గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, నవంబర్ 2019, శుక్రవారం

కాశీపత్యవధానులు గారు...సీత చేత రాముని చేత పలికించిన చమత్కార భాషణము ప్రహేళిక.

 జైశ్రీరామ్.
ఆరులారా!
వివాహాల లో వధూవరులు తలంబ్రాలు పోసుకున్న తర్వాత 
వారి చేత పేర్లు చెప్పించడం ఒక వేడుక. 
కాశీపత్యవధానులు గారు...సీత చేత రాముని చేత పలికించిన చమత్కార భాషణము పద్య రూపములో ఎంత మనోజ్ఞంగా ఉందో చూడండి.
సీతను రాముని పేరు చెప్పమని అంగనలు అడుగగా సీత సిగ్గుతో
వరుని పేరే మనియెద'రా'?
సరస 'మ' యుక్తం బైన స్వామి యగుసుడీ
పరికించి తెలిసికొండని
ధరణీ సుత వ్రీడ తోడ తరుణుల కనియెన్.
సాధారణ భావం :-వరుని పేరు యేమని అంటారా? మీ సరసము యుక్తముకాదు.ఆయనను స్వామి అంటారు.
కవి చమత్కారం :--' 'రా' సరసన 'మ' యుక్తము యైన స్వామి యనగా ఆయన పేరు
'రామస్వామి' .అని సీత చేత అనిపించారు కాశీపత్యవధానులు గారు.
-------------------------------------
తరువాత రాముని చేత సీతపేరు చెప్పించిన పద్యము చూడండి.
చరణముల కడన్ బొసఁగెడు మీకి 'సీ'
వధువు పేరు దెల్పవలె నె మహి'త'
నయ యట౦ద్రు గాన నా రాణి పేరుగా
తెలిసికొనుడు మీకు తెలివి లేదే
సాధారణ భావం:--కాళ్ళ దగ్గర పడియుండు మీకు(చెలి కత్తెలు,దాసీజనులు)యిసీ
వధువు పేరు తెలుపవలెనట .మహి తనయ =దొడ్డ నీతి గలది అయిన నా రాణి పేరు తెలిసి కొనండి . మీకు తెలివి లేదే?
కవితా చమత్కృతి:-- చరణముల కడ పొసఁగెడు అనగా పాదముల చివర నున్నది
యని భావం.మొదటి పాదము లోచివర 'సీ' రెండవ పాదము లో చివర 'త',మూడవ పాదం చివర 'గా' నాల్గవ పాదం చివర 'దే' ఆమె పేరు సీత గాదె ?
అని రాముని చేత అని పించారు.
కాశీపత్యవధానులు గారి మేధస్సును ఎంత ప్రశంసించినను తక్కువే.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చాలా బాగుంది .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.