గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, సెప్టెంబర్ 2013, శనివారం

పండిత నేమాని వారు గణపతికి చేసిన కవితామృతాభిషేకం1.

జైశ్రీరామ్.
సత్ పూజ్య మానసులారా! శ్రీమాన్ పండిత నేమాని రామ జోగి సన్యాసిరావు కవీద్రులు మహోజ్వల భక్తి భావంతో మన బుజ్జి గణపయ్యకు తన కవితామృతంతో ఎంతటి మనోజ్ఞంగా అభిషేకించారో చూడండి.

ఓ విఘ్నేశ్వర! ఓ మహాగణపతీ! ఓ పార్వతీనందనా!
ఓ వేదస్తుత! ఓ కృపాజలనిధీ! ఓంకార నాదాత్మకా!
ఓ విద్యానిధి! ఓ కవీంద్రప్రముఖా! ఓ దేవదేవోత్తమా!
ఓ విశ్వేశ మనఃప్రమోదనకరా! ఓ స్వామి నిన్ గొల్చెదన్.


జయము శుభవిలాసా! సాధు చేతోబ్జవాసా!
జయము విమల కీర్తీ! సచ్చిదానందమూర్తీ!
జయము ప్రమథనేతా! సర్వసంపత్ప్రదాతా!
జయము జయము దేవా! సర్వదా శాంత భావా!


వందనమ్ము దేవ! వందారు మందార!
గంధ సింధురాస్య! కలుషనాశ!
మూషకవర వాహ! మునిజన వందిత!
పార్వతీ తనూజ! భవ్య తేజ! 

Nemani Ramajogi Sanyasi Rao.

శ్రీ గణ నాయకా! శుభద! చిత్తముతోడ గ్రహింపుమయ్య! యీ
ధీ గణులైన పండితుని, దివ్యుని, నేమని సన్యసాఖ్యు లౌ
మా గురు, సత్ కవీశు, ముదమారగ చేయు మహాభిషేకమున్.
బాగుగ కావుమీ గురుని, భారత భూమిని, ఆంధ్ర భారతిన్.
శ్రీ నేమాని పండితులకు ధన్యవాదములు.
జైహింద్.
Print this post

1 comments:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

T.b.s. Sarma అన్నారు...
శ్రీపండిత నేమాని గురువులకు అభినందనాపూర్వక నమ:ప్రసూనము
కామిత వరదు వినాయక
సామిని మధురామృతపద సాహిత్యమునన్
వైమాల గొలుచు పండిత
నేమాని గురూత్తములకు నే ప్రణతింతున్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.