జైశ్రీరామ్.
శ్రీరస్తు
బ్రహ్మశ్రీ కాళ్ళూరి శ్రీ సూర్య వేంకట రామారావు గారికి
అభినందన చందన చర్చ.
రచన. చిత్రకవితాసామ్రాట్ చింతా రామకృష్ణారావు. 8247384165
శా. శ్రీమద్వాణి దయాసుధార్ణవము. మీ చెంతన్ బ్రశాంతిన్ సదా
మీ మందస్మితపూర్వ భాషణమునన్, మీ గానతేజంబునన్,
ప్రేమన్ వాసము చేయుచుండెనొ? లసద్విజ్ఞాన! మీ కబ్బెనే
కామాక్షీకృప? రామరావు విభవా! కాళ్ళూరి వంశోద్భవా!
మ. ఘనమౌ దుందుభి సుస్వనంబు గళమున్, కాంతుల్ శరీరంబునన్,
మనమందున్ శుభ భావనాగరిమ, సమ్మాన్యత్వమున్ వృత్తిలో,
ప్రణవంబెన్నగ జ్ఞానతేజసమునన్, ప్రఖ్యాతిగా నిల్చె, స
ద్గుణపూర్ణా! శుభ సంతతుల్ పడయుఁడీ! కూర్మిన్ ననున్ గాంచుడీ!
శా. ప్రేమన్ మీరలు పంపినట్టి ఘనమౌ శ్రీ సాయి కర్ణామృతం
బే మాన్యత్వము నొప్పు రాగ సుధయౌన్. విఖ్యాతితోనొప్పెడున్.
శ్రీమాతా కరుణోపలబ్ధ ప్రతిభన్ శ్రీమన్మహా రాగముల్
సామర్ధ్యంబున వెల్వరించిరిగ శ్రీ సాయీశు మెప్పొందగన్.
ఉ. చేకొన నాకొసంగితిరి శ్రీకర నర్తన శాల నాటకం
బేకరణిన్ త్వదీయ కృపనెన్నఁగ జాలుదునయ్య నేను? మీ
రాకకు వేచియుందు. నటరాజు కృపన్, గననుంటి మిమ్ము. న
స్తోక శుభంబులన్ గనుచు శోభిలుఁడీరు సతంబు ధాత్రిపై.
ఉ. మంగళ కారకంబయిన మాన్య సురాగములాలపించుచున్,
నింగికిఁ బ్రాకఁ జేసి వరణీయ మహత్కళ కీర్తి తేజమున్,
పొంగఁగ భారతాంబ గుణ పూజ్యులుగా వెలుగొందుడయ్య! సన్
మంగళమూర్తి శ్రీహరి యమంద శుభాస్పదుఁడౌత మీయెడన్.
స్వస్తి.
తేదీ. 15 - 01 - 2018.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.