తీని కోల్పోవును. నిన్ను నేను చూచుట కొఱకు నికు జ్ఞాన నేత్రముండిన చాలును. నిన్ను నేను సేవిఃతును. అది నాకొసగుము. ఐహిక దృష్టితో ఎన్నాళ్ళు జీవనము కొనసొగించనగును?
జైహింద్

2, మే 2018, బుధవారం

శ్రీమన్నారాయణ శతకము. 13/20వ భాగము. 61 నుండి 65 రచన చింతా రామకృష్ణారావు

1 comments

జైశ్రీరామ్
శ్రీమన్నారాయణ శతకము.
                                                       రచన. చింతా రామకృష్ణారావు.
61. శా. అన్నైవత్తువు నన్ను కావ కృపతోనానంద సంధాయివై,
అన్నాయంచును వచ్చి చేరుదువు నన్నా త్రంబుతోఁ మ్ముగా
నన్నన్నా భవదీయ సత్కృపకునంతన్నట్టిదే లేదు. శ్రీ
మన్నారాయణ ! భక్తపాలనపరా ! మత్పుణ్యభాగ్యా ! హరీ !  
భావము.  ఓ శ్రీమన్నారాయణా! నీవు ఆనందమును కూర్చువాడవై నాకు అన్నగా కాపాడ వత్తువు. భక్తపాలనపరుడా. నా పుణ్యభాగ్యమైన శ్రీ హరీ. ఆ నీవే నన్ను అన్నాయని పిలుచుచు ఆతురతతో తమ్ముడుగా నన్ను చేరుదువు. అన్నన్నా. నీ కృపకు అంతు అనేటువంటిదే లేదుకదా.

62. శా. మన్నించే గుణమీకు కల్గెను కదా మాన్యుండ! నీ భక్తులన్
మన్నించన్ బరివర్తనన్ సుగుణసమ్మాన్యాళిగా మారి , యా
పన్నత్రాతవటంచు కొల్తురు కదా. ప్రార్థింతు మన్నింప. శ్రీ
మన్నారాయణ ! మంచి పెంచుమిలలో మా పూజ్య దేవా ! హరీ ! 
భావము.  ఓ శ్రీమన్నారాయణా !  మన్నించుట అనెడి శుభ లక్షణము నీకున్నదికదా. మాన్యుడా. నీ భక్తులను నీవు మన్నించినచో వారిలో పరివర్తన కలిగి ,సుగుణములచే సమ్మాన్యాళిగా మారి , నిన్ను ఆశన్నత్రాతవని సేవింతురు కదా. ఆ విధముగా నీవు మన్నింప గలందులకు నేను నిన్ను ప్రార్థింతును. మా పూజ్యదైవమా!  భూమిపై మంచిని పెంచుము..

63. శా. కొన్నాళ్ళే కద భూమిపై బ్రతుకు. మా కోపాదులన్ కాలమే
యెన్నాళ్ళైనను వ్యర్థమౌన్. కనవొ ? నీవీ మార్గమున్ వీడి మే
మున్నన్నాళ్ళును ప్రేమతోఁ బ్రతుకనీ ఉద్రేకముల్ బాపి. శ్రీ
మన్నారాయణ ! శాంతిమార్గమున సమ్మార్గంబునన్ నిల్పుమా. 
భావము.
ఓశ్రీమన్నారాయణా! మేము భూమిపై ఉండునది కొన్నినాళ్ళేకదా. మాకున్న కోపతాపాదుల వలన ఎంత కాలమున్నను నిరుపయోగమగుచున్నదికదా. నీవు గుర్తించవా? నీవు ఈ మార్గమును విడనాడి , మేము బ్రతికి ఉన్నంత కాలము మాలోని కోపాదులను పోగొట్టి  , ప్రేమతో బ్రతుకునట్లు చేయుము. మమ్ములను శాంతిమార్గములో మంచి మార్గములో నిలుపుము.

