గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, సెప్టెంబర్ 2011, ఆదివారం

గురువంటే ఇలాగుండాలి (పెద్దల అభిప్రాయాలు)

ఆర్యులారా!
ఉపాధ్యాయ దినోత్సవం వస్తున్న సందర్భంగా అనేకమంది అనుభవజ్ఞులయిన కవి పండితులు గురు శిష్యుల విషయంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను పద్య, గద్య రూపంలో ప్రకటించారు. గురువులు తమ మూర్తిమత్వానికి మెఱుగులు దిద్దుకోడానికి అవశ్యాచరణీయ యోగ్యమైన భావనలను వీరంతా వెలువరించారనడంలో సందేహం లేదు.
వాటిని చూద్దాం. 
పండిత నేమాని అన్నారు...
గురు శబ్దంబునకే యుదాహరణమై కూర్మిన్ ప్రకాశించుచున్,
సరసోత్సేకమయాంతరంగుడగుచున్ ఛాత్రాళికిన్ దైవమై
కర మొప్పారుచు, సాధు బోధనములన్ గావించుచున్, జ్ఞాన భా
స్కర బృందంబులుగా నొనర్చు గురు సంస్కారంబు నెన్నందగున్! 
వీరు గురువు అనే పదానికి చాలా అద్భుతమైన నిర్వచనాన్ని తప పద్యం ద్వారా వివరించడం సహృదయులైన గురువుల అదృష్టంగా భావిస్తున్నాను.
వీరే నన్ను ఉద్దేశించి మరొక పద్యం కూడా వ్రాసి నన్ను ఆశిర్వదించారు. అదీ ఇక్కడ చూద్దాము.   
అయ్యా!
గురులన్ మించిన విద్వదుత్తముడవై కొండంత లక్ష్యంబుతో
పరితోషంబున శిష్యకోటిని కళాపారీణులన్ జేసి భా
సుర యోగంబుల నొంది ఛాత్రులలరన్ శుద్ధాంతరంగమ్ములో
పరితృప్తింగని యొప్పు నీ సుగుణ శోభాదీప్తి వర్ధిల్లుతన్!
పండిత నేమాని రామ జోగి సన్యాసిరావు అవధాని వర్యుల అవ్యాజానురాగానికి పొంగిపోతూ వారికి  ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను. 
మందాకిని గారు తమ అభిప్రాయాన్ని చక్కగా మన"కందం"గా వివరించారు. చూడండి.
గురువుల నుపదేశింపగ
గురువుల కేఁదగును.వారిఁ గొలువగఁ, దనపై
కరుణాదృక్కులఁ గొనుమని
దరిజేర వలయును. శిష్య ధర్మంబిదియే.
గురు ధర్మాన్ని నిర్వచింప తనకు అర్హత లేదని, శిష్యధర్మాన్ని చక్కగా వివరించారు మందాకిని గారు. ఓహో! ఎంతటి విధేయత!
చదువులు నేర్పుచు,శిష్యులు
ముదముగ నున్నత గతులును,మోక్షపు దారుల్
వెదకెడి పరిణతి నిత్తురు.
సదయులు గురువుల నుతింప శక్యమె మనకున్?
అని వ్రాసి తమ హృదయాన్ని ఆవిష్కరించారు.
తానే గురువైతే ఏం చేస్తారో అన్న విషయాన్ని వివరించడం ద్వారా గురువుకు నిర్వచనం చెపారు మందాకిని గారు.అదీ చూదండి.
ఆర్తిగ నేను నేర్పెదను, హాయిగ భీతులనెల్లవీడుచున్
నేర్తురు, పిల్లలందరిట నిత్యము నిష్ఠగ మక్కువెక్కువై
కీర్తులు కోరనెప్పుడును కీరపుఁ బల్కుల చిన్నవాండ్రకు
న్పూర్తిగ, నాశతీరగనుఁ, బొందుదు నేనిక నాత్మతృప్తినే.
కారుణమూర్తియై జనుల గౌరవభావనకాలవాలమై
ధీరగుణంబులన్ సరళ దృష్టినిఁ గల్గి సదానుకూలుఁడై
మారని శ్రద్ధతో గురువు మానక బోధలఁ పాఠనమ్ములన్ 
చేరిన శిష్యులందుఁదగు శీలగుణమ్ములఁ బెంచగాదగున్.
నిజంగా ఎంతటి ఔన్నత్యం తొణికిసలాడుతోందో చూచారా మందాకిని గారి అభిప్రాయంలో?
ఇంత చక్కటి వివరణ నిచ్చిన మందాకిని గారికి ధన్యవాదాలు తెలియ జేసుకొంటున్నాను.
రాఘవ అన్నారు...
సిద్ధం సత్సంప్రదాయే స్థిరధియమనఘం శ్రోత్రియం బ్రహ్మనిష్ఠం
సత్త్వస్థం సత్యవాచం సమయనియతయా సాధువృత్త్యా సమేతమ్,
దమ్భాసూయాదిముఖ్యం జితవిషయగణం దీర్ఘబన్ధుం దయాళుం
స్ఖాలిత్యే శాసితారం స్వపరహితపరం దేశికం భూష్ణురీప్సేత్.
-- శ్రీశ్రీశ్రీ వేదాంతదేశికాచార్యులవారు.మన రాఘవ దేశికులకు ఉండవలసిన లక్షణాలను  శ్రీశ్రీశ్రీవేదాంత దేశికాచార్యులవారు చెప్పిన నిర్వచనాన్ని మనకందించారు.
ఎంత చక్కని నిర్వచనమిది!
దేశికులు(గురువులు) సత్సంప్రదాయసిద్ధి కలవారై ఉండాలి. సుస్థిర జ్ఞానులై యుండాలి. పాపరహితులై ఉండాలి. శ్రోత్రియులై ఉండాలి. సత్వము కలవాడై ఉండాలి. సత్యవాకై ఉండాలి. సమయ పాలకుఁడై ఉండాలి. సాధు ప్రవృత్తి కలవాఁడై ఉండాలి. దంభము, అసూయ మున్నగు వాటిని జయించినవాడై ఉండాలి. దీర్ఘ బంధువై ఉండాలి. దయాళువై ఉండాలి. స్వ పర హితుఁడై ఉండాలి.
ఒక ఉపాధ్యాయుఁడు గురువు అవాలి అంటే ఇన్ని సల్లక్షణాలూ ఉండి తీరవలసిందే. అట్టి గురువును శిష్యులు నిరతమూ ఆరాధించ వలసిందే. ఎంతటి చక్కని నిర్వచనము! 
ఇంతటి చక్కని శ్లోకాన్ని అందించిన చిరంజీవి ఆపరమాత్మ కృపామృతాన్ని గ్రోలుతూ ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.

