గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, మే 2012, సోమవారం

వసు స్వారోచిషోపాఖ్యానము (ద్వ్యర్థి కావ్యము) వసుచరిత్ర పరముగ అర్థ వివరణము. 12 / 14

జైశ్రీరామ్.
కోలాహలుఁడు శుక్తిమతిని అడ్డగించుట.
గీ:-
అంత సమ్ముఖ మతిఁ గౌతుకాభిలాష  -  నట్టు చెంతకుఁ జనిరస ముట్టిపడఁగ
మొనయ నాతఁడు ఖ చరుఁడైనను హితుండు  -  హయము నెక్కించి చనిన నయ్యబల వెనుక. ౫౬.
అంతట తల్లి సమ్ముఖమునకు పోవు మతితో కౌతుకాభిలాష(వివాహమందైన ఇచ్ఛ)తో సృంగార రస ముట్టిపడునట్లుగానట్టు(తల్లి)చెంతకుఁ జని, మొనయన్(ఉత్సహించి యుండగా)ఆ వసురాజు ఖ(పట్టణమును గూర్చి) చరించు చున్నవాఁడైయుండి నను, స్నేహితుఁడు హయము నెక్కించి, చనినంత నయ్యబల  -  -  -  -  -.
క:-
ఆ పెను వగతో నుద్యా  -  నోప శమముఁ బొంద డిగ్గ నొప్పున నంతన్
భూపుఁ గనను, పరిచర, మతి  -  యేపునఁ జనుదెంచి వృత్త మెఱిఁగింప వెసన్. ౫౭.
ఆ పెను వగతో ఉద్యానమునందు ఉపశమనము పొందుటకు వసు భూపు గనను, ఒప్పున అంతన్ డిగ్గి(ప్రవేశించగా) పరిచరయైన మంజువాణి యొక్క బుద్ధి యేపు(వికాసము)న ఆ గిరిక యున్న ఉద్యాన వనమునకు చనుదెంచి  వృత్త మెఱిగింపగా, వెంటనే  -  - . 
క:-
కొనిపోయి భవనమునకుం  -  దన యంగనఁ బెండ్లి సేయఁ దత్పర మతియై
చని మంజువాణి తోడనె  -  వినయంబున భూమి భృత్సవిధ దేశమునన్. ౫౮. 
గిరిక యుండు భవనమునకు గొనిపోయి, తన అంగన యగు గిరికను, పెండ్లి సేయవలెనని తత్పరమతియై మంజువాణి, తోడనె, చని,వినయంబున భూమిభృత్తగు వసురాజు యొక్క సవిధ(సమీప)దేశమున  -  -  -  .

గీ:-
నిలిచి వృత్తాంత మంతయుఁ దెలుప సుదతి  -  కన్య కల నిచ్చమైఁ దోఁపఁగా ముదానఁ
బొంగి తన నియని ప్రేమఁదానుంగరంబు  -  నొసఁగఁ గొని సుఖమునఁ బోవ నున్న నచట. ౫౯.
వసురాజు సమీపమున నిలిచి, గిరికా వృత్తాంతమంతయు తెలుపఁగా, ఓసుదతీ(మంజువాణీ)కన్య(గిరిక)కలన్ (చిత్తరువు నందు) ఇచ్ఛమై తోపగా ముదాన పొంగితిని. అని యని, తాను ప్రేమను ఉంగరంబునొసగ, కొని, సుఖమునఁ బోవ నున్నన్ అచట -  -  -  -.
గీ:-
చెంత వారాశయముఁ గాంచ జేరి యలస  -  గమన వచియించు పలుకుల గారవమున
విని విడువ లేని కూర్మిఁ దా వెలఁదులనొఁగి  -  గూడి యుంగరమును బూని, కుతుకమునను. ౬౦.
గిరిక చెంత నున్న వారు ఆశయము గాంచగా(మంజు వాణి వెళ్ళిన సంగతి ఏమైనదో యను విషయము తెలుసుకొను అభిలాషతో నుండగా)వచ్చి, అలస గమన యగు మంజువాణి వచియించు పలుకులను గారవమున విని, ఆమెను విడువ లేని కూర్మిని, తాను(గిరిక)వెలదుల నొగి గూడి, ఉంగరమును బూని, కుతుకమునను - - - -.
(సశేషం)
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.