జైశ్రీరామ్.
ఆర్యులారా! నేడు పరమ జ్ఞానప్రదమైన వసంత పంచమీ పర్వదినము. ఆ వాగ్దేవి మూలముననే ఈ సకల చరాచర జగత్తు నడుస్తోంది.
ముఖ్యంగా బుద్ధి జీవులమైన మనకు ఈ జ్ఞాన ప్రదాయిని ఆ సరస్వతీ మాతయే. అట్టి మాతను మనసారా సేవించి, ఆ భారతీ దేవి యొక్క కరుణకు పాత్రులమగుటకు అతి ముఖ్యమైన రోజు ఈ రోజు.
ఆ శారదాంబ కరుణ విద్యర్థులందరిపైనా ఉండాలని ఆ తల్లి వల్లని చూపులు మనలో జ్ఞాన జ్యోతులు వెలిగించాలని మనసారా కోరుకొంటున్నాను.
తల్లి రూపమునుండి తన బిడ్డకేతల్లి మాటలాడుట నేర్పు మనసు పెట్టి,
తండ్రి రూపమునుండి తన బిడ్డకేతల్లి యక్షరస్వీకారమమరఁ జేయు,
తన బిడ్డ కేతల్లి తానె సద్గురువుగా విద్యలందించును వినుతి గొల్ప,
తన బిడ్దకేతల్లి తత్వబోధన కొల్పి ఇహ పర సౌఖ్య సత్ స్పృహను గొల్పు,
అంజలించెదనాతల్లినభినుతించి
అనుపమానంద సాంమ్రాజ్య మనుభవింప.
జ్ఞాన తేజమ్ము మతి నిల్చి, కరుణ తోడ
తోడు నీడయి మిముఁ గాచు వీడ కుండ.
జైహింద్.
2 comments:
Sandeep P ఇలా అన్నారు.
వసంతపంచమి సందర్భంగా శారదాంబకు ఒక చిన్న ఉత్పలమాల సమర్పించుకుంటున్నాను.
ఉ:-
కార్తిక పౌర్ణిమా సదృశ గౌరముఖీ కరుణాంశు సంచయం
బార్త జన ప్రయాస పరిహార నిమిత్త విశేష శస్త్రమౌ
ధూర్త విశోషణార్థభవ దుర్భర దావ మహోగ్ర జ్వాలయౌ
కీర్తనకార్యలోల జన కిల్బిష నాశక వజ్రపాతమౌ
భా:-
కార్తిక పౌర్ణిమ లాగా కనబడే తేజోవంతమైన ముఖం కలిగిన ఆమె (సరస్వతీ దేవి) కరుణాకిరణాల సమూహం దుఃఖంలో ఉన్నవారి కష్టాన్ని తొలగించే గొప్ప ఆయుధం అవుతుంది, దుర్మార్గులను ఎండగొట్టేందుకు పుట్టిన భరించశక్యము కాని దావానలంలోని వేడిమి అవుతుంది, కీర్తించే వారి పాపలను నాశనం చేసే పిడుగు అవుతుంది.
వి:-
సాధారణంగా సరస్వతీ దేవి ముఖాన్ని చంద్రుడితో పోల్చి శాంతాన్ని, శీతలత్వాన్ని సూచిస్తారు. భక్తుల కోసం ఆమె ఉగ్రరూపాన్ని కూడా ధరిస్తుంది అనే ఉద్దేశంతో ఈ పద్యం వ్రాసాను. ఉదాహరణకు సరస్వతీ దేవి శుంభ నిశుంభులను చంపింది అని దేవీభాగవతంలో దశమస్కంధం చెబుతోంది.
ఏమైనా తప్పులు ఉంటే అనుభవజ్ఞులు సరి చేయ మనవి.
నమస్కారములు
చాలా చక్కని స్తుతిని అందించి నందులకు ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.