గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, సెప్టెంబర్ 2013, శనివారం

శ్రీ టీ.శ్యామల రావు గారు గణపతికి చేసిన కవితామృతాభిషేకం 5.

జైశ్రీరామ్.

ఆర్యులారా! శ్రీ టీ.శ్యామల రావు గారు  విఘ్నేశ్వరునుద్దేశించి చేసిన సరసపద సంకీర్తనం చూడండి

( సరసపద పద్య లక్షణాలు )

శ్రీవిఘ్నరాజ రావయ్య నీకు చేసెదము మంచి పూజ
సర్వజ్ఞ నిన్ను నమ్మి యున్నాము స్వాగతమ్మో మహాత్మ

చంద్రేంద్రవిష్ణువంద్యప్రభావ సర్వార్తినాశచరణ
సంతోషపూర్ణ సోమార్కఘంట సద్భక్తలోకవరద

ప్రమధగణనాథ భక్తజనపాల పాపసంతాపనచణ
విఘ్నాంధకారభాస్వంత సకలవిద్యాప్రదాననిపుణ

ఓ వారణాస్య ఓ యేకదంత ఓ శశివిరోధి రావె
ఓ బొజ్జదేవరా సూర్యతేజ ఓ గణపతయ్య రావె

మారేడు పత్రి నెలవంక పత్రి నేరేడు పత్రి దెచ్చి
అశ్వత్థ పత్రి కరవీర పత్రి యని చాల పత్రి దెచ్చి

పత్రంబు లేక వింశతిని తెచ్చి పరమోత్సవముగ నిన్ను
పూజించుకొనగ వేచితిమి శంభుపుత్ర విచ్చేయ వయ్య

కస్తూరి గంధములు దెచ్చి నాము కరివదన వేగ రావె
పూజింప నిన్ను వివిధంబు లైన పూవులును దెచ్చి నాము

జిల్లేడుకాయ లుండ్రాళ్ళు నీకు కొల్లలుగ నిత్తు మయ్య
బెల్లంబు పాలతాలికలు చాల పెట్టెదము గణపతయ్య

ఈ ముద్దపప్పు ఈ మంచి నెయ్యి ఈ గడ్డపెరుగు చూడు
ఇవియెల్ల నీకు నైవేద్యమయ్య ఇక జాగు చేయ కయ్య

ఖర్జూర ద్రాక్ష దానిమ్మ పనస కదళీ ఫలంబు లివిగొ
హాయిగా వచ్చి విందారగించి ఆశీర్వదించ వయ్య

ఆనందపడుచు అమితప్రభావ హారతుల నిచ్చి నిన్ను
వేనోళ్ళ పొగడు భాగ్యమ్ము కొఱకు వేచితిమి నేడు తండ్రి.

టీ.శ్యామల రావు.

శ్యామల రావు సత్కవి ప్రశస్తముగా పద కీర్తనంబుతో
ప్రేమగ నిన్నుఁ గొల్చెనయ! ప్రీతిగ బ్రోచెడి మా గణాధిపా!
ధీ మహిత్ముఁడౌ సుగుణ తేజుని, శ్యామ రావుసత్ కవిన్
ప్రేమను జూచి బ్రోవుమయ శ్రీ శివ మానస పుత్రుఁడా! సదా.
శ్రీశ్యామలరావు కవీ! ధన్యవాదములు.
జైహింద్.
Print this post

2 comments:

astrojoyd చెప్పారు...

౨-౩-౪ పాదాల్లో కవిత్వం కనిపించింది మిగిలిన పాదాల్లో కవిత్వం ఎక్కడ ఉన్నదో ఎంత ఆలోచించినా గోచరం కాలేదు సుమీ ..

శ్యామలీయం చెప్పారు...

సరసపద.
కవితలను వ్రాయ గలుగుటయు నొక్క కళయె యటు గాన వినుడు
కవితలను రసికు లగు వారె మెచ్చగల రనుట యొప్పు నెపుడు

స్వస్తి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.