గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, మార్చి 2010, గురువారం

కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత 34.

కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత 34వ భాగము.
ఒక సీతన్  గొని పోయె  రావణుఁడు నాకొక్కొక్క వల్లీ నికుం
జకమందొక్కొక సీత యున్నది. పరిష్వంగంబులం బట్టెదన్
ప్రకటంబైన సహస్ర బాహువుల నే రాముండ నా భార్గవుం
డొక తచ్ఛత్రువు కార్త వీర్యుఁడునుఁ దా మున్నారు నాయందునన్. (వి.ర.క.వృ. కి.కాం. నూ.స. 1- 34. )
రావణుఁడు ఒక సీతను మాత్రమే ఎత్తుకు పోయినాడు. నాకు ఒక్కొక్క పూ పొదయందు ఒక్కొక్క సీత కనబడుతున్నది.  నేను ఈ సీతలను అందరినీ వేయి చేతులతో కౌగలించు కొందును.నేను రాముణ్ణి. నాలో ఒక పరశురాముఁడు అతని శత్రువైన కార్తవీర్యుఁడు ఉన్నారు. నాకిది అసాధ్యము కాదు.  
శ్రీ రాముఁడు ప్రియా విరహి. ఉన్మత్త అవస్థను చేరుకొంటున్నాఁడు. ఇప్పటి దశలో ఆయనకు ప్రకృతి యందు అంతటా సీత సాక్షాత్కరిస్తున్నది.  ఆ క్షణమున శ్రీ రామునకు తన వివాహ సమయమున తాను పరశురాముని నుండి గ్రహించిన సర్వ శక్తులు ఆయనకు స్ఫురించినవి. పరసురాముఁడు తన తండ్రియైన జమదగ్నిని చంపిన కార్త వీర్యుని వేయి చేతులను గండ్ర గొడ్డలితో నరికిన మహా వీరుఁడు. ఆ కార్తవీర్యుఁడెవరో కాదు. రావణాసురునే యుద్ధమునందు జయించి విడిచి పెట్టిన మహా వీరుఁడు.
రావణునే జయించిన కార్తవీర్యార్జునునే పరశురాముఁడు జయించినాడు.ఆ పరశురాముని సర్వ తేజస్సును గుత్తముగా స్వీకరించిన వాఁడు శ్రీరాముఁడు. కావున సహస్ర బాహువులతో సహస్ర జానకీ మూర్తులను కౌగలించుకొందునని శ్రీరాముఁడు పలికినాడు. 
పద్యంలో రాముని అవస్థను తెలుపుతున్న సంచారి భావము  ధృతి అనఁబడుతుంది. లోభము శోకము మొదలగువానివల్ల కలుగబోయే ప్రమాదములను ఈ చిత్త వృత్తి విశేషము అనఁదగిన ధృతి నివారిస్తుంది.
రసనిర్వహణనైపుణ్యము కలిగిన మహాకవుల వాక్కు సహజంగానే అలంకృతమై ఉంటుండి. ఏ భావమైనా హృదయమును అల్లకల్లోలము చేయుట సహజమే. విరహ దశయందున్న శోకము అనేకానేక భావములను సృజించుకొంటూ మరల వెనువెంటనే అంతర్హితము చేసుకొంటూ ఒకానొక క్షణమునందు కలిగిన ఊహను ప్రకటించుకొనే స్థితి మనము ఊహించుకొనవలెను.
రాముని విరహము యొక్క అనవధిభూతమైన పట్టరానిదైన శోక సంతప్తతను పద్యం ఆవిష్కరిస్తున్నది. వాల్మీకములో అందమైన పక్షులు నాకు యౌవనవతి చంద్రముఖి పద్మ నేత్ర యైనసీతను స్ఫురింపఁ జేస్తున్నవి. 
"శ్యామాం చంద్ర ముఖీం స్మృత్వా ప్రియాం పద్మనిభేక్షణామ్
దీపయంతీవ మే కామం - - - - - - - - - " అనినాడు శ్రీరాముఁడు.
విశ్వనాథ తన వర్ణనలో ప్రకృతి స్వరూపిణి యైన సీత రామునకు ప్రతి పొదయందు కనిపించుచున్నట్లు సహస్ర బాహువులతో ఆమెను పరిష్వంగము చేయుదునన్నట్లు వ్రాసెను. ఇది అద్భుతమైన వర్ణన.
ధృతి అనగా కృతార్థత. అనగా ఒకానొక ధైర్యమయిన అవస్థ. అతి వేలమైన దుఃఖంతో మునిగిన మానవుఁడు ఒక దశలో కించిత్ ధైర్యమును పూనుట అన్నమాట.
ఈ రస పోషణ అనునది కవి ప్రతిభననుసరించును.ఈ ఘట్టములో ఇది ఒక అందమైన పద్యము.
(ఇది శ్రీ బులుసు వేంకటేశ్వర్లుగారి ఉపన్యాస సారాంశము)
సెల్. 9949175899.
జైహింద్.    Print this post

1 comments:

అజ్ఞాత చెప్పారు...

కవి హ్రుదయాన్ని చక్కగ చూపగలిగారు. మంచి పద్యం తీసుకొని సమర్ధవంతంగ, అద్భుతమైన వివరన ఇచ్చిన మీకు నా నమస్కారాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.