జై శ్రీరామ్.
బ్రహ్మశ్రీ తాడేపల్లి పతంజలి మహోదయులు.ఓం శ్రీమాత్రే నమః.🙏🏽
మూకపంచశతి..ఆర్యా శతకము.
54. శ్లోII అనుమిత కుచకాఠిన్యా మధివక్షఃపీఠమంగజన్మరిఫోః
ఆనందదాం భజే తా మానంగ బ్రహ్మతత్త్యబోధి సిరామ్||
తే.గీ.II శివుని రొమ్ముపై నొక్కిన, చెలఁగు కఠిన
స్తనభరను, స్మరబోధనా సార నాడి
యైన సంతస దాయినినమ్మ నెన్ని
భజనఁ జేసెద సన్ముక్తిఁ బడయ నెంచి.
తాII శివుని రొమ్మునందు ఊహింపఁబడిన స్థనముల కఠినత ఉన్న, మన్మథునిచే ప్రతిపాదింపఁబడిన బ్రహ్మతత్త్వమును బోధించు నాడియైన ఆనందమునొసగు అమ్మవారిని సేవించెదను.
అమ్మ దయతో🙏🏽
చింతా రామకృష్ణారావు.
బ్రహ్మశ్రీ తాడేపల్లి పతంజలి మహోదయుల వివరణ.
చక్కని శ్లోకానికి చిక్కని పద్యానువాదం. అభినందనలు. మనం కంటితో నేరుగా చూడలేని ఒక విషయాన్ని, ఒక గుర్తు (హేతువు) ద్వారా ఊహించి తెలుసుకోవడాన్ని తర్కశాస్త్రంలో "అనుమాన ప్రమాణం" అంటారు.
ఉదాహరణ: ఒక కొండ మీద పొగ కనిపిస్తోంది. అక్కడ నిప్పు (అగ్ని) మనకు కంటికి కనిపించకపోయినా, "పొగ ఉందంటే కచ్చితంగా అక్కడ నిప్పు ఉంటుంది" అని మనం నిర్ణయించుకుంటాం. ఇక్కడ 'పొగ' అనేది గుర్తు (హేతువు), 'నిప్పు' అనేది మనం నిరూపించాల్సిన విషయం (సాధ్యము), 'కొండ' అనేది ఆధారం (పక్షము).
అమ్మవారి విషయంలో అన్వయం: ఈ శ్లోకంలో అమ్మవారి వక్షఃస్థలం (కుచద్వయం) కొండల వంటిది. ఆమె శరీరంలోని 'కాఠిన్యం' (గట్టిదనం) అనేది కంటికి కనిపించని విషయం (సాధ్యము). కానీ, శివుని రొమ్ము (ఛాతి) మీద కొన్ని గుర్తులు కనిపిస్తున్నాయి.
ఆ గుర్తులు ఏమిటి?: అమ్మవారితో ఆలింగనం (కౌగిలింత) చేసుకోవడం వల్ల, శివుని రొమ్ముపై ఉన్న విభూతి తొలగిపోయింది. ఆ విభూతిపై అమ్మవారి స్తనాలకు ఉన్న కుంకుమ మరకలు అంటుకున్నాయి.
నిర్ణయం: కొండ మీద పొగను చూసి నిప్పును ఊహించినట్లుగా, శివుని రొమ్ముపై ఉన్న ఈ రాపిడి గుర్తులను (పొగ లాంటి గుర్తును) చూసి, అమ్మవారి వక్షఃస్థలానికి ఉన్న కాఠిన్యాన్ని (నిప్పు లాంటి నిజాన్ని) మనం గ్రహించవచ్చు.
ఒక చిన్న శంక - సమాధానం: గుర్తు ఒకరి మీద (శివుడి మీద), కాఠిన్యం ఇంకొకరి దగ్గర (అమ్మవారి దగ్గర) ఉన్నాయి కదా, దీనివల్ల తార్కిక దోషం (హేత్వాభాస) రాదా? రాదు. ఎందుకంటే, ఆ గుర్తులు ఏర్పడడానికి కారణం అమ్మవారి వక్షఃస్థల ధర్మమే కాబట్టి ఇక్కడ ఎలాంటి దోషం లేదు. మన వెన్నెముకలో 'సుషుమ్నా నాడి' ఉంటుంది. దీని ద్వారా 'కుండలినీ శక్తి' మూలాధారం మొదలైన ఆరు చక్రాలను భేదించుకుంటూ పైకి సాగి, చివరకు తలలోని 'సహస్రార చక్రం' చేరుకుంటుంది. అక్కడ శివుడితో ఐక్యం అవుతుంది.
అమ్మవారే ఆ నాడి: ఇక్కడ ఆ సుషుమ్నా నాడి మరెవరో కాదు, సాక్షాత్తు అమ్మవారే (లక్షణా వృత్తి ద్వారా చెప్పబడింది).
ఆనంద ప్రదాత: కుండలినీ శక్తి సహస్రార చక్రాన్ని తాకినప్పుడే యోగికి పరమానందం కలుగుతుంది. ఆ ఆనందాన్ని ఇచ్చేది, ఆ ఆనంద స్వరూపంగా మారేది అమ్మవారే. లేదా అమ్మవారి అనుగ్రహం వల్ల యోగులకు కలిగే 'శక్తిపాతం' (గురువు ద్వారా శక్తి సంక్రమించడం) వల్ల ఈ ఆనందం సిద్ధిస్తుంది. అందుకే అమ్మవారే 'ఆనందం'.
అక్షరాల కూర్పు: ఈ శ్లోకం యొక్క మొదటి సగ భాగంలో పాదాలు 'అ' కారంతో మొదలైతే, రెండవ సగ భాగంలో పాదాలు 'ఆ' కారంతో మొదలవుతూ చక్కని ప్రాస (వడి) కలిగి ఉన్నాయి.
అనంగబ్రహ్మ విద్య: కాది విద్యకు (శ్రీవిద్యలోని ఒక మార్గానికి) అధిపతి 'మన్మథుడు' (అనంగుడు). అందుకే దీనిని 'అనంగబ్రహ్మ విద్య' అంటారు. ఈ విద్య ద్వారా జపం, ఉపాసన చేయడం వల్ల జీవుడు, బ్రహ్మం ఒక్కటే అనే జ్ఞానం కలుగుతుంది. దీనినే 'ఆనంగబ్రహ్మ తత్త్వ బోధము' అంటారు. జయహో. 🕉️🙏🕉️
డా. పతంజలిగారికి ధన్యవాదములు.
జైహింద్.
Print this post
వ్రాసినది



0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.