గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, జులై 2010, సోమవారం

ఆంధ్రామృత హితులకు ప్రణతులు.

సీll
ఆంధ్రభాషకు మించి యానంద మందించి
. . . . . . . . . హితముఁ గూర్చెడు భాష వెతక; లేదు.
ధ్రావిడ భాషల తలమానికమ్మిది. 
. . . . . . . . . తుహిన కరునివోలె మహిమ కలది. 
మృదువైన పదములు మదులనాకర్షించు.
. . . . . . . . . య యుక్త శబ్ద నిలయ సుధాబ్ధి. 
త్వస్వరూపమహత్వమ్ముఁ జూపెడు;
. . . . . . . . . కుముదినీ పతి మెచ్చు ప్రముఖ భాష.
తే.గీ.ll
ప్రథిత కవివరు లీభాష ప్రాణమగు ప్ర 
వ మని పొగడు. విద్వజ్జన వరు లెన్ను.
తుదయె లేనట్టి యానంద మధువు నొసగు.
లుబ్ధ కవియైనఁ బొగిడెడు శబ్ద కలిత.
భావము:-
ఆంధ్ర భాష కంటే అధికమగు ఆనందమును; క్షేమమును కలిగించెడి భాష ఎంత వెతకినను మరి యొకటి కానరాదు. ఈ మన ఆంధ్ర భాష ద్రావిడ భాషలకే తలమానికము. చంద్రునివలె సహజ మ‘హిమా’న్వితమైన భాష. ఈ ఆంధ్ర భాష యందుగల మృదువైన పద సంపద పఠితల; శ్రోతల హృదయములను ఆకర్షించును. లయాన్వితమైన శబ్దములకు స్థానమైన అమృత సాగరమీ భాష. ఆత్మ స్వరూపమునకు గల గొప్పఁ దనమును చూపగలిగిన భాష మన యాంధ్రము. ఆ శ్రీమన్నారాయణుఁడే ప్రశంసించెడి ప్రముఖమైన భాష యిది. ప్రఖ్యాతులైన కవీశ్వరులు ఈ మన యాంధ్ర భాషను జీవ కోటిలో ప్రాణమై యొప్పెడి ప్రణవ స్వరూపమగు ఓంకార నాదముగా పొగడుదురు. పండిత శ్రేష్టులు ఈ మన యాంధ్రమును ప్రత్యేకించి గుర్తింతురు. అంతే లేని ఆనందమనెడి అమృతమునొసగు భాష మన యాంధ్రము. ఆది కవి వాల్వీకియైనను పొగడే విధముగ నుండెడు చక్కని శబ్ద సముదాయము కలది మన అమృతోపమానమైన యాంధ్ర భాష.
మిత్రులారా! 
ఈ పద్యమున మీ కేదైనా ప్రత్యేకత గోచర మగు చున్నదా? శొధించి చూడుడు.
జైశ్రీరాం.
జైహింద్. Print this post

15 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

అపురూపమైన మన భాష గొప్పతనాన్ని చక్కగా చెప్పారు. అభినందనలు.

చదువరి చెప్పారు...

ఆంధ్రామృత హితులకు ప్రనతులు!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

చదువరికి తెలియకుండునె?
మదిలో గల భావ రచన మధుర పదములన్
విదితము చేసిరి. ధన్యుఁడ.
ముదమున గొను ధన్యవాదములను చదువరీ!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మందాకినీ ధన్యవాదములు.
పద్య రచనలో వివిధ పద గోపనము అనెడి ఒక చిత్ర కవితా ప్రక్రియ కలదు. సీసపద్య పూర్వార్థపాద ప్రథమాక్షరములు పిదప ఉత్తరార్థపాదముల ప్రథమాక్షరములు; మరియు గీత పద్యమున గల ప్రతిపాద ప్రథమాక్షరములు తీసుకొనినచో ఈ సీస పద్యమున గోపనముగా ఉంచఁ బడిన వివిధ పదములు వ్యక్తమగును. చదువరి గారు ఆ పదములను బహిర్గతము చేసిరి.
గమనింప మనవి.

కొత్త పాళీ చెప్పారు...

అనేక బంధ రూపాల్లో పద్యాలు రాసిన మీకు ఇటువంటి చమత్కారం ఒక లెక్కా? :)

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

భలే భలే!
మీరు వివరించాకే అర్థం చేసుకోగలిగాను.

సురేష్ బాబు చెప్పారు...

చాలా బాగుందండి ఈ ప్రక్రియ....
ఇంకో ప్రక్రియ చూసానండీ కానీ అదేదో సరిగా గుర్తురావడం లేదు....కొద్దిగా గుర్తుంది...అదే ప్రక్రియో చెప్పగలరు...

"ఉధృతనగ నగభిదనుజ దనుజకులామిత్ర మిత్ర శశిదృష్టే
దృష్టేభవతిప్రభవతి నభవతికిం భవతిరస్కారః"

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

హితము గూర్చెడి భాష వెతక లేదు
తుహిన....మహిమ
లయ...నిలయ ఇలా చదువు తుంటే ఎంత బాగుందొ
చక్కని పద్యానికి చిక్కని అభినందనలు [ఇక్కడ " చిక్కని = చిక్కనైన ]

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

సంతోషం సురేష్ బాబూ!
మీకు గల రసాస్వాదన తత్పరతకు అభినందిస్తున్నాను.
మీరు ఉదహరించినది ఛేకానుపెఆసాలంకారము. ఒక పదమునందలి చివరి రెండు వర్ణములను గైకొని తరువాత పదమున మొదటి రెండు వర్ణములుగా ప్రయోగించిన ఛేకానుప్రాసాలంకారమనఁబడును.
ధన్యవాదములు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రాజ రాజేశ్వరీ అనుగ్రహం ఉండాలే గాని భక్తిగలిగినవారు నెరవేరని సత్ సంకల్పమేముంటుందక్కా!ధన్యవాదములు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

స్వామీజీ! అంతా మీ అభిమానం.మీవంటి సహృదయుల ప్రోత్సాహం. ధన్యవాదములు.

రవి చెప్పారు...

బావుంది. ఇటువంటిదే ఓ పేదబ్రాహ్మడు రాజుతో మొరపెట్టుకుంటూ వ్రాసిన పద్యం ఉన్నది. పద్యం మొదటి అక్షరాలతో "రాజా! ఈ పిల్లకు పెళ్ళి చెయ్యవయ్య" - అని కూర్చాడు ఆ పండితుడు.

ఈ ఆలోచన చంటబ్బాయ్ సినిమాలోనూ వచనానికి వాడారు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఔను రవీ! అన్వేషించిన కొద్దీ లభిస్తూ ఉంటాయి సాహితీ నిధులు.

అజ్ఞాత చెప్పారు...

చాలా బాగుందండీ, కానీ ఒక్కటే లోపం గా తోస్తోంది. మీరు ఉపయోగించిన మన రాష్ట్ర పటం లో జిల్లాల పేర్లు ఆంగ్లంలో ఉన్నాయి. గమనించారా.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా!
నా కంటికి ఆంధ్రామృత పూర్ణ కలశంతో ఉన్న ఆంధ్ర మాత రూపమే తప్ప మరొకటి కనపడ లేదండి.
చాలా నిశితంగా పరిశీలించి చక్కగా తెలియ జేసినందుకు ధన్యవాదాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.