గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, నవంబర్ 2023, శనివారం

కార్తిక మాస తిథుల వైశిష్యము.

జైశ్రీరామ్.

కార్తీక శుద్ధపాడ్యమి:- తెల్లవారు జామునే లేచి స్నానం చేసి, అందుబాటులో ఉన్న ఏదైనా ఆలయాని వెళ్ళి , నేను చేయదలచుకున్న కార్తీక వ్రతం నిర్విఘ్నంగా సాగేటట్లు అనుగ్రహించమని ప్రార్థించి సంకల్పం చెప్పుకుని ఆకాశ దీపాన్ని సందర్శించుకోవాలి. 

విదియ:- ఈ రోజు సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి భోజనం చేసి, కానుకలు ఇచ్చి వచ్చిన వారికి యమగండం వాటిల్లదని పురాణోక్తి. 

తదియ:- అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవడం వల్ల సౌభాగ్య సిద్ధి.

చవితి:- కార్తీక శుద్ధ చవితి నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరునికి 'పుట్టకు' పూజ చేయాలి. 

పంచమి:- దీనికి జ్ఞానపంచమి అని పేరు. ఈ రోజు సుబ్రహ్మణ్య ప్రీత్యర్థం ఆర్చనలు చేయించుకున్నవారికి జ్ఞానవృద్ధి కలుగుతుంది. 

షష్టి:- ఈ రోజు బ్రహ్మచారికి ఎర్రని కండువా దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. 

సప్తమి:- ఈ రోజు ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానమివ్వడం వల్ల ఆయుష్షు వృద్ధి అవుతుంది. 

అష్టమి:- ఈ గోపాష్టమి నాడు చేసే గోపూజ విశేష ఫలితాలనిస్తుంది. 

నవమి:-ఈ రోజు నుండి మూడు రోజులపాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి. 

దశమి:- ఈ రోజు రాత్రి విష్ణుపూజ చేయాలి. 

ఏకాదశి:- ఈ ఏకాదశికే బోధనైకాదశి అని పేరు. ఈ రోజు విష్ణుపూజ చేసిన వారికి ఉత్తమ గతులు కలుగుతాయి. 

ద్వాదశి:- ఈ రోజు క్షీరాబ్ది ద్వాదశి. సాయంకాలం ఉసిరి మొక్క, తులసి మొక్కల వద్ద దామోదరుని ఉంచి పూజ చేసి, దీపాలు వెలిగించడం సర్వపాపాలనూ నశింపచేస్తుంది. 

త్రయోదశి:- ఈ రోజు సాలగ్రామ దానం చేయడం వల్ల సర్వకష్టాలూ దూరమవుతాయి. 

చతుర్దశి:- పాషాణ చతుర్ధశి వ్రతం చేసుకునేందుకు మంచిది.

కార్తీక పూర్ణిమ:- మహా పవిత్రమైన ఈ రోజు నదీస్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవడం వల్ల సర్వపాపాలూ ప్రక్షాళనమవుతాయి. కార్తీక బహుళ పాడ్యమి:- ఈ రోజు ఆకుకూర ఆవుకు దానం చేస్తే శుభం. విదియ:- వనభోజనం చేయడం విశేష ఫలాలనిస్తుంది.

తదియ:- పండితులకు, గురువులకు తులసి మాలను సమర్పించడం వల్ల తెలివితేటలు వృద్ధి అవుతాయి. 

చవితి:- పగలంతా ఉపవసించి, సాయంత్రం వేళ గణపతిని గరికతో పూజించి, ఆ గరికను తలగడ కింద పెట్టుకుని పడుకుంటే దుస్వప్న దోషాలు తొలగి సకల సంపదలూ కలుగుతాయి. 

పంచమి:- చీమలకు నూకలు చల్లడం, శునకాలకు అన్నం తినిపించడం శుభఫలితాలనిస్తుంది. 

షష్ఠి:- గ్రామ దేవతలకు పూజ జరిపించడం మంచిది. 

సప్తమి:- జిల్లేడు పూలతో గుచ్చిన దండను ఈశ్వరునికి సమర్పిస్తే సంపదలు వృద్ధి అవుతాయి. 

అష్టమి:- కాలభైరవాష్టకం చదివి గారెలతో దండచేసి, కాల భైరవానికి ( కుక్కకు ) సమర్పించడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. 

నవమి:- వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి పండితునికి దానమిస్తే పితృదేవతలు తరిస్తారు. 

దశమి:- ఈ రోజు అన్న సంతర్పణ చేస్తే విష్ణువుకు ప్రీతిపాత్రులై కోరికలు తీరతాయి. 

ఏకాదశి :- విష్ణ్వాలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ విశేషఫల ప్రదం. 

ద్వాదశి :- అన్నదానం లేదా స్వయంపాకం సమర్పించడం శుభప్రదం. త్రయోదశి :- నవగ్రహారాధన చేయడం వల్ల గ్రహదోషాలు తొలగుతాయి. చతుర్దశి :- ఈ మాస శివరాత్రినాడు చేసే ఈశ్వరార్చన, అభిషేకం అపమృత్యుదోషాలను, గ్రహబాధలను తొలగిస్తాయి. 

అమావాస్య :- నేడు పితృదేవతల పేరిట అన్నదానం లేదా స్వయం పాకం పేదవారికి దానం చేయడం వల్ల పెద్దలకు నరక బాధ తొలగి, స్వర్గసుఖాలు కలుగుతాయి. ఈ మాసంలో చేసే స్నాన, దాన, జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. అయితే అలా రోజూ చేయలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాలలో లేదా ఒక్క పూర్ణిమ లేదా కనీసం ఒక్క సోమవారం రోజైనా సరే నియమ నిష్టలతో ఉపవాసం ఉండి, గుడికి వెళ్లి దీపం వెలిగిస్తే లభించే పుణ్యఫలాన్ని ఇస్తుంది. 

కార్తీక పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసముండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో మట్టి ప్రమిదలో 365 ఒత్తులను ఆవునేతితో వెలిగిస్తే సమస్త పాపాలూ భస్మీపటలమై ఇహలోకంలో సర్వసౌఖ్యాలను అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు , ఇతివృత్తాలు , ఉపకథలను బట్టి తెలుస్తుంది. క్షీరాబ్ది ద్వాదశి వ్రతం , సత్యనారాయణస్వామి వ్రతం, కేదారేశ్వర వ్రతం కార్తీక మాసంలో చేసుకునే వ్రతాలు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.