గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, మే 2012, బుధవారం

వసు స్వారోచిషోపాఖ్యానము (ద్వ్యర్థి కావ్యము) వసుచరిత్ర పరముగ అర్థ వివరణము. 10 / 14

జైశ్రీరామ్.
 
 కోలాహలుఁడు శుక్తిమతిని అడ్డగించుట.
గీ:-
క్షితి విభునిఁ గను కోర్కెను జెలియ! తీర్తుఁ  -  గన్నుఁ గవ మూయ నగునంతఁ గలియ వచ్చు
ననిన నయ్యెడ నతని వచనము వినుచుఁ  -  గువరుఁడంతట రాఁ దన భవనమునకు. ౪౬.

ఓ చెలియా! క్షితి విభుని గనవలెననెడి కోర్కెను తీర్తును. కన్నుగవ మూయనగు నంత సేపటిలో కలియ వచ్చును అని ముని పలుకగా, అంతట అయ్యెడ అతని వచనము  (స్నేహితుని చమత్కార ప్రసంగము) వినుచు, కువరుఁడైన ఆ వసు రాజు  తన భవనమునకు రాగా - - - - -.
గీ:-
అతని రాకకు మెచ్చి మహాముదంబు -  గదుర రతి నుండఁగా స్వల్ప కాలముననె
యతఁడు చెలి జతనంబున హర్షమంది  -  చనగ, సఖి గాంచె సుకుమారు సార్వభౌము. ౪౭.

అతని రాకకు మెచ్చి, మహా ముదంబు గదురగా రతిని(ఆసక్తితో)ఉండగా చెలికానియొక్క జతనంబునకు హర్షమంది, అతఁడు చనఁగ(ఒప్పి యుండగా), సుకుమారుఁడైన ఆ సార్వభౌముని స్ఖి యైన గిరిక స్వల్ప కాలముననె కాంచెను.
వ. అతఁడు స్వరోచియై వెలుగు చుండఁగా, ౪౮.
క:-
కని ముదమందఁగఁ బెంచిన  -  ఘన మతి సర్వంబెరిం(శకట రేఫ)గి, కడు పెంపడ రం
గను, నవల రే(శకట రేఫ)ని తోడం  -  గని యెరు(శకటరేఫ)క పడంగఁ గాంక్ష గారమున ననెన్. ౪౯.

కని గిరిక ముదమందగా నవల(గిరిక చెలికత్తె యగు మంజువాణి)పెంచిన(వృద్ధి చేసికొనిన) ధనమైన మతి కలది యైసర్వంబెరిం(శకట రేఫ)గి,(వసు గిరికల చారిత్రమెరింగి)కడి పెంపు(ఉత్సాహము)అడరగా, కని, రే(శకటరేఫ)నితో  కాంక్ష ఎరు(శకటరేఫ)క పడునట్లుగా గారమున ఇట్లు అనెను.
సీ:-
క్ష్మా తలాధిప! నేఁడుగా మా మనోభీష్ఠ  - ములు దీరఁ గల్గెనోములు ఫలించె.
గహ్వరీపతి! నేఁడుగా మా నయన పంక్తి  -  నిర్మలమయ్యెఁ బున్నెంబు సేసె.
భూమి పాలక! నేఁడుగా మా తమః పట  - లంబు విరిసెను చిత్తంబు మెర(శకట రేఫ)సెఁ
గాశ్యపీ వర! నేఁడుగా మా వనస్థలుల్  -  ధన్యంబులయ్యె, శస్తతఁ జెలంగ్గె.
గీ:-
నీ హిత క్రియ నిల నేఁడ నెగడఁ గల్గెఁ  -  గాన నేమని చెప్పుదు మానవేంద్ర!
జంతు జాలంబు లెల్ల నీ శరణమంది  -  యుండెఁ గాకున్న జీవించి యుండఁ గలవె? ౫౦.
ఓ క్ష్మా తలాధిపా! నేడుగా మా మనోభీష్ఠములు తీర~ గలిగెను! మా నోములు ఫలించెను.
ఓ గహ్వరీ(భూ)పతీ! నిన్ను చూచినందున మా నయన పంక్తి నిర్మలమయ్యెను. మా కన్నులు పున్నెము సేసెను కదా!
ఓ భూమి పాలకా! నేడుగా మా తమః పటలము౯అజ్ఞానము సమూహము) విరిసె(విడిపోయె)ను. చిత్తంబు మెర(శకటరేఫ)సెను
ఓ కాశ్యపీవర! నేడుగా మా వనస్థలులు ధన్యములయ్యెను. శస్తత(ఖ్యాతి)తో చెలంగెను.
ఇలా స్థలము నీ హిత క్రియ చేత నేఁడ నెగడఁ గల్గెను.కావున మానవేంద్రా! ఇంక ఏమని చెప్పుదును. జంతు జాలంబు లెల నీ శరణమంది ఉండెను కదా. కాకున్నచో జీవించి యుండ గలవె?
(సశేషం)
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.