గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, సెప్టెంబర్ 2013, సోమవారం

శ్రీ దువ్వూరి సుబ్బారావు గారు గణపతికి చేసిన కవితామృతాభిషేకం7.

జైశ్రీరామ్.
భగవద్బంధువులారా! వినాయక చతుర్హి సందర్భముగా మీ అందరికీ నా శుభాకాంక్షలు.
మన మిత్రులు శ్రీ దువ్వూరి సుబ్బారావుగారు గణపతికి చేసిన కవితామృతాభిషేకం తిలకించండి.

శ్రీ విఘ్నేశ! వినాయకా! గజముఖా! శ్రీ పార్వతీనందనా! 
భావింపందగు నన్ని కార్యములలో ప్రారంభమందున్ నినున్!
రావే విఘ్నము లెందునన్, కొలువ దూర్వారమ్ములన్, నిత్యమున్,
భావిన్ మంచి శుభమ్ము, కీర్తి గలుగున్ ప్రార్థించ నిన్ భక్తితో.

భాద్రపదమ్మున చవితిని
భద్రేభముఖున్ భజింప భక్తిని సర్వుల్
భద్రంబగు, రావు దరి యు-
పద్రవములు విఘ్ననాధు పటుతర కృపచే.


కొల్తును నే గజవక్త్రుని,
కొల్తును నే గౌరిసుతుని, కొల్తును దంతున్,
కొల్తును నే విఘ్నేశ్వరు,
కొల్తును నే భక్తితోడ కొల్తును సతమున్.


వరములనిమ్మా గణపతి!
కరిముఖ! గౌరీకుమార! కల్పోక్త విధిన్
కరమొప్ప భక్తి మనమున
వరదా యని పూజ సేతు పత్రిని, పూలన్.


గణనాథున్ భజియింపరే సతతమున్ గల్గున్ గదా సంపదల్!
వణకున్ విఘ్నము లెల్ల విఘ్నపతిఁ సంభావింపగా, దేవతా
గణముల్, యక్షులు, రాక్షసప్రభృతు లేకార్యమ్ము చేపట్టినన్
ప్రణతుల్ జేతురు దొల్త దంతిముఖునిన్ ప్రార్థించి సఛ్ఛ్రీలకై.

ఆర్యులకు ప్రణామములతో:
మిస్సన్న.

శ్రీ దువ్వూరి కులాబ్ధి చంద్రులగు యీ శ్రీ సుబ్బ రావిట్లు స
మ్మోదంబున్ ప్రకటించి పద్య తతితో ముద్దార నీ ధ్యానమున్
బోధన్ పెంచిరి భక్త పాళి కెదలన్. పుణ్యాత్ము నీ సత్కవిన్
నీ ధాతృత్వము తోడ కావుము సదా! నిర్విఘ్నకర్తా!కృపన్.

శ్రీ మిస్సన్న గారికి అభినందనలు, వినాయక చతుర్థి శుభాకాంక్షలు, ధన్యవాదములు.
జైహింద్.
Print this post

3 comments:

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

భక్తి పార వశ్య పద్య ప్రసూనాలు
పరమళాలు గురిసె బాగు బాగు ,
మిత్రమా !శుభములు మిస్సన్న!,'గణపయ్య'
కాంక్ష దీర మిమ్ము గాచు గాత !

మిస్సన్న చెప్పారు...

శ్రీ రామకృష్ణ గురువులు
హేరంబుని వేడినార లీశిష్యునికిన్
పేరున శ్రేయము లిమ్మని
వారికి వాత్సల్యమునకు వందన మిడుదున్.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
భక్తి కుసుమాలతో భగ వంతుని పూజించ గలగటం మన అదృష్టం అందరికీ ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.