గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, మే 2012, గురువారం

వసు స్వారోచిషోపాఖ్యానము (ద్వ్యర్థి కావ్యము) మను చరిత్ర పరముగ అర్థ వివరణము. 01 / 14

జైశ్రీరామ్.
వరూధినీ ప్రవరులు.
ఆః-
ఆట పట్టు సిరికి న్యాయంబునకు, నధి - ష్ఠాన మనఁగ దనరి సౌధ వినిహి
తాబ్జ రాగ కాంతి నరుణాస్పదంబనఁ - బురము దనరు లోక భూషణంబు. ౧.
సిరికి ఆటపట్టు. న్యాయంబునకు అధిష్ఠానము (నివాస స్థానము) అనే విధముగా నుండి సౌధములందు వినిహితమైన (తాపఁబడిన) అబ్జ(పద్మ) రాగ(మణుల) కాంతి యొక్క ప్రకాశముచే తనరి, లోక భూషణము అరుణాస్పద పురము అను విధముగా తనరు చుండెను.
చః-
పురి ద్విజ కోటి ధాత, నృప పుంగవు లర్జును, వైశ్య పాళి కి
న్నరవరు, నంఘ్రిజుల్ హలిని, నట్టువకత్తెలు రంభ, నాగముల్
తురగములున్, మహీరుహతతుల్ సుర సింధుర సైంధవాద్రులన్
నిరతముఁ గ్రిందు సేయఁ దగు నేర్పున రంజిలు మంజు వైఖరిన్. ౨.
ఆ అరుణాస్పద పురము నందలి ద్విజ కోటి ధాతను, నృప పుంగవులు అర్జునుని, వైశ్య పాళి కిన్నర వరులను, అంఘ్రిజులు హలి(బలరాము)నినట్టువ కత్తెలు రంభను, నాగములు, తురగములు, మహీరుహ తతులు - సుర సింధుర(ఐరావతము), సైంధ, అద్రులను (క్రమాలంకారము)నిరతమూ క్రిందు చేయుటకు తగిన నేర్పుతో, మంజు వైఖరితో రంజిలి యుండును. 
గీః-
పచ్చడాల్ పూని సకలార్థ భవ్య సాధ - నాత్మ పౌరుష వాగ్జాల మతిశయింప,
నతి ముదంబున వీర పండితు లనంగ - వెలయు చుందురు వీఁటఁ బ్రవీణులెపుడు. ౩.
ఆ అరుణాస్పదము అనే వీఁటిలో ఎప్పుడూ పచ్చ్డడము(శాలువ) లను పూని, కలా సమన్వితమై(శాస్త్ర యుక్తమై)న అర్థములే భవ్యమైన సాధనగా కల ఆత్మ పౌరుష వాక్జాలము అతిషయించగా  శాస్త్రార్థ ప్రవీణులు వీరే పండితులు అని అతి ముదంబున అనే విధము ప్గండితులు వెలయు చుందురు. 
ఆః-
భూమి దేవుఁడందుఁ బొల్చును ప్రవరాఖ్య - నుపరిచరుడనంగ నొప్పి వసువు
న్యాయ రీతి మిగుల నార్జించిన ఘనుండు - తేజ మొప్పఁగ ద్విజ రాజ కులము. ౪.
ఆ అరుణాస్పద పురము నందు ఉపరి చరుఁడు (ఉన్నత స్థాన వర్తనుఁడు) గా ఒప్పి, ద్విజ రాజ కులము(బ్రాహ్మణ కులము) తేజము (ప్రకాశము)తో ఒప్పునట్లుగా, వసువు (ద్రవ్యము) నున్యాయ రీతితో మిగులుగా ఆర్జించిన ఘనుఁడు ప్రవరాఖ్య భూమి దేవుఁడు పొల్చు(ఒప్పు)ను.
కః-
ఆర్యావర్తన రహితుఁ, డ - శీర్యత్సుగుణ ప్రవృత్తి, చేది వినుతుఁడై
ధైర్య గుణ మొప్ప నాతని - చర్యన్ వినుతింప వశమె! శత ధృతికైనన్. ౫.
ఆర్యావర్త దేశమునందలి నరులకు హితుఁడు, అశీర్యత్(సడలని)సుగుణ ప్రవ్రుత్తిచేత దియందు కూడా నుతుఁడై, ధైర్య గుణముతో ఒప్పెడి ఆ ప్రవరుని యొక్క చర్య(ప్రవర్తన)ను వినుతింప శరధృతి(బ్రహ్మ)కైననువశమా?
(సశేషం)
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.