గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, మార్చి 2010, సోమవారం

కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత 35.

http://www.telugupedia.com/wiki/images/2/2c/ViswanathaSatyanarayana.jpg
-----
ఆంధ్రామృత పాఠక బంధువులారా! విశ్వనాథ రామాయణ కల్ప వృక్షం పై సరైన రీతిలో సుస్పష్టంగా వ్యాఖ్య చెప్పగల పండితోద్దండులు చాలా అరుదుగా మాత్రమే ఉన్నారని చెప్పుకోవడంలో సందేహం లేదు.
-----అట్టి వారిలో సుప్రసిద్ధ కవివతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు వారి ఉపన్యాస సారాంశాన్ని మీ ముందుంచుతున్న వాటిలో ఇప్పుడు 35 వ భాగం చెప్పుకో బోతున్నాం.శ్రద్ధతో తెలుసుకోవాలనే ఆసక్తి కలవారు లేకపోరు కదా అనే భావనతో అపురూపమైన ఈ ఉపన్యాసాన్ని మీ ముందుంచడం జరుగుతోంది. ఇక చూద్దామా!
మునుపొక సీత కౌగిలికిఁ బొందిన సౌఖ్య మొకండె యిప్పుడో
జనకజలన్ సహస్ర శత సంఖ్యలఁ కౌగిళులన్ సుఖంబులన్
కనుగొనగా సహస్రమును గాక యొకండుగ దోచెఁ భ్రాంతి పొం
దిన మది విచ్చి పోయి సుదతీ విరహానల భాజనుండనై. (వి.రా.క. కి.కాం.నూ.స.35)
-----ఇది వరకు నాకు ఒక్క సీత పరిష్వంగమే లభించింది. కాని; ఇప్పుడో వందల వేల సీతల యొక్క కౌగిళుల లోని సుఖాన్ని పొందుతున్నాను. చూడగా చూడగా ఈ అనేక సీత రూపములు అన్నీ నాకు ఒక్కటి గానే కనిపిస్తున్నవి. సీతా విరహము అనే అగ్ని వలన నా హృదయం బ్రద్దలైంది కదా!
-----శ్రీరాముని విరహాతిశయాన్ని ప్రత్యక్షం చేస్తున్న పద్యమిది. క్రిందటి పద్యంలో సీతను నేను సహస్ర బాహువులతో కౌగిలించుకొంటాను అన్న శ్రీరాముఁడు ఈ పద్యంలో ఉన్మత్తుడైనట్లుగా కవి వర్ణించాఁడు. అంతలోనే ఆ ఉన్మత్తత నుండి తేరుకొని శ్రీరాముఁడు సహస్ర జానకిలను కాక ఒక్క సీతయే తోచు చున్నట్లు పలికెను. సీతా విరహం వల్ల తన హృదయమే బ్రద్దలైనదని ఆశ్వాసించుకొనెను.
-----సీత ప్రకృతి స్వరూపిణి. శ్రీరాముఁడు పరమ పురుషుఁడు. కాగా ఆ ధ్వనిని ఇక్కడ నిబద్ధం చేయడం లోనే కవి ప్రతిభ అంతా దాగి ఉంది. విశ్వనాథ తన రామాయణమును "సకలోహ వైభవ సనాథము" అని చెప్పుకొన్నాఁడు. రస నిర్వహణయందు ఆయన పోకడలు సూక్ష్మతమస్థాయి వరకు పోవును.
-----సీతా విరహమునందున్న శ్రీరామునకు ఎక్కడ చూచిన అక్కడ సీత కనఁబడుట; అందునా వేల వందల రూపాలతో సహజమే. ఆ సీతా ప్రకృతులను ఆయన కౌగిలించుకొనుటయు సహజమే. ఆ విరహ ఔత్కట్యము అట్టిది. ఆయన "సహస్రాక్షః సహస్ర పాత్" అని పురుష సూక్తము కీర్తించిన పరమ పురుషుఁడు. కాని మానవ అవతారమునెత్తిన శ్రీరాముఁడు ఏక పత్నీ వ్రతుఁడు. "రామస్య దయితా భార్యా నిత్యం ప్రాణ సమాహితా". రామునకు సీత ప్రాణాలతో సమానురాలైన భార్య. "ధర్మస్య పరిరక్షితా" అని రాముఁడు కీర్తింపఁబడినాఁడు. అట్టి రాముఁడు ఎంత విరహోన్మత్తుఁడైనను ఆ ఉన్మత్తత యందే ఒకింత తెలివిని పొంది అనేక రూపములలో కనిపించిన సీత మరల నాకు ఒక్కటిగానే కనిపించు చున్నదని చెప్పుట వాల్మీకి చెప్పిన నీతిమాన్ అను గుణమును స్ఫురింపఁ జేయుటయే కదా!
ఇది ఈ ఘట్టములో విశ్వనాథ శిల్ప నిర్వహణా నైపుణిని పతాక స్థాయికి కొనిపోయిన పద్యమని చెప్ప వచ్చును. చేతనాచేతనము లందు సమాన రీతిని ప్రవర్తించుట ఉన్మాదమని లక్షణకారుల తీర్మనము.
-----సామాన్యముగా కావ్యములలో నాయికా నాయకులు సుఖమో దుఃఖమో అనుభవించుచుందురు. ఆ సమయమున వారికి ప్రపంచమే తెలియదు. ఆ సుఖ దుఃఖములను నాటకమున చూచినను కావ్యమున చదివినను సహృదయునకు ఆనందము ఎక్కువగా కలుగును. అట్టి ఆనందము అనుభవించువాఁడే రసమును అనుభవించువాఁడు. సహృదయునకు ఏ రసమును అనుభవించుచున్నను ఆనందమే కలుగును. దుఃఖము కలుగదు. ఆ ఆనందానుభవం పొందిన సమయంలో అతనికి ఇంకేమీ తెలియదు. తనను తాను మరిచిపోవును.
అట్టి ఆనందానుభవాన్నిప్రసాదించే రచనయే విశ్వనాథ రామాయణము.
జైశ్రీరాం.
చూచాం కదా! 35వ భాగన్ని.
అత్యంత ఆసక్తికరమైన అత్యంత ఆలోచనామృతమైన అత్యంత అపురూపమైన తదుపరిదైన 36 వ భాగాన్ని అతి త్వరలో మీకోసం ముందుకు వస్తుంది. అంతవరకూ ఈ భాగంలోని ఆనందామృతాన్ని గ్రోలుదామా!
జైహింద్.
Print this post