గోలి హనుమచ్ఛాస్త్రి అన్నారు...
గురువు బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుని కన్న
మించి నట్టి వాడు; మంచి నెపుడు
నేర్పి యాచరించి నిష్ఠతో లోకాన
నిలువ వలయు, వెలుగు నీయ వలయు.
గురువనఁబడే వ్యక్తి త్రి మూర్తులకన్న నధికుఁడని, ఎప్పుడూ మంచినే తా నాచరిస్తూ, మంచినే నేర్పుతూ, నిష్ఠా గరిష్ఠుడై లోకంలో స్థిరుఁడవాలనీ, లోకానికి వెలుగు నీయాలనీ మన ప్రియ మిత్రులు శ్రీ గోలి హనుమచ్ఛాస్త్రిగారు చిన్న ఆటవెలది పద్యంలో అనంతమైన భావాన్ని పొందుపరచి, వివరించారు.  
అల్పాక్షరములలో అనల్పార్థ రచన చేయగలిగేవాఁడే కవి అని మన ఆలంకారికుల వివరణ.
ఆ లెక్కన మన హనుమచ్ఛాస్త్రిగారు మన ముందున్న చక్కని కవి అనడంలో సందేహం లేదు. వారికి పరమాత్మతోడు ఎప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాను.
మిస్సన్న అన్నారు...
విద్యార్థులను స్వంత బిడ్డలుగా నెంచి - బంగరు భవితకు బాట వేయు. 
మాతృ భాషను నేర్వ మమతను రగిలించి - అన్యభాషాసక్తి నాదరించు.
నీతిని, సఛ్ఛీల నిరతిని బోధించి - యుత్తమ పౌరులౌ యునికి తెలుపు. 
ఋజు మార్గ వర్తియై రేబవల్, బోధించు - మార్గాన చనియెడు మనికిఁ గలుగు.
అన్య ప్రవృత్తుల ననుసరింపక తన - వృత్తికి బద్ధుడై వెలయు చుండు. 
విద్య పరమార్థమును దెల్పి విశదముగను
భావి భారత పౌరుల పాలి దైవ 
సదృశుడై యొప్పు గురువెగా సద్గురువగు? 
కాని నాడా గురువు కొఱగాని బరువు. 
మన మిస్సన్న గారు కూడా గురువుకు ఉండవలసిన గురుతర బాధ్యతలను చక్కగా వివరించారు. అలా లేని నాడు అతఁడు గురువు కాదని, భూమికి బరువనీ నిష్కర్షగా చెప్పారు. కొంచెం నిష్టూరంగా ఉన్నా వీరి మాటలు యదార్థం.
మిస్సన్నగారికి ఆ పరమాత్మ అనుకూలుఁడై ఉండాలని ఆశిస్తున్నాను. 
శ్రీపతిశాస్త్రి అన్నారు...
శ్రీగురుభ్యోనమ:
మహానుభావులు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి సుమాంజలుల నర్పిస్తూ,ఆ మహనీయుని జయంతి సందర్భముగా నేటి ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులందరకు శుభాకంక్షలు తెలియజేస్తున్నాను.
గురువై దేశపు పరువై
గురుతర బాధ్యతలనెపుడు గుర్తించుచు తాన్
పరవశమున పాఠములను
మురిపింపగజెప్పునట్టి మూర్తికి జేజే
బడినే గుడిగా దలచుచు
బడి పిల్లలె బిడ్డలనుచు వాత్సల్యముతో