64. శా. అన్నన్ జాలును సోహమంచు, మరి దాసోహమ్మటంచంటి, నే
పిన్నన్, నేర్వను నన్ను నీ కొసగుటన్ విశ్వాసమున్ గొల్ప. నా
విన్నాణంబది చాలకుండెనయ. సంవేద్యంబె నీకిద్ది. శ్రీ
మన్నారాయణ ! నీకు తోచినటులే మమ్మందరిన్ జేయుమా. 
భావము.
ఓశ్రీమన్నారాయణా! ఆ పరమాత్మను నేనే అనిన చాలును. నేను నీ ముంగిటదాసోహమ్మనుచుఃటిని. నీకు నమ్మకము కలుగు విధముగా నన్ను నేనునీ కర్పించుకొనుట యెఱుగను. అందుకు నాకు గల విజ్ఞానము సరిపోవుట లేదు. ఆ విషయమునీకు తెలిసినదే. నీకం తోచిన విధముగా మా అందరినీ నీవే చేయుము.

65. శా.  కొన్నాళ్ళేమొ శిశుత్వమున్గొలిపి యింకొన్నాళ్ళు కౌమారమున్.
కొన్నాళ్ళంచిత యౌవనంబు నిడి , యింకోన్నాళ్ళు వార్ధక్యమున్.
క్రన్నన్ గొల్పి దురంత దుస్థితి మమున్క్రమ్మన్ నిరీక్షించు శ్రీ
మన్నారాయణ! నీకు ధర్మ మిదియా? మాకెందుకీవ్యర్థముల్?  

భావము.
ఓశ్రీమన్నారాయణా ! మాకు కొన్నాళ్ళపాటు బాల్యము , కొన్నాళ్ళు కౌమారము , మరికొన్నాళ్ళు యౌవనము , యింకొన్నాళ్ళు వార్ధకము కొలిపి అంతు  లేని దుస్థితి మమ్ము చుట్టిముట్టగా నిరీక్షింతువు. నీకు ఇదేమైనా ధర్మమా! ఈ నిరుపయోగమైనవన్నియు మాకెందులకయ్యా
                                                                       జైహింద్

1, మే 2018, మంగళవారం

శ్రీమన్నారాయణ శతకము. 12/20వ భాగము. 56 నుండి 60 రచన చింతా రామకృష్ణారావు

1 comments

జైశ్రీరామ్
శ్రీమన్నారాయణ శతకము.
రచన. చింతా రామకృష్ణారావు.
56. శా. మున్నే వేదములుగ్గడించె నిను  సంపూర్ణుండుగా. సత్యమే.
అన్నీ కాంచుచునుండ నిక్కమని నాకర్థంబయెన్ నిన్నునే
మన్నన్ దక్కువె. నిత్య సత్యమగు నిన్నాత్మన్ సదా నిల్పి , శ్రీ
మన్నారాయణ! కాంతు నేను. కృపతో మన్నించి లోన్ వెల్గుమా.                         
భావము.  నిన్ను సంపూర్ణుడవని వేదములానాడే ఉగ్గడించినవి. నిజమే.అన్నీ చూచుచున్నప్పుడు ఇది సత్యమని నాకర్థమయినది. నిన్ను ఏమన్నను అది తక్కువే యగును. నిత్య సత్యమైన నిన్ను నా ఆత్మలో నిత్యము నిల్పి నేను చూచుకొనుచుందును. కృపతో నీవు నాలో ప్రకాశించుము.

57. శా. మిన్నంటున్ మది హర్షచంద్రికలు నీ మీదన్మనంబుంచినన్.
జన్నంబుల్ పని లేదు. నీ తలపులే సద్యజ్ఞ సత్కార్యముల్.
మన్నించే గుణ గణ్య !  మములన్ మన్నించి కాపాడు. శ్రీ
మన్నారాయణ ! యజ్ఞతత్వమిదె కాన్ మా యజ్ఞమీవే సదా. 
భావము.  ఓశ్రీమన్నారాయణా ! నీపైనే మనసును నిలబెట్టినచో మా సంతోషములు ఆకాశమునంటును. యజ్ఞములతో పనియేమున్నది. నిన్నుగూర్చిన ఆలోచనలే మంచి యజ్ఞములు చేయుట యనెడి మంచిపనులు
మన్నించేటువంటి గుణము కలిగి యుండుట చేత గణింపబడువాడా !మమ్ములను మన్నించి కాపాడుము. ఓ
శ్రీ మన్నారాయణా ! యజ్ఞతత్వము ఇదే అయి యుండగా యెల్లప్పుడూ మాయజ్ఞము నీవే సుమా.