3 comments:

Vasu చెప్పారు...

మాష్టారూ నెనర్లు. మీరు ఇవి, మీరు రాసిన పద్యాలు ఆడియో లా పెడితే ఎలా ఉంటుందో ఆలోచించారా? అలా పెట్టగలిగితే చాలా సంతోషిస్తాను. అదృష్టంగా భావిస్తాను.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ప్రియమైన వాసుగారూ!
మీ అభిమానానికి సూచనకీ ధన్యవాదాలు.
తప్పక ప్రయత్నిస్తానండి. ఐతే నాకా పరిజ్ఞానం ముందు కలిగించుకొని ప్రయత్నించ వలసి ఉందండి.

తప్పక ప్రయత్నిస్తాను.
నెనరులు;
భవదీయుఁడు;
చింతా రామ కృష్ణా రావు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు.విశ్వనాధ వారి " కల్ప వృక్షం " పై ఇంతచక్కని ఉపన్యాస వ్యాసాన్ని చదవగల అదృష్టం కలిగి నందుకు చాలా ఆనందం గా ఉంది.నిజం గానే విరహ వేదనలొ ముక్కలైన { పగిలిన అద్దం లాంటి }రాముని మనసుకు వందల వేల సీతల ప్రతి బింబాలు గా భ్రమించట కళ్ళకు కట్టినట్టుగా వర్ణించారు .ఇంత చక్కటి కావ్యాన్ని చదివించిన సోదరునికి రామకృష్ణా రావు గారికి అభినందనలు + ధన్య వాదములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.