బుడతల నడతలు దిద్దగ
నడుగిడు యొజ్జలకు భక్తి నంజలులిడుదున్.
శ్రీపతి శాస్త్రి గారు "గురువును గురువు కాదు అతఁడు దేశము యొక్క పరువు" అని చెప్పడంలోనే ఉంది గురువుకుండే బాధ్యత ఎంతటి మహత్తరమైనదోనన్న విషయం.అట్టి ఉపాధ్యాయులకు జేజేలుకొట్టారు మన కవి. అంతే కాదు. బడి పిల్లలకు మనస్పూర్తిగా విద్యాబోధన చేసే గురువులకు జేజేలు కొట్టుతున్నారు మన కవి. 
చాలా చక్కని గౌరవాన్ని ఇచ్చారు గురువులకు మన శాస్త్రి గారు.
వారికి నా అభినందనలను తెలియ చేసున్నాను.
గన్నవరపు నరసింహ మూర్తి చెప్పారు.
గురువుల యెడ భక్తి భావము మాకుంటుంది అని చెబితే మా ఊరిలో గురువులు ( టీచర్లు ) చాలా ఆశ్చర్యపోతారు.ఇక్కడ అంతా ఉద్యోగ ధర్మము,వ్యాపారమే గాని విశేష భావాలకు తావు లేదు. చక్కని గురువులు నాకు లభించారు. నేను అదృష్టవంతుడినే !
స్థిరమగు జ్ఞానసంపదలు శిష్యుల కిత్తురు పూని శ్రద్ధతో
గురుతర బాధ్యతల్ గొనుచు కోమలహృద్యులు దివ్యసద్గురుల్   
వరమది సద్గురుల్ గలుగ, వారిని గొల్చెడి శిష్యపాళియున్. 
పరమ పవిత్ర బంధ మిది, ప్రాకట మయ్యెగ పూజ్యభూమిలో !       
డా.గన్నవరపు నరసింహ మూర్తి గారు దివ్యమైన సద్గురువులు ఏమి చేస్తారో చెప్పడం ద్వారా ఏమి చెయ్యాలో చెప్పారు తమ పద్యం ద్వారా. భారతావనిపై గురు శిష్య పవిత్ర బంధాన్ని అద్భుతంగా వివరించారు.
వారి మనోహర భావనా సంపత్తిని అభినందిస్తున్నాను. 
ఇంకా ఇంకా అనేకమంది  తమ హృదయంలో గురువుకు గల అసాధారణమైన స్థానాన్ని గూర్చి, గుధర్మం వ్షయంలో తమ అభిప్రాయాలను ఎంతో చక్కగా వివరించి వ్రాసారు. అందరికీ నా కైమోడ్పులు.
గురుస్థానంలో ఉండి ప్రశంసింపఁ బడుతున్న ప్రతీ ఒక్క గురువుకూ నా హృదయ పూర్వక అభినందనలు, కైమోడ్పులు.
 జిగురు సత్యనారాయణ అన్నారు.
పంచ చామరం:
సునామి వంటి జీవితాన సూచి వోలె మారురా
జనాల శంకలన్ని తీర్చు జ్ఞాన దాత తానురా
మనాన ద్వేషమేమి లేని మంచి మానసంబు రా
ధనాల మించు విద్యలిచ్చు దాతయే గురుండురా
!
చిరంజీవి జిగురు సత్యనారాయణ మానవుని జీవనస్థితిని వివరించి, గురువు నిర్వహిస్తున్న పాత్రను చక్కగా వివరించారు. వారికి నా అభినందనలు. 
రేపే కదా గురు పూజా దినోత్సవము. శిష్య ప్రశిష్యాళిచే సద్గురువులందరూ పశంసింపఁబడి పూజింపఁ బడుదురు గాక. 
జైశ్రీరాం.
జైహింద్. 
Print this post

