గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, జనవరి 2015, గురువారం

ఈ రోజు మహోత్కృష్టమైన, పరమ పూజ్యమైన వైకుంఠ ఏకాదశి. మీ అందరికీ భగవదనుగ్రహం ప్రాప్తించాలని మనసారా కోరుకొంటున్నాను.

జైశ్రీరామ్.
ఆర్యులారా! 
ఈ రోజు పరమ పూజ్యమైన వైకుంఠ ఏకాదశి. 
ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి.
సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు.
సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గం' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది.
ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు.
ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు.
ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు.
ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాబారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని పెద్దలు చెబుతారు.. 
ఇట్టి మహోత్కృష్టమైన పవిత్రమైన రోజున మీ అందరికీ ఆ దేవేరులతో కూడియున్న ఆ జగన్నాధుని దివ్యమైన ఉత్తర ద్వార దర్శనం లభించాలని, ఆ దయామయుని కరుణామృతం మీకు లభించి, మీరంతా ఆనందంగా సుఖ సంతోషాలతో వంశాభివృద్ధి పొంది వర్ధిల్లాలని మనసారా కోరుకొంటున్నాను. 
ఓం నమో భగవతే వాసుదేవాయ.
శ్రీదేవియు భూదేవియు
నీదరి యిరు పార్శ్వములనునిలిచిరి మాకై
నీదయకోరుచు. కనుమా!
నీదర్శన భాగ్యమొసగి  మా మది నిలుమా!
జైశ్రీమన్నారాయణ.
జైహింద్.
Print this post

1 comments:

అజ్ఞాత చెప్పారు...

నీదర్శన భాగ్యమొసగి నిలుమా యెదలన్‌ /\

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.