గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, జూన్ 2026, మంగళవారం

56. శ్లోII ఆహితవిలాసభంగీ ... అను శ్లోక అనువాదముపై బ్రహ్మశ్రీ తాడేపల్లి పతంజలి మహోదయుల అభిప్రాయముతో కూడిన వివరణ.

జైశ్రీరామ్.

ఓం శ్రీమాత్రే నమః.🙏🏽

మూకపంచశతి..ఆర్యా శతకము.


56. శ్లోII  ఆహితవిలాసభంగీ మాబ్రహ్మస్తంబ శిల్పకల్పనయా 

ఆశ్రితకాంచీ మతులా మాద్యాం విస్ఫూర్తి మాద్రియే విద్యామ్‌!  


తే.గీ.II  బ్రహ్మ మొదలుగ స్తంబము వరకు శిల్ప

కల్పనన్ దనదగువెళుక విధ మడర

నొప్పు కంచివాసిని నాద్య నుజ్జ్వలాంబ

నాదరించెద జ్ఞానాబ్ధిననుపమముగ.  (వెళుకు = విలాసము)


తాII బ్రహ్మాది స్తంబ పర్యంతమైన సృష్టి శిల్పము యొక్క కల్పన చేత నిజ విలాసభంగిమల నెల్ల విస్త రింపఁ జేసిన, కొంచీనగర నివాసినిని అనుపమము ఆద్యము నైన సూర్తిరూప మగు జ్ఞానవిద్యా స్వరూపిణియగు అమ్మను ఆదరించెదను.


అమ్మ దయతో🙏🏽

చింతా రామకృష్ణారావు.

ఈ శ్లోకము అనువాదముపై బ్రహ్మశ్రీ తాడేపల్లి పతంజలి మహోదయుల అభిప్రాయముతో కూడిన వివరణ. 

తెలుగు పద్యం, మూల సంస్కృత శ్లోకానికి   చక్కని  అనువాదం. మూల శ్లోకంలోని గాంభీర్యాన్ని, వేదాంత సత్యాన్ని ఏమాత్రం కోల్పోకుండా, చక్కని తెలుగు పదాలతో, పద్య రూపంలో  ఇమిడ్చిన విధానం ప్రశంసనీయం.                                                                                                                            

 అమ్మవారు సృష్టికార్యాన్ని ఎంతో సునాయాసంగా, కేవలం ఒక చిన్న విలాసంగా (ఆటగా) చేసిందనే భావం "వెళుక విధ మడర" అనే మాటలో వ్యక్తమైంది.

 అమ్మవారు  కేవలం ఒక రూపం కాదు, సృష్టికి మూలమైన 'ఆద్య విద్య' (మొదటి చైతన్యం లేదా జ్ఞానం) అని చెప్పడానికి పద్యంలో "జ్ఞానాబ్ధి" అని వాడటం శ్లోకంలోని 'విద్యామ్' అనే పదానికి సరైన న్యాయం చేసింది.   ఈ సృష్టిలో అత్యున్నతమైన ప్రాణి అయిన 'బ్రహ్మదేవుడు' మొదలుకొని, అత్యంత చిన్నదైన 'గడ్డిపరక' (లేదా చిన్న మొక్క) వరకు కోట్ల కొద్దీ జీవరాశులు ఉన్నాయి. ఇన్ని రకాల జీవులు వేర్వేరుగా కనిపించడానికి కారణం వాటి శరీరాలు. ఈ రకరకాల శరీరాల నిర్మాణంలో ఎంతో అద్భుతమైన శిల్ప చాతుర్యం (కళాత్మకత) కనిపిస్తుంది. ఇంతటి అనంతమైన సృష్టిని చేయడానికి అమ్మవారు ఎలాంటి శ్రమ పడలేదు; కేవలం తన "ఆటగా (విలాసంగా)" దీనిని సృష్టించింది.

 సృష్టి జరగడానికి ముందు కలిగిన మొట్టమొదటి ఆలోచన లేదా జ్ఞానమే అమ్మవారు. దీనినే వేదాంతంలో 'అహమాకారము' (నేను ఉన్నాను అనే భావన) లేదా 'అహంకారము' అంటారు. అంటే, సృష్టికి మూలమైన ఆ మొదటి సంకల్పం అమ్మవారే. "నేను అనేకం కావాలి, ప్రజలను సృష్టించాలి" ( బహుస్యామ్ ప్రజాయేయ - ఛాందోగ్యము  )  అనే తదుపరి ఆలోచనలన్నీ ఆమె నుంచే వచ్చాయి.

 సృష్టికి కారణమైన జడ ప్రకృతి (శరీరము, మనస్సు, పంచభూతాలు వంటి 24 తత్త్వాలు - అవిద్య) మరియు ఆ సృష్టిని నడిపించే చైతన్యం (ఆత్మ లేదా పురుషుడు - విద్య)... ఈ రెండూ కూడా అమ్మవారి స్వరూపాలే.  బ్రహ్మ దేవుడి నుండి గడ్డిపరక వరకు ఈ అనంత కోటి జీవరాశులను తన విలాసంతో సృష్టించిన ఆదిశక్తి అమ్మవారే. సృష్టికి మూలమైన 'ఆలోచన', మనకు కనిపించే 'ప్రకృతి', మనలో ఉండే 'ఆత్మ'... అన్నీ ఆ తల్లి స్వరూపాలే అని ఈ శ్లోకం చెప్తోంది.                           

 మూల శ్లోకం ఒక 'ఆధ్యాత్మిక సూత్రం' అయితే, ఈ తెలుగు పద్యం ఆ సూత్రానికి కట్టిన ఒక 'అందమైన తోరణం'  జయహో. 🕉️🙏🕉️


సహృదయశిరోమణి బ్రహ్నశ్రీ తాడేపల్లి పతంజలి మహోదయులకు ధన్యవాదములు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.