21 comments:

Pandita Nemani చెప్పారు...

అయ్యా! రామకృష్ణ గారూ! శుభాశీస్సులు. అవధరించండి:

మన కవి రామకృష్ణ శుభమానసు దీక్ష యకుంఠితంబు.నె
మ్మనమున వాని స్ఫూర్తి యొక మంత్రమొ, తంత్రమొ, తంత్రమో యనన్
దనరు విశేష వాగ్విభవ ధార సుధారస ధార యట్లు న
య్యనువున పొంగి వచ్చి ప్రమదాంబుధి దేల్చును నన్ను నంతటన్

మిస్సన్న చెప్పారు...

ఆర్యా! గురు పూజోత్సవానికి మధుర భావనా పరీమళ శోభిత పద్య ప్రసూనాలను సిద్ధం చేశారు. సద్గురువులందరికీ కైమోడ్పులు.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

గురువుగారూ,
ఇందరి అభిప్రాయలూ (గురువుల గురించి) విన్నందుకు సంతోషం కలిగింది. ధన్యవాదములండి.
ఇక మీరు మావంటి శిష్యులు ఎలా నడచుకోవాలో చెప్పి ధన్యులను చేయగలరు.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

ఆర్యా ! మీరు సద్గురువులకు అందించిన పద్య సుమ మాలలో మాకు భాగస్వామ్యం కలిగే అదృష్టం కల్పించినండులకు ధన్యవాదములు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యులారా!
గురువులను సద్గురువులుగా ప్రభావితం చేసిన మహనీయుల పద్యాలే ఆంధ్రామృతం ద్వారామీకందించ గలిగాను. ఐతే చాలా మంది పద్యాలు వ్రాసిన మహనీయుల చిత్తరువులను కూడా ఉంచితే బాగుండెది అని సూచిస్తున్నారు.
ఈ మహనీయుల చిత్తరువులు ఈ కవులు నాకు పంప గలరనీ, అవి తప్పక ప్రకటించే అవకాశం నాకు కలుగుతుందనీ భావిస్తూ తమ పద్యాలతో పాటు తమ ఫొటోలను కూడా పంప వలసినదిగా ఈ కవులందరికీ తెలియ జేస్తున్నాను.

