గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, ఏప్రిల్ 2013, శుక్రవారం

జాతీయ సాహిత్య పరిషత్, వినయ్ నగర్ శాఖ నిర్వహించిన ఉగాది వేడుకలు.

జైశ్రీరామ్.
సాహితీ ప్రియ బంధువులారా! శ్రీమద్విజయ నామ సంవత్సర ఉగాది శుభదినాన మీరంతా కోటి ఆశాకిరణాలు మీ హృదయాలలో వెల్లివిరియగా మీ ఆనందమయ భావికి రూపం దిద్దుకొని అది నిజం కావాలని, మీ కోరిక పరిపూర్ణంగా నెరవేరాలని ఆశిస్తూ ఆ కాల స్వరూపుడైన పరమాత్మను వేడుకొని, పంచాంగ శ్రవణం చేసి ఉంటారు కదూ? నిజమే మన అత్యద్భుతమైన సత్ సంప్రదాయం మనకు ఈ విధమైన చక్కని బాట వేసి ఆశామయ జీవులమై ఆనందంగా జీవించే మార్గం ఏర్పరిచింది.
ఈ ఆనంద సమయంలో మీ అందరికీ మరొక్క పర్యాయం మీ అణ్దరికీ శుభాన్ని అశిస్తున్నాను.
ఇక నిన్నను జరిగిన ఉగాది ఉత్సవాలు తెలుగు జాతికే మరపురాని మహనీయమైన మధురానుభూతులుగా భావిస్తున్నాను.
నిన్నను జరిగిన ఉగాది వేడుకలలో పాల్గొనవలసినదిగా జాతీయ సాహిత్య పరిషత్, వినయ్ నగర్ శాఖ నన్ను ఆహ్వానించింది. వినయ్ నగర్లో ఉన్న శ్రీ వినాయకుని దేవాలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమము చాలా బాగా జరిగింది.
ఈ కార్యక్రమమునకు శ్రీ సిగిరెడ్డి వెంకట రెడ్డి అధ్యక్షులుగా ఉండి నిర్వహించారు.ఉస్మానియా విశ్వవిద్యాలయము తెలుగు ప్రొఫెసర్ డా.మసన చెన్నప్ప ముఖ్య అతిథిగా పాల్గిని ఆర్షసాంప్రదాయమును గూర్చి, వివేకానందుని ఆశయములను గూర్చి అత్యద్భుతంగా ఉపన్యసించారు.అనేకమంది కవులు తమ కవితా స్రవంతిలో శ్రోతల హృదయాలను ఓలలాడించారు.
సభాధ్యక్షులు శ్రీ కసిరెడ్డి వెంకట రెడ్డి ప్రసంగము.
డా.మసన చెన్నప్పౌపన్యాసము.
ఈ సందర్భముగా నేను కూడా పాల్గొన్నాను. 
నా కవిత తిలకించండి.
విజయావతరణము.
ఉ.  విజయ మనోజ్ఞ మార్గమున విస్త్రుతులౌ సహ జన్ములార! యీ
విజయ వినూత్న మార్గముల వేల్పయి కాచి జయంబు కూర్చుచుం
బ్రజల మనః ప్రవృత్తులను మంచిగ మార్చుచు మేలు గొల్పు. ఈ 
విజయకు స్వాగతమ్మనుచు. విజ్ఞులకెల్ల నమస్కరించెదన్.  1.

చ. సుజనులనెల్ల వేళలను శోభిలజేయగ నేగుదెంచె నీ
విజయ మనోజ్ఞ భావ నిజవిస్త్రుత వర్ధన ధర్మ దీక్షతో
ప్రజలకనేక రీతుల నవారిత సత్ఫలదాయియౌనికన్
విజయము తథ్యమింక భువి వెజ్ఞతతో వెలుగొందువారికిన్.  2.

చ. ప్రకృతియె పారవశ్యమున పల్కె కుహూ యని స్వాగతమ్మహో! 
సకల సుపూజ్యమౌ విజయ సద్గుణ రాశికి భారతావనిన్ 
ముకుళిత హస్తులై ప్రజలు, పుష్ప చయంబున లోక మాతయున్ 
సుకవులు సత్కవిత్వముల చూచిరి సద్విజయాగమార్ధమై. 3
.
ఉత్పల – వింశ త్యధిక ద్వి విధ గతి కంద - గీత గర్భ , నామ గోపన చిత్రాన్విత గీత్యవసాన సీసము..
శ్రీ విజయాఖ్యవై శ్రిత సుసేవ్య జయాశ్రయ శ్రేయ మేధవా యమర వినుత!
భావి జయార్థులన్ వర విభావ జయోన్నత వ్రాత మొందవా తనియ జేయ .
భావి జయాక్షరా వసుధ భక్తి జగంబన భ్రాంతి జేసితే నవ్యముగను.
భూ విజయాఖ్యవై పుడమిఁ పూర్ణ జయంబిడి బ్రోవుమీవు నన్ డీల బాపి 
గీ. శ్రీకరంబుగ లోకాన సాకుమమ్మ.  
విపుల సౌభాగ్య సంపదల్ వెలయనిమ్మ. 
జయము లన్నిటనిచ్చి మా భయము బాపి  
యత్న సత్సిద్ధి కూర్చి మమ్మలరనిమ్మ. 4.

ఉ. మంగళమైన రాకయు, సుమంగళనామము,సౌమనశ్యమున్,
పొంగగ జేసె మమ్ము, విరిబోడులయుల్లములెల్ల చల్లనై
బెంగలు వీడ జేసె,నిరు పేదలు పొంగిరి. నీ వచ్చినన్
నింగిని యంటు సంతసము.నీవు గ్రహించి శుభాళి గూర్చుమా!  5.              స్వస్తి 

సాహితీ ప్రియుల హృదయాలకు ఆనందదాయకంగా తమ వ్యాఖ్యలతో అధ్యక్షులు నిర్వహించారు.
సముచిత రీతిలో కవులను సత్కరించారు.
కార్య నిర్వాహకుల కృతజ్ఞతాభివందనములతో ఈ సభ సుసంపన్నమయింది.
జైహింద్.

Print this post

3 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
విజయావతరణ ఉగాది వేడుకలను విని పించి నందులకు ధన్య వాదములు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
విజయావతరణ ఉగాది వేడుకలను విని పించి నందులకు ధన్య వాదములు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
విజయావతరణ ఉగాది వేడుకలను విని పించి నందులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.