గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, జూన్ 2026, సోమవారం

55. శ్లోII ఐక్షిషి పాశాంకుశధర హస్తాన్తం శ్లోకమునకు బ్రహ్మశ్రీ తాడేపల్లి పతంజలి గారి వివరణ అద్భుతం.

జైశ్రీరామ్.

 ఓం శ్రీమాత్రే నమః.🙏🏽

మూకపంచశతి..ఆర్యా శతకము.

55. శ్లోII  ఐక్షిషి పాశాంకుశధర హస్తాన్తం విస్మయార్హ వృత్తాంతమ్‌ 

అధికాంచి నిగమవాచాం సిద్దాంతం శూలపాణిశుద్ధాంతమ్‌ . 

తే.గీ.II  అమరి పాశాంకుశములు హస్తాంతమందు, 

వింతఁ గొల్పు వృత్తాంతముల్ పెక్కు కలిగి, 

వేదసిద్ధాంతమగు శంభు వేనలి నిట

కాంచి పురమునఁ దృప్తిగాఁ గంటి నేను.

తాII ముంజేతులలో పాశమును అంకుశమును బట్టికొని, వింతగొలువు 

వృత్తాంతములెన్నియో కలిగి, వేదముల సిద్దాంతమై యున్న 

శివుని భార్యను కాంచీనగరమున జూచితిని. 

అమ్మ దయతో🙏🏽

చింతా రామకృష్ణారావు..

ఈ శ్లోకానువాదమును  పరిశీలించిన

బ్రహ్మశ్రీ తాడేపల్లి పతంజలి మహోదయులు చక్కని వివరణనందించారు.

నమః.    తెలుగు పద్యానువాదం (తేటగీతి పద్యం) మూల శ్లోకంలోని భావాన్ని భక్తిశ్రద్ధలతో, చక్కని తెలుగుదనంతో  పట్టుకుంది.                                                                                                                                                                                                       

1.   మూలంలో "శూలపాణిశుద్ధాంతమ్" అని ఉంది. 'శూలపాణి' అంటే పరమశివుడు, 'శుద్ధాంతము' అంటే అంతఃపురము లేదా అంతఃపుర స్త్రీ (మహిషి). అంటే పరమశివుని పట్టమహిషి అయిన కామాక్షి దేవి అని అర్థం.

తెలుగు పద్యంలో దీనిని "శంభు వేనలి" అని అనువదించారు.


'శంభు' అంటే శివుడు. 'వేనలి' అంటే జడ లేదా కేశపాశము (ఇక్కడ అందమైన శిరోజాలు కలిగిన దేవి/భార్య అనే అంతరార్థంలో వాడబడింది). పరమశివుని అర్ధాంగిని అని చెప్పడానికి కవి వాడిన  చక్కని  ప్రయోగం ఇది.                                            

2. మూల శ్లోకంలో 'ఐక్షిషి' (చూశాను) అని మాత్రమే ఉంటే, అనువాదకుడు పద్యం ముగింపులో "తృప్తిగాఁ గంటి నేను" అన్నారు. కంచి కామాక్షమ్మను దర్శించుకున్నప్పుడు కలిగే ఆత్మానందాన్ని, భక్తి తన్మయత్వాన్ని వ్యక్తపరచడానికి ఈ 'తృప్తి' అనే పదం పద్యానికి అదనపు శోభను తెచ్చింది.                                                                                                                           

3. దేవీ సప్తశతి మొదటి అధ్యాయంలో సురథుడు అనే రాజు, సమాధి అనే వైశ్యుడు (వ్యాపారి) తమ రాజ్యాన్ని, ఆస్తులను, కుటుంబాన్ని కోల్పోయి అడవికి చేరుకుంటారు. సర్వస్వం కోల్పోయినా... తమను మోసం చేసిన వారిపై, తమ పాత జీవితంపై వారికి మోహం (ఆశ, ఆకర్షణ) పోదు. "అంతా పోయాక కూడా మా మనస్సు ఎందుకు ఇలా తపించిపోతోంది?" అనే సందేహంతో వారు మేధా మహర్షి ఆశ్రమానికి వెళ్లి తమ బాధను వివరిస్తారు.

తాము జ్ఞానవంతులమే అయినా ఈ మోహం నుండి ఎందుకు బయటపడలేకపోతున్నామో చెప్పమని అడుగుతారు. అప్పుడు మేధా మహర్షి వారికి ఈ జగత్తు అంతా వ్యాపించి ఉన్న "మహా మాయ" (అమ్మవారి) ప్రభావం గురించి వివరిస్తూ ఈ క్రింది శ్లోకాన్ని చెబుతారు.

మూల శ్లోకం

జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హి సా|

బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్ఛతి||

(దేవీ సప్తశతి - ప్రథమాధ్యాయం, 55వ శ్లోకం)

సులభమైన తాత్పర్యం:

ఆ భగవతీ దేవి అయిన "మహామాయ" ఎంతటి జ్ఞానుల మనస్సులనైనా సరే... బలీయంగా (బలవంతంగా) తన వైపు లాక్కొని, మోహంలో ముంచెత్తుతుంది.

వివరణ మరియు అంతరార్థం

ఈ శ్లోక సందర్భం ద్వారా దేవీ సప్తశతి మనకు మూడు ముఖ్యమైన విషయాలను అందిస్తోంది:

జ్ఞానం వేరు, మాయ వేరు: లోకంలో పశుపక్ష్యాదుల నుండి మనుషుల వరకు అందరికీ ఒక రకమైన జ్ఞానం (ఆహారం వండుకోవడం, ప్రాణాలను రక్షించుకోవడం, పిల్లలను సాకడం వంటివి) ఉంటుంది. కానీ ఆ జ్ఞానం సంసార మోహాన్ని పోగొట్టలేదు.

అమ్మవారి ఇచ్చ (సంకల్పం): సృష్టి నడవడానికి 'మాయ' లేదా 'మోహం' చాలా అవసరం. ఒక తల్లికి బిడ్డపై మోహం, భార్యాభర్తల మధ్య ఆకర్షణ, బంధుత్వాల మీద మమకారం... ఇవన్నీ అమ్మవారి సంకల్పం (మాయ) వల్లే కలుగుతాయి. ఆ మాయే లేకపోతే సృష్టి చక్రం ముందుకు సాగదు.

భగవంతుని లీల: ఎంత గొప్ప చదువులు చదివినా, ఎంతటి తత్వజ్ఞానాన్ని వంటబట్టించుకున్నా... అమ్మవారి సంకల్పం ముందు ఎవరూ విర్రవీగలేరు. ఆమె అనుగ్రహిస్తేనే ఆ మోహం తొలగిపోతుంది, ఆమె తలచుకుంటేనే తిరిగి మోహం కలుగుతుంది.చెరకువిల్లు, పూలబాణములు, పాశము, అంకుశములను ధరించిన హస్తములు  కలిగిన తల్లి ని తృప్తిగా తలచుకొన్న పద్యానువాద కర్తకి శుభాభినందనలు. 🕉️🙏🕉️

ఇంత చక్కనివివరణనందించిన పతంజలి గారికి నా ధన్యవాదములు.🙏🙏🙏

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.