జిగురు సత్యనారాయణ చెప్పారు...

పంచ చామరం:
సునామి వంటి జీవితాన సూచి వోలె మారురా
జనాల శంకలన్ని తీర్చు జ్ఞాన దాత తానురా
మనాన ద్వేషమేమి లేని మంచి మానసంబు రా
ధనాన్ని మించు విద్యలిచ్చు దాతయే గురుండురా!!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

గురూత్తమున్ వచించినారు కోర్కె తీరె పండితా!
సురోత్తముండు మీర లేఁడు శోభఁ గొల్పునట్టియా
గురూత్తమున్.మనంబు పెట్టి కూర్మితోడ శిష్యులన్
ధరా తలంబు నందు గాచు ధన్య మూర్తిగా, కనన్!

జిగురు సత్యనారాయణ చెప్పారు...

పంచ చామరం:
ధరాధి నాయకుండుకైన దారి లేని వానికై
న రాజుకైన పేదకైన నాతికైన ప్రీతితో
వరాల విద్యలన్ని నేర్పి వార్ధి వోలె నిల్చురా
పరాత్పరుండె తాను పాద పద్మమంటఁ జాలురా!!

Pandita Nemani చెప్పారు...

అయ్యా!
శ్రీ జిగురు సత్యనారాయణ గారి పద్యం 4వ పాదంలో "ధనాన్ని" బదులుగా "ధనమ్ము" అందాము.

అజ్ఞాత చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:
ఉపాధ్యాయదినోత్సవ శుభాకాంక్షలు
ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులకు నా నమస్కారములు

శంకరనారాయణ శాస్త్రి, 9 వ తరగతి

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

చిరంజీవీ! శంకర నారాయణ శాస్త్రీ! నీ గురు భక్తికి సంతోషం కలిగింది. దీర్ఘాయుష్మాన్ భవ! విద్యాభివృద్ధిరస్తు.

జిగురు సత్యనారాయణ చెప్పారు...

పండిత నేమాని గారు.
మీరు సూచించిన సవరణ బాగుంది. ధన్యవాదాలు.

అజ్ఞాత చెప్పారు...

తల్లి తండ్రులకు తమసంతానము మీద ఎంత మక్కువ వుంటుందో ఒక సద్గురువునకు తన యొక్క మంచి శిష్యులమీద అంతకన్న ఎక్కువ వాచ్చ్హల్యము వుంటుంది. శిష్యులు వృధ్ధ్హి లోనికి వచ్చిన తరువాత తల్లితంద్రులకంటే ఎక్కువగా సంతొషించేవాదు గురువు.
ఒకే తరగతి లొ తనపిల్లలు చదువు తున్నా కూడా బాగాచదివే విద్యార్థ్హిని తన పిల్లలకంటే ఎక్కువగా అభిమానించే గురువులు నాకు తెలుసు. అందువలన గురువు యొక్క పాత్ర ప్రతి ఒక్కరి జీవితం లోను, అది కూడ చిన్నప్పటి గురువుల ప్రభావము మరీ ఎక్కువగా వుంటుందనేది నిర్వివాదాంశం. ఆలాంటి గురువు తమ కర్తవ్యాన్ని బాధ్యతను ఎరిగి , మరియు పిల్లలు తమ గురువులను ఆదరించి గౌరవించే విధంగా ఈ గురు పూజొచ్చవం నుండి మరలా పునరంకితం అవ్వలని ఆకాం క్షిస్తూ. .. G.Srinivas HYD

Pandita Nemani చెప్పారు...

