గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, మే 2012, బుధవారం

వసు స్వారోచిషోపాఖ్యానము (ద్వ్యర్థి కావ్యము) వసుచరిత్ర పరముగ అర్థ వివరణము. 14 / 14

జైశ్రీరామ్.
కోలాహలుఁడు శుక్తిమతిని అడ్డగించుట.
క:-
రెండవ మనువనఁగా భూ  -  మండలి రక్షింప వలయు మనుజుల కోర్కెల్
పండఁగఁ జేయుచు నిరతం  -  బుండు మనుచుఁ జనియె, శుభము లొదవె, ప్రజకిఁ కన్. ౬౬.  
ఇతఁడు రెండవ మనువు అనగా కీర్తి గాంచి ఈ భూమండలి రక్షింపవలయును. మనుజుల కోర్కెలు పండునట్లుగా చేయవలెను. నిరంతరము జీవించి యుండుము.అని ఇంద్రుఁడు అనుచు చనియెను.ప్రజకిక శుభములొదవెను.
భరత వాక్యము:- 
ఉ:-
పాయమునందు మిత్తి. చలపాది గొనంబున సత్తి,తొచ్చెమౌ
రో యెలనాగబత్తి, చెడు త్రోవను చేరిన బుత్తి, లేక - దీ
ర్ఘాయు రనంత ధీ ప్రియ హితాఖిల మార్గగ భుక్తులేర్పడన్
బాయని కౌతుకంబును శుభంబును గల్గుత యెల్ల వేళలన్. ౬౭.
పాయమునందు మిత్తి(చిన్నప్పుడే మృత్యువు) చలపాది గొనంబుల సత్తి(మాత్సర్యాదిదుర్గుణ ప్రదర్శనయెడల శక్తి)తొచ్చెమౌ(తుచ్ఛమైన) రో యెలనాగ(ధన నిమిత్తమై యుండు వేశ్యల యెడల) బత్తి(విడరాని ఆసక్తి) చెడు త్రోవను, చేరిన(సంప్రాప్తించిన)బుత్తి(భుక్తి)అనునవి లేకుండా క్రమముగా దీర్ఘాయువు, అనంత ధీ, ప్రియము, హితాఖిల మార్గగ(మేలు చేయు ఎల్ల దారుల వలన లభింప గల)భుక్తులు, ఏర్పడ(గా)న్,పాయని కౌతుకంబును శుభంబును ఎల్ల వేళలను కల్గుత!
క:-
కుజన త్రిజగద్విలయా - సుజన మనో నిలయ! తాప శోషణ మలయా!
వృజిన విపిన దహనా!వి - శ్వ జనీన ప్రకట కార్య వహన! సుసహనా!  ౬౮.
కుజనులు గల త్రిజగములకు విలయమైనవాఁడు! సుజన మనో నిలయా! తాపశోషణమున మలయమా! వృజిన(పాపములనెడి) విపిన దహనుఁడా! విశ్వ జనీనులకు ప్రకట(యోగ్యమైన)కార్య(కృతులను)వహనుఁడా!సుసహనుఁడా!
చిత్రపద వృత్తము:-
భక్తి జనావన దక్షా! - ప్రాక్తన శాసన పక్షా!
యుక్త విచారణ దీక్షా! - సక్త మహేశ్వర రక్షా! ౬౯.
భక్త రక్షణ సమర్థుడా! ప్రాక్తన శాసనములైన వేదపక్షపాతీ! యుక్తాయుక్త విచారణ దీక్షా తత్పరా! సక్త(పొందబడిన) మహేశ్వరుడు కలవారికి రక్షకుఁడా!   
సమాప్తము
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.