58. శా. పన్నీటన్ నిను సేవ చేయు ఘనులౌ భక్తాళికిన్ భాష్పముల్ . . . ?
కన్నీటిన్ గలిగించు దుష్ట తతికిన్ కామ్యార్థ సంప్రాప్తియున్ . . . ?
విన్నన్ నవ్వెరె నీ విలాస గతికిన్? విశ్వంబు నిట్లేల శ్రీ
మన్నారాయణ! చేయుచుంటి వకటా! మా మంచి నీకొప్పదా?  
భావము.  ఓ శ్రీమన్నారాయణా! నీకు పన్నీటితో స్నానము చేయించుట మున్నగు సేవలు చేయు భక్తుల సమూహమునకు కన్నీరు , ఇతరులచే కన్నీరు పెట్టించు దుర్మార్గుల సమూహమునకు కామ్యార్థలాభము, అయ్యో ఇట్టి నీ విలాసముతో కూడిన నడవడి విన్నవారు నవ్వరా? నీవు సృష్టిని ఈ విధముగా ఎందుకు చేయుచుంటివి? మా మంచితనము నీకు ఒప్పదా?

59. శా. కన్నుల్ గొల్పి, కనంగఁ జేసి, మదిలో కాంక్షల్ ప్రవర్ధింప, నీ
వన్నెల్ చిన్నెలశాశ్వితంబులను దేవా! నీవు కల్పించి,
మ్మున్నిల్పంగను ద్రోహిగాఁ, దలచితో? పూజ్యుండ! ధర్మంబె? శ్రీ
మన్నారాయణ! మంచి దృష్టినిడినన్ మర్యాదగా మెల్గమే?     
భావము.  ఓ శ్రీమన్నారాయణా! మాకు కన్నులనిచ్చి అన్నిటినీ చూచునట్లు చేసి, ఈ చూచుట మూలముఅ మాలో కోరికలను ప్రకోపింపఁ జేయుట కొఱకు లోకములో అశాశ్వితమైన వన్నెలు చిన్నెలు  నీవే కల్పించి మమ్ములను ద్రోహిగా నిలుప దలచినావా? నీకిది ధర్మమగునా? నీవు మంచి దృష్టినే ప్రసాదించినచో మేము మర్యాదగా ప్రవర్తింపకుందుమా?

60. శా. తిన్నన్ నీ కృప లేనినాడరుగదే దీపించు దధ్యన్నమై
నన్నీసత్కృప గల్గ రాళ్ళయినజీర్ణంబౌనిదే వింత. నీ
కన్నన్ వింత మరేమి కల్గు భువి? శ్రీకాంతా! మనోద్భాస!. శ్రీ
మన్నారాయణ ! జీర్ణ శక్తినిడుమా మన్నించి జీవాళికిన్.   24 . 02 . 2-18.  

భావము.  ఓ శ్రీ మన్నారాయణ ! నీ కృప లేకపోయినచో మేము తీనెడి ప్రకాశవంతమైన పెరుగూ ఆన్నమైనా జీర్ణము కానేరదు. నీ కృప కలిగియున్నచో రాళ్ళైనా జీర్ణమగును కదా. ఇదే విచిత్రము. నీకన్నా వింత భూమిపై మరేమి ఉండును ? లక్ష్మీదేవి హృదయమున ప్రకాశించువాడవైన హరీ !  జీవాళిని మన్నించి జీర్ణశక్తీని ప్రసాదించుము. 
జైహింద్.