అయ్యా! ఔత్సాహికులైన కవులకు కొన్ని సలహాలు.
- వాడుక భాష కాక వ్యాకరణబద్ధమైన భాషనే ఉపయోగించుదాము.
- యడాగమానికి నుగాగమానికి వాడుక తెలుసుకొందాము.
- పునరుక్తి దోషాలు వద్దు.
- అన్వయము ముఖ్యము. పద్యము చదివే సరికి హాయిగా అర్థమవాలి.
- చేతురు కోతురు వంటి ఉపయోగాలు వద్దు.
- దుష్ట సమాసాలు వద్దు.
అందరికి శుభాశీస్సులు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

జీ.శ్రీనివాస్ గారూ!
చాలా సంతోషండీ.గురువుల ఔచిత్యాన్ని చక్కగా వివరించి చెప్పారు. సద్గురువు ఎలాగుంటారన్నది మీ మాటలద్వారా స్పష్టమౌతోంది. అట్టి గురువులు తమపై గల గురుతరమైన బాధ్యతలను గుర్తెరగాలనీ, సమాజానికి పునరంకితం కావాలనీ చాలా చక్కగా చెప్పారు. మీకు నా అభినందన పూర్వక ధన్యవాదములు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! సన్యాసి రావు గారూ! మీ సూచనలు చాలా చక్కగా ఉన్నాయి.
ఐతే మీరన్నట్టుగా నిర్దోషత ఉండాలంటే దోష వివరణ కావాలి.
దయచేసి మీరు బ్లాగ్ రచయితల పద్యాదులలో
దొర్లుతున్న దోషాలను గుర్తించినట్లైతే అది వెంటనే వారి దృష్టికి తీసుకొని వెళ్ళి, ఈ ప్రయోగం అసాధువు. ఇలా ప్రయోగిస్తే సాధువు అని వివరించినట్లైతే కొన్నాళ్ళకు మీరు సూచించిన విధంగా రచన సాగుతుందండి. తప్పక మీ సహకారం తోనే ఈ పని సాధ్యమౌతుందని మనవి చేస్తున్నాను.

Pandita Nemani చెప్పారు...

అయ్యా! రామకృష్ణ రావుగారు!
శుభాశీస్సులు. మీరు ఉపాధ్యాయ వృత్తిలో తలపండిన వారు. మీరు గమనించలేని దోషాలు ఉంటాయా? ఏదో నా మీద అభిమానంతో నా పై ఒక బాధ్యత వేస్తున్నరు గాని.
ఐనా మీ వేడుక ప్రకారమే చేయుటకు ప్రయత్నిస్తాను.

Pandita Nemani చెప్పారు...

ఛి. జిగురు సత్యనారయణ గారు! శుభాశీస్సులు.
మీ ఫోను నంబరు తెలియజేస్తే మీకు కొన్ని సూచనలు చెయ్యగలను.
నా నంబరు: 0891 - 2565944 మరియు 9440233175
సన్యాసిరావు

కంది శంకరయ్య చెప్పారు...

నిరతము విద్యాబోధన,
పరహితభాషణము, శష్యవాత్సల్యంబున్,
వరశాస్త్రజ్ఞానమ్మును,
గురుతరవర్తనము గల్గు గురునకు జేజే!

కంది శంకరయ్య చెప్పారు...

పై పద్యంలో ‘శష్య’ను ‘శిష్య’గా చదువుకొనవలసిందిగా మనవి. టైపాటు ...

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

పాండితీ స్రష్టలు , గురువులు , సరస్వతీ పుత్రులు , పూజ్యులు , అందరు మంచి సలహాలు , సూచనలే కాక చక్కని పద్యాలను అందించి , అమృత వర్షాన్ని కురిపించి నందులకు అందరికీ పేరు పేరునా నమస్కృతులు. పండిత నేమాని వారు మరిన్ని విషయాలను తెలియ జేసినండులకు హృదయ పూర్వక పాదాభి వందములు.
తమ్ముడు చింతా వారి బ్లాగులో అడుగిడి నందుకు నా జన్మ ధన్యమైంది. ఇంతటి పండితుల మధ్య నా పేరు ? ? ? అసలు నాకు అర్హత ఉందా ? అని ? ? ? కనీసం చదవ గల అదృష్టం కలిగి నందుకు , కాదు , కాదు , కలిగించి నందుకు తమ్ముని మనసారా ఆశీర్వదించి , " ఈ అమృత ఝరి శతాబ్దాల దిగంతాలవరకు కీర్తి ప్రతిష్టలతో వెల్లి విరియాలని " అక్క

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.